వేతన యాతన!

ABN , First Publish Date - 2021-10-22T05:28:30+05:30 IST

ఉద్దానం ప్రాజెక్ట్‌... ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల అపర భగీరథి. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 350 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్ట్‌. దాదాపు మూడు దశాబ్దాల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ పథకం విశేష సేవలందిస్తూ వస్తోంది

వేతన యాతన!
రిట్టపాడులో ఉద్దానం ప్రాజెక్ట్‌ పంప్‌ హౌస్‌




ఉద్దానం ప్రాజెక్ట్‌ సిబ్బంది ‘వేతన’ కేకలు

20 నెలలుగా అందని జీతాలు

దశాబ్దాలుగా సేవలందిస్తున్నా గుర్తించని ప్రభుత్వం

ఉద్యోగభద్రత కరువైందని ఆవేదన 

(వజ్రపుకొత్తూరు)

ఉద్దానం ప్రాజెక్ట్‌... ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల అపర భగీరథి. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 350 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్ట్‌. దాదాపు మూడు దశాబ్దాల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ పథకం విశేష సేవలందిస్తూ వస్తోంది. ఇటీవల ప్రాజెక్ట్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వాలు నిధులు విదల్చకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారింది. పనిచేస్తున్న సిబ్బందికి కూడా సక్రమంగా వేతనాలు అందలేదు. ఎనిమిది మండలాల్లో సుమారు 106 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా వీరు పనిచేస్తున్నా వేతనాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం వీరికి రూ.12,000 చొప్పున వేతనం అందిస్తున్నారు. కానీ ఏడాదికి, ఏడాదిన్నరకు ఒకసారి జీతాలు చెల్లిస్తున్నారు. గత 20 నెలలుగా వీరికి వేతనాలు నిలిచిపోయాయి. అధికారులు అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కార్పొరేషన్‌ పరిధిలోకి తెచ్చినా, వీరి ప్రస్తావన మాత్రం లేదు. దశాబ్దాలుగా పసనిచేస్తున్నా తమకు ఉద్యోగభద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘సమగ్ర’ పథకంపైనే ఆశలు

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకుగాను హిరమండలం గొట్టాబ్యారేజీ నుంచి వంశధార జలాలను తీసుకొస్తోంది. ప్రత్యేక పైపులైన్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పథకం అందుబాటులోకి వస్తే ‘ఉద్దానం’ ప్రాజెక్ట్‌ పరిస్థితి ప్రశ్నార్థకంగా మిగులుతుంది. వాస్తవానికి ఉద్దానం ప్రాజెక్ట్‌ దయనీయంగా ఉంది. కాలం చెల్లిన యంత్రాలు, పరికరాలతో నిత్యం సిబ్బంది కుస్తీలు పడుతున్నారు. పంపుహౌస్‌ల వద్ద,  ఇన్‌ఫిల్టరేషన్‌ బావుల వద్ద తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పైపులైన్లు లీకులకు గురవుతున్నాయి. దాదాపు పథకం కాల పరిమితి కూడా సమీపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తమకు సమగ్ర మంచినీటి పథకంలో అవకాశం కల్పించాలని ఉద్దానం ప్రాజెక్ట్‌ సిబ్బంది కోరుతున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం తమకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చి వేతనాలు సక్రమంగా చెల్లించాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-10-22T05:28:30+05:30 IST