Abn logo
Feb 1 2020 @ 22:21PM

ముత్యాలముగ్గు వేసిన సజ్జాద్ మేండలిన్

మేండలిన్ అన్న విదేశీ వాయిద్యంపై‌ భారతదేశ శాస్త్రీయ సంగీతాన్ని తొలి‌‌సారి‌ పలికించిన సంగీత‌వేత్త సజ్జాద్ హుస్సైన్ కురైషి . వారిని సందర్శిద్దాం రండి..

 

ఒక సభలో ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గాత్ర కచేరీ ప్రారంభానికి ముందు ఖాళీ‌‌ సమయంలో వేదిక పై సజ్జాద్ మేండలిన్ వాయించారు. బడే గులాం అలీ ఖాన్ దాన్ని విని తన గదికి సజ్జాద్ ను పిలిపించుకుని "ఈ సంగీతాన్ని దేనిపై వాయించావు?" అని అడిగారట.‌ మేండలిన్ ను చూపారు సజ్జాద్. ఆశ్చర్యపోయిన బడే గులాం ఆలీ ఖాన్ "ఇంత చిన్న వాయిద్యం నుంచి అంత‌ గొప్ప సంగీతం వచ్చిందా?" అని అడిగారట. అ తరువాత "నేనే కాదు ఇతర సంగీత ఉస్తాద్ లు నీ కాలి‌గోటికి సరిరారు" అన్నారట. అంత గొప్ప‌ సంగీత‌ స్రష్ట సజ్జాద్ హుస్సైన్. ఒక్క మేండలిన్ మాత్రమే కాదు పది వాయిద్యాలను వాయించగలరు సజ్జాద్.

 

సజ్జాద్ సంగీతం అపూర్వమైనది. అసాధారణమైనది. ఆశ్చర్యకరమైనది.

మేండలిన్ తో ఎన్నో హిందూస్థానీ సంగీత కచేరీలు చేశారు వారు. మేండలిన్ శ్రీనివాస్ మేండలిన్ తో కర్ణాటక సంగీతాన్ని నినదిస్తే సజ్జాద్ హుస్సైన్ తొలిసారి మనదేశ శాస్త్రీయ హిందూస్థానీ సంగీతాన్ని మేండలిన్ పై పలికించారు. మేండలిన్ వాయిస్తున్నఫ్పుడు వారి చేతి వేళ్లు కళ్లకు కనిపించనంత వేగంగా కదులుతాయట. ఒకసారి మద్రాస్ లో సజ్జాద్ మేండలిన్ కచేరి విన్న వీణ ఎస్. బాలచందర్ ఇది చాలా గొప్ప సంగీతం‌ అన్న అర్థంలో, తమిళ‌ వాడుకలో "ఇతనెక్కడి వాడు? ఇదేం సంగీతం?‌" అంటూ‌ ఆశ్చర్యపోయారట. వీణ బాలచందర్ మామూలు కళాకారులు కాదు. వారు వీణావాదనా దురంధరులు. వారు సజ్జాద్ ను అలా మెచ్చుకోవడం ఎంతో గొప్ప విషయం. మేండలిన్ పై సంగతుల్ని పలికించడం సామాన్యమైన విషయం కాదు. అలాంటిది సజ్జాద్ చాల క్లిష్టమైన సంగతుల్ని కూడా మేండలిన్ పై అలవోకగా పలికిస్తారు. మేండలిన్ తో వారు చెయ్యగలిగే స్వర ప్రస్తారం అనితరసాధ్యం. వారి note- phrases అమోఘమైనవి. సమతౌల్యం, విద్వత్ లతో వారి మేండలిన్ వాదన ఒక సంగీతఝరి. సంగీతం‌ ఒక అద్భుతమైతే ఒక అద్భుతం సంగీతమైతే అది సజ్జాద్ సంగీతం‌.

సజ్జాద్ కొన్ని హిందీ చలన చిత్రాలకు సంగీతం చేశారు. 1944 లో తొలి సినిమా గాలీ నుంచి 1973 లో‌ మేరే షికార్ సినిమా వఱకూ 17 సినిమాలకు సంగీతం చేశారు. ఇందులో కొన్ని సినిమాలకు ఆయన పూర్తిగా సంగీతం చెయ్యలేదు. దిలీప్ కుమార్ కథానాయకుడుగా చేసిన హల్ చల్ (1951) సినిమాలో 3 పాటలు మాత్రమే సజ్జాద్ చేశారు‌. అవి రాజ్ కుమారి పాడిన "కోయీ కిస్ తర్హా...", లతామంగేశ్కర్ పాడిన "లుటా దిల్ మేరా...", "ఆజ్ మేరీ నసీబ్..." పాటలు. "ఆజ్‌ మేరీ నసీబ్..." పాటను విని ఉత్తమాభిరుచికలవాళ్లు విస్తుపోయారు. ఆ పాటలో landing notes రసజ్ఞుల తలలు తిప్పేట్లు చేశాయి. Metronomic balance తో పాడబడిన ఒక విలువైన నిర్మాణంతో ఉంటుంది ఆ పాట. 1946 లో వచ్చిన 1857 అన్న సినిమాతో సజ్జాద్ ఒక గొప్ప‌ సినిమా సంగీతదర్శకులుగా తెలియవచ్చారు. 1950 లో వచ్చిన ఖేల్ సినిమాలో వారి సంగీతం అప్పటికి ఒక విప్లవం. "భూల్ జాయే దిల్..." అంటూ లతామంగేశ్కర్ పాడిన పాట అనాటికి భారతదేశ‌ సినిమా పాటల్లో ఒక మెఱుపు. మనదేశ సినిమాల్లో Sound designing అన్నది సజ్జాద్, శంకర్-జైకిషన్ లతో మొదలయింది‌.

 

1951,‌ 52‌ లలో సజ్జాద్ సంగీతంలో వచ్చిన సయ్యాన్, సంగ్దిల్ సినిమాల్లో అద్భుతమైన సంగీతం పండింది. సయ్యాన్ సినిమాలో "తుమె దిల్‌ దియా ..." అంటూ లతామంగేశ్కర్ పాడిన పాట ఆ రోజుల్లో సజ్జాద్‌ మస్తిష్కం నుంచి పుట్టడం ఆశ్చర్యకరం.‌ ఇప్పటికీ విస్మయాన్నిస్తుంది ఆ పాట. వారు ఎలా‌‌ ఆ పాటను ఆలోచించగలిగారో? ఆ సినిమాలో‌ మఱో గొప్పపాట "వొ రాత్ దిన్‌ వొ చాందిని" అంటూ లతామంగేశ్కర్ పాడిన పాట. ఇందులో counter phrases ఉంటాయి. భారతదేశంలో అలా counter phrases తో‌ పాట‌ను నిర్మించడం అదే తొలిసారి. ఆ తరువాత సి.రామచంద్ర నౌషెర్వాన్-ఎ-ఆదిల్ (1957) సినిమాలో "ఆజా ఆజా రాత్ ధలీ" పాటను, ఇళయరాజా సిట్టుక్కురివి (1978) తమిళ సినిమాలో "ఎన్ కణ్మణీ ఉన్ కాదలి" పాటను, ఆర్.డి. బర్మన్ ఇజాజత్ సినిమాలో(1987) "కత్రా కత్రా జానే దో" పాటను counter phrases తో చేశారు. "ఏ హవా ఏ రాత్ ఏ చాందినీ", "దిల్‌ మే సమాగయే‌ సజన్", "కహాహో కహా మేరే జీవన్ సహారే" వంటి చాలా గొప్ప పాటల్ని సంగ్దిల్ సినిమాలో చేశారు సజ్జాద్. "కహాహో కహా మేరే జీవన్ సహారే" మఱో‌ లోకపు పాట. ఈ పాటలో prelude గా సజ్జాద్ piano వాయిద్యాన్ని‌ అద్భుతంగా పలికించారు. Emotive excellence ఈ పాట. పాటలకు rhythm గా తబలా వంటి‌ వాయిద్యాల్ని (membrano phones)‌ ఆ కాలంలోనే తీసేశారు సజ్జాద్. అది వారి దార్శనికత. ఈకాలంలో ఎ.ఆర్. రహ్మాన్ పాటల్లో ఈ‌ అంశం మనకు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక‌ నాట్య సన్నివేశానికి హంసధ్వని రాగంలో సజ్జాద్ కల్పించిన వాద్య సంగీతం ఎంతో గొప్పది. ఈ‌ సినిమాలో ఆశా‌భోస్లే చేత "దర్ద్ భరీ కిసికి యాద్" అంటూ గొప్పగా పాడించారు సజ్జాద్. ఓ.పి.నయ్యర్ కన్నా ముందే‌‌‌ సజ్జాద్ ఆశాభోస్లే చేత గొప్పగా పాడించారు. గొప్ప పాటలు పాడించారు. 1955 లో వచ్చిన రుఖ్సానా సినిమాలో ఆశాతో "దిన్ రాత్ ..." అన్న‌ కవ్వాలిని కూడా పాడించారు. 1963లో వచ్చిన రుస్తుం సొహరాబ్ సినిమా ఒక సంగీత అద్భుతం. అందులో అన్ని పాటలూ‌ మహోన్నతమైనవే. "ఏ‌ దిల్ రుబా..." అంటూ లతామంగేశ్కర్ పాడినది అత్యంత అద్భుతమైన పాట. అది న భూతో న భవిష్యతి. ఒక్క సజ్జాద్ కు తప్ప మఱెవరి ఆలోచనకూ అందని పాట. మఱే సంగీత దర్శకుడూ కలగనని, కలగనలేని పాట. ఇలాంటి పాట‌ ఇదొక్కటే. "ఎవరైనా తమని తాము గాయకులు అని అనిపించుకోవాలంటే సజ్జాద్ పాటలు పాడాలి అప్పుడు‌ కానీ వాళ్లు గాయకులో కాదో తెలుస్తుంది" అని లతామంగేశ్కర్‌ ఒక‌‌సారి‌ అన్నారు. ఈ సినిమాలో‌ కవ్వాలి తరహాలో చేసిన "ఫిర్ తుమ్హారీ యాద్ ఆయే ఏ‌ సనం" పాట మఱో‌ అద్భుతం. మన్నాదె, మొహమ్మద్ రఫీ, సద్దాత్‌ ఖాన్ లు పాడారు. అనూహ్యమైన కల్పనా చతురత ఈ పాటలో వినిపిస్తుంది. సజ్జాద్ హుస్సైన్ ది అదేం మేధో? ఈ రుస్తుం‌ సొహరాబ్ ఒక్క సినిమా చాలు వారు ఒక అపూర్వమైన సంగీత మేధావి అని తెలుసుకోవడానికి. గాయని‌ సురయ్యా చివరి గొప్ప పాట‌ "ఎ కైసీ అజబ్ దాస్తా..." ఈ‌ సినిమాలోదే. ఈ సినిమాలో సజ్జాద్ అరబీ సంగీతాన్ని చాలా ప్రతిభావంతంగానూ, చాలా ఉన్నతంగానూ ప్రయోగించారు. సయ్యాన్, సంగ్దిల్, రుస్తుం సొహరాబ్ సినిమాల్లో వారు కూర్చిన,‌ సమకూర్చిన‌ నేపథ్య సంగీతం (re- recording) మహోన్నతమైనది. ఒక‌ conceptualized re- recording సజ్జాద్ ది. ఒక శబ్ద-ఔన్నత్యం వారి సంగీతంలో తొణికిసలాడుతూంటుంది.

సినిమా పాట అంటే ఒక్క‌ మట్టు లేదా బాణి (tune) మాత్రమే కాదు‌. ఆ‌ బాణికి వాయిద్య సంగీతమూ ఎంతో ముఖ్యం. ఒక‌ పాటలో వాయిద్య సంగీతం అన్నది ఏదో ఖాళీలు నింపడం లాంటిది కాదు. బాణి, వాయిద్యసంగీతం కలిస్తేనే పాట. ఈ విషయం బాగా తెలిసినవారు సజ్జాద్. వారి వాయిద్య సంగీతం చాలా నైపుణ్యంతోనూ, నాణ్యమైనదిగానూ,‌ సృజనాత్మకంగానూ ఉంటుంది. Counter points (contra puntals)ను వాయిద్య సంగీతంలో అమర్చేవారు సజ్జాద్.

 

సజ్జాద్ తమ కొడుకు పేరుతో జియారాత్ గాహే హింద్ అనే సినిమాకు సంగీతం చేశారు అని వి.ఎ.కె. రంగారావు తెలియజేస్తున్నారు. సజ్జాద్ మొత్తం 90 కి తక్కువగా సినిమా‌ పాటలను స్వరపఱిచారు. మొహమ్మద్ రఫీ పాడగా కొన్ని పంజాబీ హీర్ లను కూడా స్వరపఱిచారు సజ్జాద్.

 

"ఇతరుల‌ సంగీతాన్ని తస్కరించని ఏకైక సంగీత దర్శకులు సజ్జాద్" అనీ‌, "మనదేశంలోనే గొప్ప‌‌ చలన‌చిత్ర సంగీత‌ దర్శకులు సజ్జాద్‌" అనీ సంగీత దర్శకులు మదన్ మోహన్, సి.రామచంద్ర, సలీల్ చౌదరి ప్రభృతులు తమ‌ మనసుల్లోని మాటలుగా చేప్పారు. సంగీత దర్శకులు అనిల్ బిశ్వాస్ "సజ్జాద్, మన దేశంలో ఒక ప్రత్యేకమైన సంగీత దర్శకుడు" అని చెప్పారు.‌ మదన్ మోహన్, రోషన్, సి.రామచంద్ర , నౌషాద్ లు సజ్జాద్ ప్రభావంతో కొన్ని పాటలు చేశారు. 1949 లో నౌషాద్ చేసిన దులారీ సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన "సుహానీ రాత్ దల్ చుకీ" పాటకు సజ్జాద్ హుస్సేన్ చేసిన ఓ పాట ఆధారమట.

 

సజ్జాద్ హుస్సైన్ తెలుగు‌లో గోరంతదీపం మొత్తం సినిమాకు మేండలిన్‌తో నేపథ్య సంగీతం చేశారు. ముత్యాలముగ్గు చిత్రంలో ప్రారంభం నుంచి నాయికా నాయకుల తొలిరాత్రి సన్నివేశం వఱకూ నేపథ్య సంగీతంగా తమ మేండలిన్ వాదనని అందించారు. బాపు వల్ల సజ్జాద్ తెలుగుకు వచ్చారు. పి.బి.శ్రీనివాస్ వల్ల సజ్జాద్ బాపుకు తెలియవచ్చారు.

 

జూన్ 15, 1917లో పుట్టిన సజ్జాద్ జూలై 1995 లో తమ 78 ఏళ్ల వయసులో‌ మరణించారు. "నా సంగీతాన్ని ఎవరూ వెలకట్టి కొనలేరు" అని సజ్జాద్ ఈ రచయితతో‌ అన్నారు. అది నిజం!


సజ్జాద్ చాలా కఱుకు మనిషి. వారి ప్రవర్తనవల్లా, మాటలవల్లా ఎన్నో సినిమాలు వారు పోగొట్టుకున్నారు. వారు మాత్రమే చెయ్యగలిగిన ఎన్నో గొప్ప గొప్ప పాటలు వారి వల్లే రూపొందకుండాపోయాయి. రూపొంది మనకు అందిన సజ్జాద్ పాటలు ప్రత్యేకమైనవి ఆపై అనన్యమైనవి (unique and nonesuch). సజ్జాద్‌‌ మేండలిన్ సంగీతమూ,‌ సినిమా సంగీతమూ అసాధారణమైనవి. Outlandish and outstanding సంగీతం సజ్జాద్‌ హుస్సైన్ సంగీతం. వారి musical flair and flavour విలక్షణమైనవి ఆపై విశిషష్టమైనవి.

ఒక విశేష సంగీత శేముషి సజ్జాద్ హుస్సైన్ కురైషి.

-రోచిష్మాన్

9444012279

[email protected]

Advertisement
Advertisement
Advertisement