ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడరేం?

ABN , First Publish Date - 2020-06-05T11:02:11+05:30 IST

ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్‌ కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయలేక పోతున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ..

ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడరేం?

22 మంది ఎంపీలు ఉన్నా ఏం చేశారు?

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవమే లక్ష్యం

పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్‌


నంద్యాల, జూన్‌ 4: ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్‌ కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయలేక పోతున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు. అధికారంలోకి రాకమునుపు ప్రత్యేక హోదా గురించి జగన్‌ చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనని స్పష్టమైందన్నారు. గురువారం నంద్యాలలోని ఏకలవ్యనగర్‌లో పార్లమెంట్‌ డీసీసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి రాజీవ్‌భవన్‌ అనే పేరు పెట్టారు. నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహయాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజనాఽథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.


పార్టీలో యువత, మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తొలగించి అమ్మఒడి పథకంతో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యను దూరం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం వల్ల వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు 60 కేసుల్లో మొట్టికాయలు వేసిందని అన్నారు. శాసనమండలి, ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో ప్రభుత్వం బలప్రదర్శనతో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు, మద్యం ధరలను విపరీతంగా పెంచారని అన్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని పిలుపు నిచ్చారు.


వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేయాలని పిలుపు నిచ్చారు. నంద్యాల డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ కాంస్య విగ్రహాలను పీసీసీ అధ్యక్షుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాణ్యం ఇన్‌చార్జి నాగమధు, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి పుల్లయ్య, నంద్యాల ఇన్‌చార్జి చింతల మోహన్‌రావు, నందికొట్కూరు ఇన్‌చార్జి అశోక్‌రత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T11:02:11+05:30 IST