క్వింటాకు రూ.1000 నష్టం

ABN , First Publish Date - 2021-10-21T05:33:31+05:30 IST

పంట ఇళ్లకు చేరుతున్నా సజ్జల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించినా సరైన ధర లభించక లబోదిబోమంటున్నారు.

క్వింటాకు రూ.1000 నష్టం
సజ్జ కంకులను మిల్లర్‌లో ఆడిస్తున్న రైతులు

సజ్జల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతుల ఆదాయంలో కోత

ప్రభుత్వ మద్దతు ధర రూ.2250.. వ్యాపారుల ధర రూ.1250

మర్రిపూడి మండలంలో వెయ్యి ఎకరాలకుపైగా సాగు

ఒక్కో రైతుకు ఎకరాకు సుమారు రూ.10 వేల నష్టం

దళారుల కబంద  హస్తాలలో విలవిల్లాడుతున్న కర్షకులు


‘‘రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సాగు మొదట్లోనే మద్దతు ధర ప్రకటించి ఆ ప్రకారమే పంటను కొంటాం. ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రభుత్వమే రూ.3 వేల కోట్ల ఽధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంది. రైతు శ్రేయస్సు కోసం ఎంతైనా చేస్తాం’’ 2019 ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఊర్లో చెప్పిన మాటలివి.. నమ్మి ఓట్లేసిన రైతుల గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లయింది. పంట ఇళ్లకు చేరుతున్నా సజ్జల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించినా సరైన ధర లభించక లబోదిబోమంటున్నారు. 


మర్రిపూడి, అక్టోబరు 20 : ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులను అధిగమించి మండలంలో 1000 ఎకరాలకుపైగా సజ్జ పంటను సాగు చేశారు. ఏటా చాలామంది రైతులు వ్యసాయ బోర్ల కింద సాగు చేసి పైరు కోసిన అనంతరం వరి సాగు చేయడం ఆనవాయితీ. సజ్జలు అమ్ముకోగా వచ్చిన డబ్బును వరిసాగుకు పెట్టుబడిగా వాడుకుంటారు. మరికొంత మంది రైతులు కందిపైరులో సజ్జను అంతర్‌ పంటగా సాగు చేస్తారు. ఈ ఏడాది పైరు కీలక దశలో ఉన్నప్పుడు వర్షాలు కురవకపోవడంతో సజ్జ వాడుముఖం పట్టింది. ఈ దశలో రైతులు వ్యయప్రయాసలకోర్చి మెట్టపొలాల్లో సాగు చేసిన సజ్జ పంటను దక్కించుకునేందుకు బోర్ల నుంచి నీటి తడిని అందించారు. అదే సమయంలో రెండురోజులు ఆలస్యంగా కొద్దిపాటి వర్షం కురవడంతో సజ్జపైరు పూర్తిగా జీవం పోసుకుంది. 

ఊపందుకున్న నూర్పిళ్లు

ప్రస్తుతం సజ్జ కోతలు ఊపందుకున్నాయి. ముందుగా పంటను సాగు చేసిన వారు నూర్పిళ్లు చేసి పంటను ఇళ్లకు చేరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. పంట సాగుచేసే సమయంలోనే రైతులు ఈ-పంట నమోదు చేయించుకున్నారు. అయినప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు అడిగిన ధరకే అమ్మాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రైతుల అవసరాలను వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 

కోటి రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్న రైతులు

సజ్జ పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ.2250 ప్రకటించగా వ్యాపారులు రూ.1250లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాకు రూ. 950 చొప్పున నష్టపోతున్నారు. ఈ ఏడాది సరాసరిన ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ లెక్కన మండలంలో సుమారు 10 వేల క్వింటాళ్ల సజ్జలు దిగుబడి రాగా, ధరలో తేడావలన సుమారు  కోటి రూపాయలు నష్టపోతున్నారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటిమీద రాతలయ్యాయని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-10-21T05:33:31+05:30 IST