న్యాచురల్ స్టార్ నాని, డ్యాషింగ్ హీరో సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన చిత్రం 'వి'. ఈ చిత్రం లాక్డౌన్ టైమ్‌లో ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్నే నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ కేసు ఫైల్ చేశారు. తన అనుమతి లేకుండా తన ఫొటోని సినిమాలో వాడారని తెలుపుతూ.. చిత్ర నిర్మాతలపై బొంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. సినిమాలో మొబైల్ ఫోన్లో చూపించే కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటో తనదేనని, తన అనుమతి లేకుండా ఆ సన్నివేశంలో తన ఫొటోని ఎందుకు వాడారని సీరియస్ అవుతూ సాక్షి మాలిక్ కోర్టుకెక్కింది. ఈ కేసుని విచారించిన హైకోర్ట్.. వెంటనే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ నుంచి చిత్రాన్ని తీసివేయాలని, అలాగే ఆమె కనిపించే సన్నివేశాన్ని కూడా తొలగించాలని ఆదేశించడంతో పాటు.. సినిమాకు సంబంధం లేని వారిని ఇలా వాడటం చట్ట విరుద్ధమని చిత్రయూనిట్‌ని హెచ్చరించింది. దీంతో సదరు నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ ఫామ్ వారు చిత్రం నుంచి ఆ సన్నివేశాన్ని తొలగించి మళ్లీ విడుదల చేసుకుంటామని తెలిపినట్టుగా తెలుస్తోంది.