గుప్కర్ అలయెన్స్‌ నుంచి బయటకొచ్చిన సజ్జాద్ లోన్

ABN , First Publish Date - 2021-01-20T01:38:18+05:30 IST

జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడేందుకు ఏర్పాటైన పీపుల్స్

గుప్కర్ అలయెన్స్‌ నుంచి బయటకొచ్చిన సజ్జాద్ లోన్

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడేందుకు ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ)లో భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. ఈ కూటమి నుంచి సజ్జాద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ బయటకొచ్చింది. పీఏజీడీకి ఆయనే అధికార ప్రతినిధి కావడం గమనార్హం. 


పీఏజీడీ అధికార ప్రతినిధి, పీపుల్స్ కాన్పరెన్స్ చైర్మన్ సజ్జాద్ గనీ లోన్ ఏడు పార్టీల కూటమి పీఏజీడీ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లాకు ఓ లేఖ రాశారు. ఈ కూటమి నుంచి పీపుల్స్ కాన్ఫరెన్స్ వైదొలగుతున్నట్లు తెలిపారు. 


పీపుల్స్ కాన్ఫరెన్స్ నేతలు చెప్తున్నదాని ప్రకారం, తాజాగా జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ అభ్యర్థులపై పీఏజీడీ అభ్యర్థులను నిలపడంతో ఆ పార్టీకి నష్టం జరిగింది. ఏమీ జరగలేనట్లు నటిస్తూ, ఈ కూటమిలో కొనసాగడం తమ వల్ల కాదని నేతలు వాదిస్తున్నారు. కూటమి పార్టీల మధ్య నమ్మక ద్రోహం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కూటమి నుంచి బయటకు వచ్చేయాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడటంతో సజ్జాద్ లోన్ తన నిర్ణయాన్ని లేఖ ద్వారా ఫరూక్ అబ్దుల్లాకు తెలిపారు. 

 

2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని అధికరణలు 370, 35ఏలను రద్దు చేసి, జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. 


అధికరణ 370, అధికరణ 35ఏలను పునరుద్ధరించే వరకు పోరాడాలన్న లక్ష్యంతో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎం, జేకేపీఎం, ఏఎన్‌సీ  2020 అక్టోబరులో పీఏజీడీని ఏర్పాటు చేశాయి. 


Updated Date - 2021-01-20T01:38:18+05:30 IST