బాధితులకు భరోసాగా.. ‘సఖి’ అండగా..

ABN , First Publish Date - 2022-06-26T05:29:34+05:30 IST

బాధిత మహిళలకు సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. అన్యాయానికి గురైన వారికి భరోసాను ఇస్తోంది. మహబూబాబాద్‌ జిల్లాలో మహిళలకు ఎక్కడా ఇక్కట్లు జరిగినా.. సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తే, వారి పక్షాన నిలబడుతోంది. సత్వర న్యాయం జరిగేలా చూస్తోంది.

బాధితులకు భరోసాగా.. ‘సఖి’ అండగా..
బయ్యారంలో ఈజీఎస్‌ కూలీలకు హెల్ప్‌లైన్‌ 181 సేవల గూర్చి అవగాహన కల్పిస్తున్న సఖి కేంద్రం బాధ్యులు (ఫైల్‌)

అన్యాయానికి గురైన మహిళలకు సాయం   
గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచార బాధితులకు న్యాయం
ఐదు విభాగాల్లో నిర్వాహకుల సేవలు
జిల్లాలో 816 ఫిర్యాదులకు గాను, 737 పరిష్కారం
హెల్ప్‌లైన్‌ 181ను సంప్రదిస్తే సలహ, కౌన్సిలింగ్‌, రక్షణ
సెల్‌ 93976 77770 ద్వారా 11 వేల మందికి సలహాలు
గ్రామసభల ద్వారా సేవలు విస్తృతం


మహబూబాబాద్‌ టౌన్‌, జూన్‌  25 :
బాధిత మహిళలకు సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. అన్యాయానికి గురైన వారికి భరోసాను ఇస్తోంది. మహబూబాబాద్‌ జిల్లాలో మహిళలకు ఎక్కడా ఇక్కట్లు జరిగినా.. సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తే, వారి పక్షాన నిలబడుతోంది. సత్వర న్యాయం జరిగేలా చూస్తోంది. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచార ఘటనలు లాంటివి ఏవి చోటు చేసుకున్నా.. హెల్ప్‌లైన్‌ 181కు ఫోన్‌చేస్తే, తక్షణమే వారికి సాయం చేయడానికి స్పందిస్తోంది. అంతే కాకుండా వివిధ సమస్యల పరిష్కారానికి 181ను సంప్రదించి సలహాలు పొందవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖద్వారా జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది.

సామాజిక సేవలో భాగంగా పని చేస్తున్న ‘షేర్‌ సొసైటీ’కి మహబూబాబాద్‌ జిల్లా సఖి కేంద్రం నిర్వాహణ బాధ్యతలను అప్పగించారు. మహిళాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సఖి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2019 సెప్టెంబరులో రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌ లాంఛనంగా ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు 816 ఫిర్యాదులు రాగా, అందులో అత్యధికంగా 737 కేసులు పరిష్కరించారు. సెల్‌ 93976 77770 ద్వారా 11 వేల మందికి సలహాలు, సూచనలు అందిస్తూ, మహిళలకు భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు. 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వారికి రక్షణ కవచంలా పని చేస్తున్నారు.

నమోదైన ఫిర్యాదులు..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సఖి కేంద్రం ఏర్పాటు అయినాటి నుంచి మొత్తం 816 ఫిర్యాదులు అందగా, అందులో 737ని పరిష్కరించారు.
ఫిర్యాదుల్లో 408 గృహహింస కేసులు, 27 వరకట్న వేధింపులు, 5 లైంగిక నేర సంబంధిత కేసులు, 18 అత్యాచార, 6 మహిళల అక్రమ రవాణా, 12 పిల్లల లైంగిక వేధింపులు, 96 బాల్యవివాహాల కేసులు, 57 తప్పిపోయిన, అపహరణ, 3 సైబర్‌ నేరాలు, 33 ఛీటింగ్‌, 39 ప్రేమ సమస్యలు, 112 ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి.

వెరసి మొత్తం 816 సఖి కేంద్రానికి రాగా, అందులో 737 కేసులను పరిష్కరించారు. ఇవే కాకుండా 181 మహిళా హెల్ప్‌లైన్‌ ద్వారా 498 ఫోన్‌కాల్స్‌ రాగా, వాటిని కూడా నిర్వాహకులు పరిష్కరించారు.

గ్రామసభలతో సఖి సేవలు విస్తృతం..
మహబూబాబాద్‌ జిల్లా 16 మండలాల పరిధిలోని 461 గ్రామపంచాయతీలకు సఖి సేవలను విస్తృతం చేశారు. గ్రా మగ్రామాన సభలను ఏర్పాటు చేసి సఖి సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా పల్లెల్లో ఉపాధి కూలీలు పనిచేస్తున్న వద్దకు వెళ్లి 181 హెల్ప్‌లైన్‌ కరపత్రాలను పంపిణీ చేస్తూ సఖి సేవల వివరాలను వివరిస్తున్నా రు. వీటికి తోడు కరోనా కష్టకాలంలో కూడ వైరస్‌ నియంత్ర ణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలో సఖి కేంద్రం సేవలందించింది. మొత్తానికి 24 గంటలు మహిళలకు రక్షణ కల్పించడంలో సఖి కేంద్రం భరోసాగా నిలుస్తోంది.

సేవలు ఇవే..

సఖి కేంద్రంలో బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందుతున్నాయి. అందులో కౌన్సిలింగ్‌, వైద్య సహాయం, తాత్కాలి వసతి, న్యాయ సహాయం, పోలీస్‌ సహా యం అందుతోంది. ప్రస్తుతం సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు నుంచి రక్షణ కల్పించడానికి వివిధ రకాల సహాయ సహకారాలు అందించేందకు సఖి కేంద్రం పని చేస్తోంది. గృహ హింస, పనిచేసే చోట లైగింక వేధింపులు, అత్యాచారాలు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణా, యాసిడ్‌ దాడులాంటి వాటి నుంచి రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా సఖి కేంద్రానికి హఠాత్తుగా వివిధ కారణాలచే ఇంటి నుంచి బయటకు వచ్చిన బాధిత స్త్రీల కోసం తాత్కాలిక వసతి, అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి తరుపున కేసుల నమోదు, ఎఫ్‌ఐఆర్‌ చేయించడం లాంటి సేవలు బాధిత మహిళలకు అందిస్తున్నారు.

సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తే న్యాయం..
- ఎన్‌.శ్రావణి, సఖి కేంద్రం నిర్వాహకురాలు మానుకోట

బాధిత మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తే తక్షణమే తగిన న్యాయం జరుగుతుంది. ఇందులో కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు న్యాయ, పోలీస్‌ సహా యం అందుతుంది. మహిళా హెల్ప్‌లైన్‌ 181పై  గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాం. 24 గంటల పాటు సఖి కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. 9397677770కు ఫోన్‌ చేసిన 11 వేల మందికి సలహాలు, సూచనలు అందించాం.

సేవలపై అవగాహన కల్పిస్తున్నాం.
- స్వర్ణలతలెనినా, జిల్లా సంక్షేమ అధికారి

బాధిత మహిళలకు సఖి కేంద్రం అందిస్తున్న సేవలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామగ్రామాన కరపత్రాల ద్వారా మహిళా హెల్ప్‌లైన్‌ 181 సేవలను ప్రతీ ఒక్కరికి తెలియజేస్తు న్నాం. ఎక్కడా మహిళలకు సమస్యలు ఎదురైన వెంటనే 181 హెల్ప్‌లైన్‌ ఆశ్రయిస్తే సఖి కేంద్రం ద్వారా రక్షణ కల్పించడంతో పాటు న్యాయం జరుగుతుంది.



Updated Date - 2022-06-26T05:29:34+05:30 IST