సజ్జల ఫోన్‌ వాస్తవమే!

ABN , First Publish Date - 2021-10-10T14:15:53+05:30 IST

రాష్ట్రంలో అతిపెద్ద..

సజ్జల ఫోన్‌ వాస్తవమే!

కంట్రోల్‌లోనే పనిచేస్తున్నామని చెప్పాం

జేఏసీల కలయికపై శుభాకాంక్షలు చెప్పారు 

సంయమనం పాటించమన్నారు

మా భేటీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నాం

ఉద్యోగ జేఏసీల నేతలు బండి, బొప్పరాజు


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగ సంఘాల జేఏసీలు రెండూ ఏకమై నిర్వహించిన సమావేశంలో తాము ఉండగా... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ చేసిన మాట వాస్తవమేనని ఏపీఎన్జీవో జేఏసీ (ఏపీ జాక్‌), ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు జేఏసీలూ కంట్రోల్‌లోనే ఉన్నాయని ఆయనకు తెలిపామన్నారు. శనివారం ఉదయం ఏపీ ఎన్జీవో భవన్‌ లో ఏపీ ఎన్జీవో జేఏసీ (ఏపీ జాక్‌), ఏపీ అమరావతి జేఏసీలు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. సజ్జల ఫోన్‌ చేసిన విషయమై ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు.


‘‘రెండు జేఏసీలు ఒక్కటిగా కలిసినందుకు ఫోన్‌లో మాకు సజ్జల శుభాకాంక్షలు తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  చెప్పారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక్కటి కాలేదని, ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి తమ సమస్యలను పరిష్కారం చేసుకోవటానికే సమావేశమయ్యామని మేం ఆయనకు వివరించాం. రెండు జేఏసీలూ కంట్రోల్‌లోనే ఉన్నాయని తెలిపాం’’ అని వారు వివరించారు. ఉద్యోగసంఘాలను ఆయన బెదిరించారని, కంట్రోల్‌లో ఉండమని ఫోన్‌లో హెచ్చరించారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. 


భయపడటానికి కొత్తగా వచ్చామా? : బండి

ప్రభుత్వ సలహాదారు తమను బెదిరించారని, తాము భయపడ్డామని, చెమటలు పట్టాయనడం సరికాదని బండి శ్రీనివాసరావు అన్నారు. ‘‘ఫ్యాన్లు ఆపివేసినందున మాకు చెమటలు పట్టాయే తప్ప ఎవరో బెదిరిస్తే చెమటలు పట్టలేదు. 40 ఏళ్లుగా ఉద్యోగ సంఘాల్లో కీలక పదవుల్లో ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. భయపడటానికి మేమేమీ కొత్తగా రాలేరు. ఉద్యమాలు చేయటమూ కొత్తకాదు. మాకు ఏ రాజకీ య పార్టీతోనూ పొత్తులేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమకు ఫోన్‌ చేసిన సందర్భంలో... మా కలయికను పురస్కరించుకును శుభాకాంక్షలు చెప్పారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై ఆర్థిక శాఖలో స్పందించేవారు లేరు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కనబడరు. అధికారులకు చెప్పుకుందామంటే వారు  కూడా వినటం లేదు. ఇలాంటి సమయంలో మాకు సజ్జల మాత్రమే కనబడతారు.


ఉద్యోగుల సమస్యలను ఆయనకే చెప్పుకుంటున్నాం. మాకు, సజ్జల మధ్య ఉన్న సంబంధాలను విచ్చిన్నం చేసే కుట్రలో భాగంగానే ఫోన్‌ విషయమై లేని వివాదం లేవనెత్తారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్‌ సూర్యనారాయణ సోషల్‌ మీడియాలో పనిగట్టుకుని దుర్మార్గమైన ప్రచారం చేయించారు. మంత్రుల ఇళ్లలో కుక్కలకు వేసే బిస్కట్లకు కూడా ఉద్యోగుల జీతాల నుంచే ఖర్చు పెడుతున్నారు. ఎస్‌ఎ్‌ససీ బోర్డులో సుబ్బారెడ్డి అనే అధికారి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు.  వీరభద్రుడు వంటి కమిషనర్ల (పాఠశాల విద్య) తీరు గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వచ్చినా..మా మాట వినిపించుకోవడంలేదు’’ అని పేర్కొన్నారు. 


లొంగిపోతే.. ఎందుకు కలుస్తాం? : బొప్పరాజు

ఉద్యోగుల సమస్యలపై రాజీపడబోమని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ‘‘ప్రెస్‌మీట్‌కు ముందు సజ్జల ఫోన్‌ చేశారు. సంయమనం పాటించాలని కోరారు. అయితే, మాపై ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని, ఇక ఓపికపట్టలేమని చెప్పాం. సజ్జల మాతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యామంటున్నారు. అయితే, ఆ ఫోన్‌ సంభాషణ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మా మాటతీరు మారిందా? సరెండర్‌ అయితే రెండు జేఏసీలు ఒక మహా జేఏసీగా ఎందుకు ఏర్పడతాయి? కార్యాచరణ దిశగా ఎందుకు వెళతాయి? ఉద్యోగులం కాబట్టి రాజకీయ పార్టీలు మాదిరిగా వ్యవహరించలేం. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి లోబడి ఉంటాం. మా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో ఒప్పించి, మెప్పించి సాకారం చేసుకోవాలనుకుంటాం. అది వీలుకాని పక్షంలో పోరాట పంథాను ఎన్నుకుంటాం.’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-10T14:15:53+05:30 IST