Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీతాలు చెల్లించడం లేదు

  20 నెలలుగా చెల్లించని వైనం

 శాలిహుండం రక్షిత పథకం సిబ్బంది ఇబ్బందులు

శాలిహుండం (గార), నవంబరు 25: మండలంలో 82 గ్రామాలకు నిత్యం తాగునీటిని అందించే శాలిహుండం రక్షిత పథకంలో పనిచేస్తున్న 18 మంది క్షేత్రస్థాయి సిబ్బందికి గత 20 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా, గుండ అప్పలసూర్యనారాయణ శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.10కోట్ల వ్యయంతో శాలిహుండంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం శాలిహుండం వద్ద వంశధార నదిలో ఊటబావి,పంప్‌హౌస్‌ నిర్మించారు. నాలుగేళ్ల కిందట  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కృషి ఫలితంగా రూ.4.50 కోట్ల వ్యయంతో మరొక పంప్‌హౌస్‌, ఊటబావి ఏర్పాటు చేశారు. ఈ పథకం నిర్వహణకు 18 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో ముగ్గురు శాలిహుండం పంప్‌హౌస్‌ వద్ద, మరో ముగ్గురు గార పంప్‌హౌస్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన వారంతా క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. వీరికి గత 20 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మండల సర్వసభ్య సమావేశంలో కూడా ఈ సమస్య ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

 ఎప్పటికప్పుడు బిల్లులు పంపిస్తున్నాం 

శాలిహుండం ప్రాజెక్టులో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది జీతాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు  ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. ఇదే విషయాన్ని మా శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం.

- సీహెచ్‌ రామారావు, డిప్యూటీ ఈఈ (శాలిహుండం ప్రాజెక్ట్‌) 


Advertisement
Advertisement