ఆ మాట వాస్తవమే: సజ్జల

ABN , First Publish Date - 2021-10-14T14:08:17+05:30 IST

ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని, ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్న మాట..

ఆ మాట వాస్తవమే: సజ్జల

నెలాఖర్లోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన 

17 నుంచి సీఎస్‌ ఆధ్వర్యంలో సమావేశాలు 


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని, ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనన్నారు. వచ్చే నెల నుంచి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చే నెలాఖరుకు ఉద్యోగుల మేజర్‌ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, సీఎంవో అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.


పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో 17, 18 తేదీల నుంచి సీఎస్‌ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయని చెప్పారు. రెండేళ్లుగా కొవిడ్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీఎం జగన్‌ ఐఆర్‌ ఇచ్చారన్నారు. ఇప్పుడు జరిగినవి అధికారిక చర్చలు కాదని, ఉద్యోగ సంఘాలు వినతి పత్రాలు తీసుకొస్తే వారితో మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను సమానంగా చూస్తోందన్నారు. త్వరలో సీఎస్‌తో జరిపే సమావేశమే అధికారికమని, అప్పుడు అన్ని సంఘాలు మాట్లాడవచ్చన్నారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్ని సీఎం జగన్‌ సహించరన్నారు. ఉద్యోగుల భద్రతలో జగన్‌ ఎప్పుడూ రెండడుగులు ముందే ఉంటారని చెప్పారు.


ఉద్యోగులకు ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా కచ్చితంగా పరిష్కరిస్తారన్నారు. సుదీర్థంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను నెరవేర్చారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌హామీ నెరవేర్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదన్నారు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ ఉద్యోగుల సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా తాము స్పందిస్తామని, ఇది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతూనే ఉంటాయన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉన్నప్పుడు వారితో ఫోన్‌లో మాట్లాడడం తప్పుకాదన్నారు. విడదీసి పాలించడం తమ ఉద్దేశం కాదని, రెండు సంఘాలు ఏకమై పోరాడుతున్నప్పుడు అభినందించడంలో తప్పులేదన్నారు.   


సమస్యలపై రాజీలేని పోరాటం:  జేఏసీ నేతలు బండి, బొప్పరాజు 

ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సీఎంవో అధికారులు, సజ్జలతో సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారని.. సమస్యలు పరిష్కరించని పక్షంలో తమ ఆప్షన్‌ తమకు ఉండనే ఉందన్నారు. 11వ పీఆర్సీ అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సీఎస్‌కు ఇచ్చిన మెమోరాండంపై సీఎం కార్యాలయం పిలుపు మేరకు తాము సమావేశానికి వచ్చామన్నారు. ఈ నెలాఖరునాటికి అన్ని సంఘాలతో చర్చించి 11వ పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మూడు నాలుగు నెలలుగా కొంత మందికి జీతాలు, పెన్షన్ల జాప్యం జరిగిందని, ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారని వారు తెలిపారు.


ఒకటి రెండ్రోజులు ఆలస్యం జరిగే అవకాశం ఉన్నా ముందుగా 1వ తేదీకి పెన్షనర్లకు చెల్లింపులు చేస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వానికి మెమోరాండం ద్వారా 10 సమస్యలను వివరించామన్నారు. సీపీఎస్‌ రద్దు, ఉద్యోగులు, పోలీసులకు రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, ఏపీజేఏల్‌ఐ లోన్స్‌, జీపీఎఫ్‌ లోన్స్‌ మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ తదితర బిల్లులు త్వరితగతిన చెల్లించాలని  కోరామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు జేఏసీలు కలసి పని చేస్తున్నాయన్నారు.

Updated Date - 2021-10-14T14:08:17+05:30 IST