ఆసరా ఏదీ?

ABN , First Publish Date - 2020-09-05T08:41:24+05:30 IST

అసలే నెల నెల గండం! ఆపై సరికొత్త భారం! ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు చెల్లింపుల కోసమే నానా ..

ఆసరా ఏదీ?

ప్రతిష్ఠాత్మక పథకానికే కరువైన ఆసరా

ప్రస్తుతం జీతాలకైతే డబ్బులొచ్చాయి

మరి పథకాలకు నిధుల సంగతేంటో! 

అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేట

రుణ వెసులుబాటు ఆశతో కేంద్రానికి లేఖ


అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అసలే నెల నెల గండం! ఆపై సరికొత్త భారం! ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు చెల్లింపుల కోసమే నానా తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని.. వరుసగా ‘పథకాల’ కష్టాలు వెన్నాడుతున్నాయి. ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించలేక సతమతమవుతున్న ఆర్థికశాఖ... ఈ ప్రక్రియను రెండు వారాలపాటు సాగదీసి, అప్పటికప్పుడు అప్పులు  తెచ్చి వీరికి సర్దుబాటు చేస్తోంది. రెండు నెలల నుంచి ఇలాగే చేసి  ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఈ నెలా అదే పరిస్థితి ఎదుర్కొంది. జీతాలకైతే ప్రస్తుతానికి డబ్బులు సమకూర్చుకోగలిగింది.


రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) నుంచి రూ.3,000 కోట్ల అప్పు తేగలిగింది. ఒక గండం గడిచిందని భావించేలోగా ఆసరా పథకం రూపంలో మరో గండం సిద్ధంగా ఉంది! ఈ నెల 11 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ... రాష్ట్రానికి ఆదాయం లేదు. అప్పుల పరిమితీ ముగిసిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా కేంద్రం పెంచిన అప్పుల పరిమితి వల్ల ప్రస్తుతానికి ఉద్యోగుల జీతాలకు నిధులు తెచ్చుకున్న ఆర్థికశాఖ అధికారులు... ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘ఆసరా’ పథకానికి నిధులు సమకూర్చుకునే మార్గాల అన్వేషనలో పడ్డారు. 


ఇదీ పరిస్థితి!

రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం కింద లభించిన అప్పుల పరిమితి రూ.30,000 కోట్లలో రూ.24,500 కోట్లను గత నెలకే రాష్ట్రం వినియోగించేసుకుంది. మిగిలిన అప్పును వచ్చే ఏడాది జనవరి నుంచి మాత్రమే తెచ్చుకోగలదు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాల కోసం మరో 0.5శాతం రుణానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం పెంచింది. దీని ప్రకారం ఏపీ అదనంగా రూ.5,000 కోట్లు అప్పు తెచ్చుకోవచ్చు. ఇందులో రూ.3000 కోట్లను ఉద్యోగులకు వేతనాల కోసం మంగళవారం ఆర్‌బీఐ నుంచి అప్పు తెచ్చింది. ఇంకా రూ.2,000 కోట్ల పరిమితి మాత్రమే మిగిలి ఉంది.


ఇవి కాకుండా ‘ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌’ ద్వారా రూ.11,000 కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకునే వీలుంది. అయితే ఇందుకు   బ్యాంకర్లు ఒప్పుకోవాలి. ఇదిలావుంటే ఈ లోపే ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఆసరా పథకాన్ని ఈ నెల 11వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకానికి రూ.6,000 కోట్లకుపైగా అవసరమవుతాయని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, ప్రస్తుతానికి చేతిలో ఉన్న ఆదాయం సున్నా కాగా, అప్పు పరిమితి 2,000 కోట్లు మాత్రమే. అనుకున్న సమయానికి   ఆసరా పథకం అమలు చేయాలంటే మరో  4,000 కోట్లు అవసరం. దీని కోసం ఆర్థికశాఖ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మరో 1.5 శాతం పెంచితే  మరో 15,000 కోట్లను తెచ్చుకోవాలని అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2020-09-05T08:41:24+05:30 IST