సంక్షేమం సరే.. అభివృద్ధి ఎక్కడ!

ABN , First Publish Date - 2022-05-19T06:33:49+05:30 IST

సంక్షేమం సరే.. అభివృద్ధి ఎక్కడ!

సంక్షేమం సరే.. అభివృద్ధి ఎక్కడ!

 రోడ్లు బాగుచేయడంలేదు..

 రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వట్లేదు..

 ఇవేవీ లేకుండా సంక్షేమం ఎక్కడిది..?

 ఎమ్మెల్యే సింహాద్రిని నిలదీసిన అత్తాకోడళ్లు

 1061 రకం సాగుచేస్తే బీపీటీగా నమోదు చేశారు: రైతు ఆవేదన

చల్లపల్లి, మే 18 : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పాతమాజేరులో ఎమ్మెల్యే రమేశ్‌బాబు రెండోరోజు పర్యటించారు. ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల క్యాలండర్‌లను లబ్ధిదారులకు అందిస్తూ ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చిందో చెబుతూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తొలిరోజు కార్యక్రమంలో గ్రామంలో రహదారులు, ధాన్యం సమస్యలు ఏకరువు పెట్టగా, రెండో రోజూ పలువురు ఆ సమస్యలనే ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

ఎమ్మెల్యేను నిలదీసిన అత్తాకోడళ్లు

గ్రామానికి చెందిన చేబ్రోలు లక్ష్మి, సామ్రాజ్యం ఇంటిముంగిటకు వెళ్లిన ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి రూ.3.39లక్షలు వచ్చాయంటూ ఎమ్మెల్యే చెప్పగా, సమస్యలను ప్రస్తావిస్తూ అత్తాకోడళ్లు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. డబ్బులు రాలేదని మేం చెప్పామా.. ఎన్నిఊర్లు తిరుగుతున్నారు.. మా గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ధాన్యం డబ్బులు రైతులకు ఇవ్వకుంటే కూలీలకు డబ్బులెలా ఇస్తారనీ, ఎప్పుడో వస్తాయంటే ఎలా అంటూ నిలదీశారు. దీంతో సంక్షేమ క్యాలండర్‌లను వారికి ఇచ్చి నమస్కారం పెట్టి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

1061 సాగుచేస్తే బీపీటీగా నమోదు చేశారు

1061 రకం సాగుచేస్తే ఆర్‌బీకేలో బీపీటీగా నమోదు చేశారనీ, మూడు నెలలుగా ధాన్యం విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చేబ్రోలు నాంచారయ్య, విజయలక్ష్మిలు ఎమ్మెల్యేకు విన్నవించారు. మూడున్నర ఎకరాలు సాగుచేసి మూడు నెలలుగా డబ్బులకు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జాయింట్‌ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషిచేయాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు. స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు.

గడప గడపకూ స్పందన బావుంది : సింహాద్రి

గడప గపడకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, గ్రామంలో ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు తెలిపారు. పాతమాజేరులో మూడు, నాలుగు ఇళ్లవారు మాత్రమే వ్యతిరేకతతో మాట్లాడారనీ, వారు కూడా సమస్యలు చెప్పారనీ, పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ కళ్లేపల్లి లక్ష్మి, ఎంపీటీసీలు తమ్ము లక్ష్మి, మోపిదేవి ద్వారకానాధ్‌, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:33:49+05:30 IST