Approval of Corporation: సైదాపేటలో కరుణ కాంస్య విగ్రహం

ABN , First Publish Date - 2022-08-31T13:30:23+05:30 IST

స్థానిక సైదాపేట బజారువీధి, అన్నాసాలై కూడలిలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని

Approval of Corporation: సైదాపేటలో కరుణ కాంస్య విగ్రహం

- నగరంలో మరో మూడు డయాలసిస్‌ సెంటర్లు 

- చెన్నై కార్పొరేషన్‌ తీర్మానం


చెన్నై, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సైదాపేట బజారువీధి, అన్నాసాలై కూడలిలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం రిప్పన్‌భవనం సమావేశ మందిరంలో మేయర్‌ ప్రియ అధ్యక్షతన కార్పొరేషన్‌  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్‌ కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు సైదాపేటలో కరుణ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేయర్‌ ప్రియ ప్రకటించారు. ఇదిలా వుండగా ఎగ్మూరు మ్యూజియం(Egmoor Museum) వద్ద ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇటీవల ఆవిష్కరించిన గాంధీ విగ్రహానికి ఎన్‌వోసీ జారీ చేసేందుకు తీర్మానం గ్రీన్‌సిగ్నల్‌(Greensignal) ఇచ్చింది. నగరంలో ప్రస్తుతమున్న ఆరు రక్త శుద్ధీకరణ కేంద్రాల (డయాలసిస్‌ సెంటర్ల)తోపాటు అదనంగా మరో మూడు చోట్ల వాటిని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేయాలని మరో తీర్మానం చేసింది. ఆ మేరకు ఇళంగోనగర్‌, అంబత్తూరు పాడి, సెమ్మంజేరి ప్రాంతాల్లో డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ ప్రకటించారు. కార్పొరేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న 117 దుకాణాలకు సంబంధించిన వేలం పాటలను ఒకే విడతగా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. నగరంలో నిరుపయోగంగా ఉన్న పాఠశాలల భవనాలను కూల్చివేయాలని తీర్మాణించారు. ఈ సమావేశంలో మొత్తం 61 తీర్మానాలు చేశారు. ఇక కొడుంగయూరు డంపింగ్‌ యార్డులో తరచూ అగ్ని ప్రమాదాలు జరగ కుండా ఆ యార్డ్‌ వద్ద బయోమైనింగ్‌ ద్వారా చెత్త తొలగించే పథకాన్ని అమలు చేయనున్నట్లు మేయర్‌ ప్రియ ప్రకటించారు.


మా గోడు పట్టించుకోరా?: అన్నాడీఎంకే

కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు తమ వార్డు సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నాడీఎంకే కౌన్సిలర్లు ఆరోపించారు. కార్పొరేషన్‌ సమావేశం అనంతరం ఆ పార్టీ కౌన్సిలర్‌ కేపీకే సతీష్‏కుమార్‌(KPK Satish Kumar) మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నగరంలో అమలు చేసిన పథకాలను బుట్టదాఖలు చేశారని, తమ వార్డులలో ప్రదాన సమస్యలపై వినతులు సమర్పించినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. నగరంలో అమ్మా క్లినిక్‌లను వరుసగా మూసివేస్తున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - 2022-08-31T13:30:23+05:30 IST