సైదాపురం రైతులకు పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-05-24T06:49:20+05:30 IST

యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

సైదాపురం రైతులకు పరిహారం ఇవ్వాలి
సైదాపురంలో భూనిర్వాసిత రైతులతో మాట్లాడుతున్న హనుమంతరావు

 అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధం 

 ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఏదీ?

 మాజీ ఎంపీ వి.హనుమంతరావు

యాదగిరిగుట్ట రూరల్‌, మే 23: యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆలేరులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి ఉదయం 10గంటలకు సైదాపురం మీదుగా వెళుతున్న వీహెచ్‌ కాన్వాయిని 60మంది భూనిర్వాసిత రైతులు ఆపి తమ గోడును విన్నవించారు. ప్రభుత్వం తక్షణం పరిహారం ఇవ్వకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులను సీఎం ఇప్పటివరకు పరామర్శించకుండా,  పరిహారం ఇవ్వకుండా పంజాబ్‌ రాష్ట్రంలోని రైతులకు ఒక్కొక్కరికి రూ.3లక్షల వంతున పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామంలోని రచ్చబండ వద్ద కూర్చుని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి వీహెచ్‌ ఫోన్‌ చేశారు. సర్వే నెం. 329, 314లో 66 ఎకరాల భూమిని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దళితులకు ఇస్తే వారి పేరిట రిజస్టర్‌ అయిందని, ఆ భూమిని యాదగిరిగుట్టలో బస్‌డిపో నిర్మించేందుకు వైటీడీఏ కోసం నాలుగేళ్ల క్రితం భూనిర్వాసితుల నుంచి సేకరించి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. తక్షణమే పరిహారం ఇవ్వకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. యాదగిరిగుట్ట తహసీల్దార్‌ రామును సైదాపురం పంపిస్తానని జాయింట్‌ కలెక్టర్‌ వీహెచ్‌కు హామీఇచ్చారు. తహసీల్దార్‌ వచ్చేవరకు అరగంటపాటు వీహెచ్‌ రచ్చబండ వద్దే నిద్రించి నిరసన తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చిన తహసీల్దార్‌ రాముతో వీహెచ్‌ మాట్లాడుతూ వైటీడీఏ పేరుతో ఇక్కడి భూములను తీసుకుని రైతులను న్యాయం చేయలేదని తహసీల్దార్‌ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్‌ రాము మాట్లాడుతూ ఈ సమస్యపై  జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వీహెచ్‌ వెంట ఉప సర్పంచ్‌ దుంబాల సురేఖవెంకట్‌రెడ్డి, సతీష్‌, శిఖ ఉపేందర్‌గౌడ్‌, రైతులు ఉన్నారు.

Updated Date - 2022-05-24T06:49:20+05:30 IST