మరో నియోజకవర్గంలో జోక్యం వద్దు.. ఎమ్మెల్యేలు చెప్పిందే చేయండి!

ABN , First Publish Date - 2021-08-03T05:47:03+05:30 IST

‘‘కొంతమంది ఎమ్మెల్యేల నుంచి..

మరో నియోజకవర్గంలో జోక్యం వద్దు.. ఎమ్మెల్యేలు చెప్పిందే చేయండి!
ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో సమావేశమైన సజ్జల, బాలినేని

ఇబ్బందులు ఉంటే ఇన్‌చార్జి మంత్రికి చెప్పండి

కలెక్టర్‌, ఎస్పీలకు సజ్జల ఆదేశం

ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలతో సమావేశం

ఎమ్మెల్యేలు కిలివేటి, రామిరెడ్డి కలెక్టర్‌పై ఫిర్యాదు

కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం


నెల్లూరు: ‘‘జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల నుంచి అధికారులపై తీవ్ర అసంతృప్తులు వస్తున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వాటికి బ్రేక్‌ వేయండి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పినట్లు పని చేయండి. వాటిలో ఏవైనా ఇబ్బందికర పనులు ఉన్నట్లు అనిపిస్తే ఇన్‌చార్జి మంత్రి బాలినేని దృష్టికి తీసుకువెళ్లండి.’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  కలెక్టర్‌, ఎస్పీలకు సూచించారు. జిల్లాలో అటు రాజకీయంగా, ఇటు అధికారపరంగా విభేదాలు, అసంతృప్తులు, ఫిర్యాదులు ఏర్పడి ఉండడంతో వాటిపై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులు సోమవారం నెల్లూరుకు వచ్చి మంత్రి అనిల్‌, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి ఉన్న ఇబ్బందులు, పార్టీ  స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యేలు అందరినీ కూర్చొబెట్టి చర్చించారు.


ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తొలిగా కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో రెవెన్యూ అధికారుల బదిలీలను సైతం తనకు సమాచారం లేకుండానే ఏకపక్షంగా కలెక్టర్‌ బదిలీ చేస్తున్నారని, ఎమ్మెల్యేకు విలువ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా కలెక్టర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో లేఅవుట్‌లను అభివృద్ధి చేయకుండానే లబ్ధిదారులకు ప్లాట్లు ఇచ్చారని, వాటిని త్వరగా అభివృద్ధి చేసి ఇళ్లు నిర్మించాలని చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే తన నియోజవర్గానికి పర్యటనకు వస్తున్న కనీస సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కల్పించుకొని ఒకరి నియోజకవర్గంలో మరొకరు కల్పించుకోకూడదని గతంలో చెప్పినా అది మళ్లీ పునరావృతం అవుతున్న తీరుపై గట్టి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.


దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకొని కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావులను పిలిచి ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చెప్పిందే చేయాలని వారికి సూచించినట్లు తెలిసింది. వారు చెప్పిన వాటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇన్‌చార్జి మంత్రి బాలినేని లేదా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని గట్టిగా సూచించినట్లు తెలిసింది. అలాగే జిల్లాలో జరుగుతున్న జగనన్న కాలనీల్లో హౌసింగ్‌ నిర్మాణాలను అధికారులు, ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చూడాలని అందరికీ తెలిపినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:47:03+05:30 IST