సజావుగా ఉప ఎన్నికల నిర్వహణ

ABN , First Publish Date - 2022-05-27T05:20:25+05:30 IST

ఆత్మకూరు నియోజవకర్గ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు తెలిపారు.

సజావుగా ఉప ఎన్నికల నిర్వహణ
విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ఆత్మకూరులో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం

రిటర్నింగ్‌ అధికారిగా జేసీ హరేందిరప్రసాద్‌

ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ

జిల్లావ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్‌

కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడి


నెల్లూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఆత్మకూరు నియోజవకర్గ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం  కలెక్టరేట్‌ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ నెల 30వ తేదీన రిటర్నింగ్‌ అధికారి ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో తుది నోటిఫికేషన విడుదల చేస్తారని, ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని  తెలిపారు. జూన 6వ తేదీ వరకు నామినేషన్ల  స్వీకరణ, 7న  పరిశీలన, 9 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 23న పోలింగ్‌, 26వ తేదీన కౌంటింగ్‌ ఉంటుందని చక్రధర్‌బాబు వెల్లడించారు. ఈ ఉప ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)గా జాయింట్‌ కలెక్టర్‌  హరేందిరప్రసాద్‌ వ్యవహరిస్తారని తెలిపారు.


2,13,330 మంది ఓటర్లు


ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆత్మకూరు నియోజకవర్గంలో 2,13,330 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వెయ్యి మంది ఓటర్లు దాటిన చోట మరో పొలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక  ఎన్ని ఈవీఎంలు ఉపయోగించాలన్న దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలుకు రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల 28వ తేదీ వరకు కోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అవసరమైన చోట వీడియోగ్రఫీ చేస్తామని వివరించారు. కాగా ఇప్పటికే జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించుకునేందుకు ఇబ్బంది లేదని, అయితే ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనేందుకు వీల్లేదని కలెక్టర్‌ ఓ ప్రశ్నగా సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో జేసీ ఎంఎన హరేందిర ప్రసాద్‌, ఏఎస్పీ హైమావతి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్‌ ఏవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 



ఉప ఎన్నికను పకడ్బందీగా చేపట్టాలి


రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మీనా


నెల్లూరు (హరనాథపురం) : ఆత్మకూరు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పకడ్బందీ చర్యలను చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా కలెక్టర్‌ చక్రధర్‌బాబును ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స ద్వారా ఉపఎన్నిక నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొంటూ ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్సలో కలెక్టర్‌తోపాటు జేసీ హరేందిరప్రసాద్‌,  అదనపు ఎస్పీ హిమవతి తదితరులు పాల్గొన్నారు. 


‘కోడ్‌’ ఎఫెక్ట్‌.. విగ్రహాలకు ముసుగు

సంగం : ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు రెవెన్యూ అధికారులు గురువారం ముసుగులు తొడిగారు. సంగం చెక్‌పోస్టు సెంటర్‌లో ఉన్న మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి రెవెన్యూ సిబ్బంది ముసుగు తొడిగారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డులపైనా ముసుగు వేశారు. 

- సంగం



టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు 


నెల్లూరు(సిటీ) : ఎన్నికల ప్రవర్తనావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేసేందుకు కార్పొరేషనలో టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు ఒక ప్రకటనలో తెలిపారు. 0861-2301541, 1800425113 నెంబర్లకు ఫోన చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-27T05:20:25+05:30 IST