సకిలం ముకులం

ABN , First Publish Date - 2020-12-07T06:11:56+05:30 IST

పొలాన్ని నీళ్లు మింగాయనీ పల్లెపల్లంతా కాళ్లరిగేలా తిరిగొచ్చి నడుం కండువా విప్పి...

సకిలం ముకులం

పొలాన్ని నీళ్లు మింగాయనీ

పల్లెపల్లంతా కాళ్లరిగేలా తిరిగొచ్చి

నడుం కండువా విప్పి

నట్టింట్ల కూలబడ్తివి

చెమట నిండిన పెయ్యంతా

నీ కష్టానికి అద్దంమైతాండె

ముడుసుకు పోయిన మొఖమంతా

నీ దిగులుకు దర్వాజైతాండె

కాళ్లనేకాదు నీ మనసునీ

సకిలం ముకులంలా మలుసుకుంటివి

కూసుంటే కూడు సేతికొత్తదా

కూసుంటే కుంపటి రాజుకుంటదా..

బతిమాలుకుంటూ..

బతుకుతున్న బతుకంతా

నీ ముందు

వడ్డించిన విస్తరి కాదాయే

సకిలం ముకులంగా కూర్చిండి

తీరిగ్గా తింటానికి పెట్టి పుట్టాలేమో..!

అయినా..

ఈ బొంకిచ్చుడు బోర్లేసుడు

సుతారం యిస్టం లేనోళ్లు

చినుకు చినుకు తడిలోనూ

నెగడు పెట్టుకుని

ఒళ్లంతా భగ భగ మంట పెట్టుకుని

సల సల సలపరించే రకతంతో

మెల్లగా సల్లంగా ఎలాగుంటరు

అగ్గిరాజేసిన పొయ్యిమీద

రొట్టె పెంక కాల్తనే వుంటది

ఆకలి నకనకలకు

కమ్మటి వాసనొస్తే కడుపు నింపుద్దా

చెర్నాకోలాను ముల్లుగర్రనూ పట్టి

సకిలం ముకులం తియ్యి రైతన్నా..!!

కటుకోఝ్వల రమేష్‌

99490 83327

Updated Date - 2020-12-07T06:11:56+05:30 IST