సిగ్గులేదూ.. మీడియాపై విరుచుకుపడిన ధోనీ భార్య

ABN , First Publish Date - 2020-03-28T03:29:53+05:30 IST

కోవిడ్-19పై పోరు కోసం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ వంటి వారు రూ. 50 లక్షల విరాళం

సిగ్గులేదూ.. మీడియాపై విరుచుకుపడిన ధోనీ భార్య

న్యూఢిల్లీ: కోవిడ్-19పై పోరు కోసం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ వంటి వారు రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, క్రికెట్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నెటిజన్లు అయితే ధోనీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ రేంజ్‌లో ధోనీని ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై ధోనీ భార్య సాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగింది. ఇలాంటి సున్నిత సమయాల్లో తప్పుడు వార్తలు ప్రచురించడం మానేయాలని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నట్టు పేర్కొంది. బాధ్యతాయుతమైన జర్నలిజం అదృశ్యమైనందుకు ఆశ్చర్యం వేస్తోందన్న సాక్షి.. సిగ్గు అనిపించడం లేదూ.. అని ప్రశ్నించింది. అయితే, కోవిడ్-19పై పోరు కోసం ధోనీ కచ్చితంగా ఎంత ప్రకటించాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 


పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ కెట్టో ద్వారా ధోనీ లక్ష రూపాయల విరాళం అందించాడు. వంద కుటుంబాలకు 14 రోజులపాటు ఆహారం అందించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారని సమాచారం. అయితే, రూ. 800 కోట్ల నికర ఆస్తి కలిగిన ధోనీ ఇంత ఆపత్కాలంలో లక్ష రూపాయల విరాళం ప్రకటించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన సాక్షి ట్విట్టర్ ద్వారా ఆగ్రహం ఓ రేంజ్‌లో మండిపడింది.

Updated Date - 2020-03-28T03:29:53+05:30 IST