జీతాలు రావు.. ఇక రాకండి..!

ABN , First Publish Date - 2022-08-18T05:52:00+05:30 IST

‘ప్రభుత్వం నుంచి మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఎవరూ విధుల్లోకి రావొద్దు’ అని తాత్కాలిక లస్కర్లకు హెచ్చెల్సీ సీఈ శ్రీనివాసరెడ్డి సూచించారు.

జీతాలు రావు.. ఇక రాకండి..!
హెచ్చెల్సీ సీఈకి సమస్యను వివరిస్తున్న తాత్కాలిక లస్కర్లు

తాత్కాలిక లస్కర్లకు హెచ్చెల్సీ సీఈ సూచన

మూడేళ్లుగా జీతాలు రాలేదని బాధితుల ఆవేదన

సీఈ మాటలతో దిక్కుతోచని స్థితి

కణేకల్లు/బొమ్మనహాళ్‌ ఆగస్టు 17: ‘ప్రభుత్వం నుంచి మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఎవరూ విధుల్లోకి రావొద్దు’ అని తాత్కాలిక లస్కర్లకు హెచ్చెల్సీ సీఈ శ్రీనివాసరెడ్డి సూచించారు. కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌ డివిజన పరిధిలో దాదాపు 18 మంది తాత్కాలిక లస్కర్లు కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ యేడాది కాకపోతే మరో యేడాదైనా జీతాలు వస్తాయన్న ఆశతో వీరు కొనసాగుతున్నారు. హెచ్చెల్సీపై పర్యటనకు బుధవారం వచ్చిన సీఈ శ్రీనివాసరెడ్డిని బాధితులు కలిశారు. తమకు మూడేళ్ల నుంచి జీతాలు అందడంలేదని తెలిపారు. దీంతో సీఈ అలా స్పందించారు. జీతాలు వచ్చే పరిస్థితి లేనందున, ఇకపై విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని సీఈ చెప్పడంతో ఒక్కసారిగా తాత్కాలిక లస్కర్ల ముఖకవళికలు మారిపోయాయి. ఇప్పటివరకు చేసిన పనికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో లస్కర్లును నియమించుకోవాలని ఆదేశాలు వస్తే, అప్పటి నుంచి మాత్రమే జీతాలు వస్తాయని సీఈ స్పష్టం చేశారు. విధుల్లోకి వచ్చి, జీతాల కోసం తమను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని లస్కర్లు ఆవేదన చెందుతున్నారు. 


రూ.36 కోట్లతో ప్రతిపాదనలు 

సబ్‌ డివిజన పరిధిలో శిథిలావస్థలో ఉన్న యూటీలు, బ్రిడ్జిల మరమ్మతుకు రూ.36 కోట్లతో ప్రతిపాదనలు పంపామనిహెచ్చెల్సీ సీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్ర సరిహద్దు బొమ్మనహాళ్‌ మండలం నుంచి హెచ్చెల్సీని ఎస్‌ఈ రాజశేఖర్‌, ఈఈ వెంకటరమణారెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. కొన్ని యూటీలు పూర్తి ఇబ్బందికరంగా మారాయని, మరికొన్ని బ్రిడ్జిలు కూలిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయని సీఈ అన్నారు. అత్యవసర పనుల కింద వీటి మరమ్మతులకు రూ.36 కోట్లతో ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. నీటి సరఫరా నిలిచిన అనంతరం మరమ్మతు చేస్తామని తెలిపారు. ఆంధ్ర సరిహద్దుకు కేటాయించిన 26.215 టీఎంసీల నీటిలో ఇప్పటికే 3.73 టీఎంసీలను వాడుకున్నామని తెలిపారు. ఆంధ్ర సరిహద్దులో 1598 క్యూసెక్కుల నీరు వస్తోందని, కణేకల్లు చెరువు నుంచి, దిగువకు 1370 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇందులో జీబీసీకి 300, ఎంపీఆర్‌కు 800, పీఏబీఆర్‌కు 200 క్యూసెక్కుల నీరు వెళుతోందని అన్నారు. హెచ్చెల్సీకి జిల్లా వ్యాప్తంగా 360 లస్కర్‌ పోస్టులు అవసరమని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ గోపాల్‌ నాయక్‌, జేఈ అల్తాఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T05:52:00+05:30 IST