Abn logo
Aug 4 2021 @ 00:21AM

ఒకటో తారీఖు.. ఇక కష్టమే!

జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు

ప్రతినెలా ఇదే పరిస్థితి

ఎప్పుడు జీతాలు వస్తాయో కూడా తెలియని పరిస్థితి

చిరుద్యోగుల పరిస్థితి దారుణం

35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు,

మరో 26 వేలమంది రిటైర్డ్‌ ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగులంటే అడగాల్సిన పనిలేదు.. ఠంఛన్‌గా ఒకటో తారీఖున జీతం పడుతుంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదీ ఇంతవరకు అటు బ్యాంకర్లకు గానీ, ఇటు ఇతర ప్రైవేటు వ్యాపారులు, దుకాణదారులకు ఉన్న గట్టి నమ్మకం. కానీ ఆ అభిప్రాయం వారిలో తొలగిపోతోంది. కారణం ప్రభుత్వ తీరు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు పడటం అనేది నాలుగైదు నెలలుగా గాడితప్పింది. అతికొద్దిమందికి ఒకటిన పడితే మరికొందరికి మూడు, నాలుగుల్లో, మిగతా వారికి ఎప్పుడు పడతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కీలకమైన శాఖల వారికి కూడా సకాలంలో జీతాలు అందడం లేదు. ఇక పింఛనర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి చెప్పనవసరం లేదు. దీంతో నెలనెలా ఒకటిన కట్టాల్సిన ఈఎంఐలు, ఇతర చెల్లింపులు, లోన్లు తదితరాలకు ఇబ్బంది అవుతోంది. జాప్యం కారణంగా కొందరు వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చివరకు పాల బిల్లులు, కిరాణా బిల్లుల విషయంలోనూ మాటపడాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో బయట పరపతి పోతుందని వారు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే  మున్ముందు నెలనెలా జీతాలు ఇస్తారో లేదోనన్న సంశయం అందరిలోనూ నెలకొంది.

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 3 : సర్కారు కొలువులు చేసేవారికి ఒకటో తారీఖు కష్టాలొచ్చిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులూ జీతాల కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ నెలకు ఆ నెల ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదు. క్షేత్రస్థాయి ఉద్యోగి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకూ కూడా ఇదే పరిస్థితి.  జిల్లాలో పనిచేసే ప్రభుత్వ అధికారులు, వివిధ కేడర్లలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సుమారు 35వేల మంది వరకు ఉన్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగులు 26వేల మంది, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ స్బిబంది మరో 10వేల మంది వరకూ ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం ప్రతినెలా 1వతేదీన సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వారి వారి బ్యాంకు అకౌంట్లలో జీతాలను జమచేస్తుంది. ఆయితే గత రెండు, మూడు నెలల నుంచి ఏ నెలకు ఆ నెల 1వతేదీన జీతాలు పడని పరిస్థితి లేదు. అసలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తాము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామా లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్కర కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.


రెండు శాఖల ఉద్యోగులకు అరకొరగా వేతనాలు

జిల్లావ్యాప్తంగా రెండు శాఖల్లోని ఉద్యోగులకు 3వతేదీ లోపు అరకొర వేతనాలు పడగా మిగిలిన శాఖల ఉద్యోగులకు వేతనాలు పడిన పరిస్థితి లేదు. సచివాలయ ఉద్యోగులు, జిల్లా పరిషత్‌లో పనిచేసే మినిస్టీరియల్‌ ఉద్యోగులకు మాత్రం 1వతేదీనే వేతనాలు పడ్డాయి. మిగిలిన శాఖల్లోని ఉద్యోగులకు 3వతేదీ వచ్చిన వేతనాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. 


వడ్డీలు కడుతున్న ఉద్యోగులు 

ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం ఈఎంఐల ద్వారా అప్పులు చేస్తుంటారు. అలాగే రుణాలు కూడా తీసుకుంటారు. 1వతేదీ జీతం వచ్చిన వెంటనే అటువంటి ఈఎంఐలను వడ్డీ లేకుండా చెల్లిస్తుంటారు. అయితే గత రెండు, మూడు నెలల నుంచి వేతనాలు సకాలంలో పడకపోవడంతో ఉద్యోగులు వడ్డీలతో ఈఎంఐలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ఉద్యోగులు ఇంటి అద్దెలు, పాలు, ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులను జీతాలు వచ్చిన వెంటనే తెచ్చుకుంటారు. అటువంటి వాటికి కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుతో తమ పరపతిపోతుందని కొందరు వాపోతున్నారు.


విశ్రాంత ఉద్యోగుల్లో మరింత ఆందోళన

విశ్రాంత ఉద్యోగులు ఎక్కువమంది పింఛన్ల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి ఉద్యోగులు తమ పింఛన్‌ ఎప్పుడు వస్తుందా అని ఏ నెలకు ఆ నెల ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు, మరొకవైపు వెంటాడుతున్న వ్యాధులతో ప్రతినెలా వైద్యసేవలు పొందుతున్న రిటైర్డ్‌ ఉద్యోగులు ఇప్పుడు పింఛన్‌ రాక వైద్యఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. 


వేతనాలపైనే చర్చ

జీతాలు చెల్లింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేక పోతున్నా నలుగురైదుగురు ఒకచోట చేరిన సమయంలో అందరి మధ్య వేతనాలపైనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగుల పట్ల పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే ఏ విధంగా కుటుంబాలను నెట్టుకురావాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇక రానురానూ అసలు నెలనెలా జీతాలు ఇస్తారో లేదోనన్న అనుమానాలు ఉద్యోగుల్లో బయలుదేరాయి.


మా బాధలను అర్థం చేసుకోవాలి

కూచిపూడి శరత్‌బాబు, ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ ఉద్యోగుల బాధలను అర్థం చేసుకోవాలి. నెలరోజుల కష్టపడి పనిచేసి వేతనాలు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతాల మీదనే ఆధారపడి పనిచేసే వారికి సకాలంలో అందకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల బాధలను అర్థం చేసుకొని సకాలంలో వేతనాలిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.


ప్రతినెలా ఇదే పరిస్థితి

చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రతినెలా వేతనాలు జాప్యం జరుగుతుండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రతినెలా 1వ తేదీ వచ్చిదంటే ఇంటి అద్దెలు, వివిధ రకాల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే జీతాలు సకాలంలో రాకపోవడం వల్ల అనేకమంది ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకొని గతంలో మాదిరిగానే వేతనాలిచ్చే విధంగా చూడాలి.


సకాలంలో వేతనాలు వచ్చే విధంగా చూస్తాం

వినుకొండ రాజారావు, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా చైర్మన్‌

చిరుద్యోగులకు సకాలంలో జీతాలు రాని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర కమిటీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రతినెల ఒకటినే వేతనాలు వచ్చే విధంగా ప్రయత్నిస్తాం. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రాకపోవడం వల్ల కుటుంబపోషణ కూడా కష్టంగా మారింది. ఈ సమయంలో జీతాల కోసం ఉద్యోగులు ఎదురుచూడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.