‘సలార్’ అంటే ఏంటి? ప్రభాస్ కథానాయకుడిగా ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమా ప్రకటించిన తర్వాత చాలామందిలో మెదిలిన సందేహమిదే! టైటిల్‌కు అర్థమేమిటో తెలుసుకోవాలనుకున్నారు. దీనికి చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ సమాధానమిచ్చారు. ‘‘సలార్ టైటిల్‌కు ఏవేవో వివరణలు ఇస్తున్నారు. ఏవేవో అర్థాలు చెబుతున్నారు. అది చాలా సామాన్యమైన పదమే. రాజుకు కుడి భుజంగా ఉండే వ్యక్తిని ‘సలార్’ అని అంటారు. సైన్యాధిపతి (కమాండర్ ఇన్ చీఫ్) నుంచి ఆ పదం వచ్చింది’’ అని ప్రశాంత్ నీల్ అన్నారు. డార్క్ అండ్ వయలెంట్ థీమ్‌లో సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. సినిమా స్వభావాన్ని తెలిపే విధంగా ఫస్ట్ లుక్ విడుదల చేశామన్నారు. ఆర్మీలో వ్యక్తిగా ప్రభాస్ పాత్ర ఉంటుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ‘సలార్’ సినిమా ప్రకటన తర్వాత దర్శక, నిర్మాతలపై కన్నడ ప్రేక్షకులు కొందరు విమర్శలు చేశారు. సినిమాలో కన్నడ కథానాయకుణ్ణి తీసుకోలేదని ప్రశ్నించారు. విమర్శలపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ... ‘‘ఇవాళ నేనేమీ మాట్లాడలేను. కానీ, సినిమా విడుదల సమయంలో మాట్లాడతా. ప్రభాస్ ఇన్నోసెన్స్ (అమాయకత్వం) నాకు నచ్చింది. ఇతర నటులతో పోలిస్తే... ఆయనలో ఎక్కువ అమాయకత్వం ఉంటుంది. దాన్ని తెరపై అద్భుతంగా చూపించవచ్చు’’ అన్నారు.