Abn logo
Apr 7 2021 @ 23:20PM

అతివలకు అండగా ‘సఖి’

వేధింపులకు గురైన మహిళలు, యువతులకు మేమున్నామంటూ భరోసా

కౌన్సెలింగ్‌ ద్వారా సమస్యల పరిష్కారం

24 గంటల పాటు సేవలు

హెల్ప్‌లైన్‌ నెంబరు 181

టోల్‌ ఫ్రీ నెంబర్‌ 04029800821, 7382544181


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ‘సఖి’ కేంద్రం అండగా నిలుస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థ్యైరాన్ని నింపుతోంది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేని వారు సఖి కేంద్రానికి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సహాయాన్ని  అందిస్తోంది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా న్యాయ సలహాలు, పోలీసు, వైద్య సహాయం అందిస్తూ రక్షణగా ఉంటోంది. 


రంగారెడ్డి జిల్లాలో సఖి కేంద్రం మహిళలకు రక్షణ కవచంలా పనిచేస్తోంది. హింస, వేధింపుల నుంచి బయట పడేలా భరోసా కల్పిస్తోంది. లైంగిక వేధింపులకు గురైన బాలికలు, యువతులకు అండగా నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా సాయపడుతోంది. మానసిక స్థితి సరిగ్గా లేని మహిళలకు వైద్య సాయంలో తోడుగా ఉంటోంది. 


2017లో సఖి కేంద్రం ఏర్పాటు..

మహిళలకు అండగా నిలిచేందుకు రంగారెడ్డి జిల్లాలో 2017 సంవత్సరంలో సఖి కేంద్రాన్ని ప్రారంభించారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు షీ టీమ్‌తోపాటు సఖి కూడా సేవలు అందిస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వారి సమస్యలను సఖి కేంద్రం పరిష్కరిస్తోంది. బాధితులకు ఐదు రోజుల పాటు ఆశ్రయం కూడా కల్పిస్తోంది. లైంగిక వేధింపులు, గృహహింస, బాల్యవివాహాలు, మహిళల అక్రమ రవాణా, పనిచేసే చోట వేధింపులు తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం జరిగేలా చేస్తోంది.

 

కేసుల పరిష్కారంలో ముందంజ

సఖి కేంద్రానికి వచ్చిన కేసులను పరిష్కరించడంలో నిర్వాహకులు ముందంజలో ఉన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక మీటింగ్‌లు 111 ఏర్పాటు చేయగా ఉన్నతాధికారులు 218 మంది విజిట్‌ చేసి సఖి కేంద్రం పనితీరును పరిశీలించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించి రాజీకుదిర్చిన కేసుల పరిష్కారం కాక పోవడంతో చివరకు వాటిని కోర్టుకు పంపిస్తున్నారు. 2018 నుంచి ఇప్ప టివరకు 1,126 కేసులు కోర్టుకు పంపించారు. ఇప్పటి వరకు క్లోజ్‌ అయిన కేసులు 1,992 ఉన్నాయి. 


సఖి ద్వారా ప్రభుత్వ హోంలలో ఆశ్రయం

భర్త, కుటుంబ సభ్యులు పోషించకపోవడంతో బయటకు వచ్చిన మహిళలకు ఆశ్రయం కల్పిస్తోంది సఖి. రంగారెడ్డి జిల్లాలో మూడు ప్రభుత్వ హోంలు ఉన్నాయి. మియాపూర్‌లో కేజీఎన్‌ఎంజీ, సరూర్‌నగర్‌లో సయోధ్య, అమీర్‌పేట్‌లో స్టేట్‌ హోం ఉంది. చాలా కాలంగా 50 మంది మహిళలు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. 


విస్తృతంగా  ప్రచారం..

సఖి కేంద్రం సభ్యులు అందిస్తున్న సేవలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలను చైతన్యపరుస్తున్నారు. గ్రామాల్లో పోస్టర్లు, కరపత్రాల ద్వారా  ప్రచారం చేస్తున్నారు. మహిళలు తమ హక్కులతో  పాటు తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలనే అంశాల గురించి  వివరిస్తున్నారు. 


మద్యం మాన్పించి.. భార్యాభర్తలను ఒకటి చేసి..

ఆమె ఇంటర్‌ వరకు చదువుకుంది. అతను డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఐదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా  వివాహం జరిగింది. వారికి 2 ఏళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం సరూర్‌నగర్‌లో నివాసముంటున్నారు. వివాహం అయిన కొన్ని రోజులు వారి కాపురం సవ్యంగా సాగింది. వారి కుటుంబంలో మద్యం మహమ్మారి చిచ్చు రేపింది. మద్యానికి బానిసయ్యాడు. కారు డ్రైవింగ్‌ చేయగా వచ్చిన డబ్బులతో తెగ తాగేవాడు. అర్ధరాత్రి ఇంటికొచ్చి భార్యతో గొడవపడేవాడు.  భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. తాగుడు మానేయమని భర్తకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పినా వారు పట్టించుకోలేదు. చివరకు ఆమె పోలీస్టేషన్‌ను ఆశ్రయించింది. భర్తపై గృహహింస కేసు నమోదైంది. పోలీస్టేషన్‌లో న్యాయం జరగక పోవడంతో ఈ కేసును సఖి కేంద్రానికి అప్పగించారు మూడుమార్లు కేంద్రం నిర్వాహకులు భార్యాభర్తలు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తాగుడు వల్ల ఏర్పడే అనర్థాలను వివరించారు. సఖి కేంద్రం ప్రయత్నం విజయవంతమైంది. ప్రస్తుతం భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. 


జిల్లాలో నమోదైన కేసుల వివరాలు

కేసులు 2018 2019 2020 2021 మొత్తం

(మార్చి వరకు) 

గృహహింస 835 612 573 150 2,170

అత్యాచారం 24 04 03 0 31

లైంగిక వేధింపులు 20 12 06 11 49

పోక్సో 01 17 48 17 83

బాల్యవివాహం 01 01 22 03 27

మిస్సింగ్‌/కిడ్నాప్‌ 31 93 60 33 217

సైబర్‌ క్రైం 13 33 77 10 133

వరకట్న వేధింపులు 55 115 84 14 268

వయోవృద్ధుల 36 72 11 03 122

వేధింపులు

498 ఎ ఐపీసీ కేసులు 0 0 23 08 31

ఈవ్‌టీజింగ్‌ 0 0 02 0 02

ఇతర నేరాలు 13 0 32 13 58

మొత్తం 1,029 959 941 262 3,191


క్లోజ్‌ అయిన కేసులు

సంవత్సరం కేసులు

2018 824

2019 645

2020 426

2021 97

మొత్తం 1,992


భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన కేసులు

సంవత్సరం కేసులు

2018 536

2019 577

2020 1,443

2021 300

మొత్తం 2,856

Advertisement
Advertisement