అన్నారం పంచాయతీ పాలకుల మధ్య వార్‌

ABN , First Publish Date - 2022-01-24T04:37:33+05:30 IST

అన్నారం గ్రామపంచాయతీలో కొంతకాలంగా పంచాయతీ పాలకుల మధ్య వార్‌ కొనసాగుతోంది.

అన్నారం పంచాయతీ పాలకుల మధ్య వార్‌
అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయం

రెండు వర్గాలుగా విడిపోయిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌

గుమ్మడిదల, జనవరి 22 : అన్నారం గ్రామపంచాయతీలో కొంతకాలంగా పంచాయతీ పాలకుల మధ్య వార్‌ కొనసాగుతోంది. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ రెండు వర్గాలుగా విడిపోయి పాలనను విస్మరిస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం కలిగిన అన్నారం గ్రామపంచాయతీలో ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. కొత్తగా పాలకవర్గం ఎన్నికైనప్పటి నుంచి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు గ్రామాభివృద్ధికి సమన్వయంతో ముందుకుపోయారు. అయితే అవుటర్‌ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో అన్నారం గ్రామపంచాయతీ ఉండడంతో భూములు ధరలు కోట్లలో పెరగడం, ఇక్కడ వెంచర్ల ఏర్పాటుకు పలువురు ముందుకు రావడంతో గ్రామపంచాయతీ అనుమతులు తప్పనిసరి కావడంతో పంచాయతీ పరిపాలన తీర్మానాలకు విలువ పెరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌కు ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ, ఇద్దరి మధ్య వార్‌ మొదలైంది. ఇద్దరూ చెరి సగం వార్డుసభ్యులతో విడిపోయి సమావేశాలను బహిష్కరించి వెళ్లిపోతున్నారు. గతంలో రెండుసార్లు సర్వసభ్య సమావేశంలో ఇద్దరూ వ్యక్తిగత వాదనతో సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎలాంటి తీర్మానాలు చేయకుండా మిగతా సభ్యులు ఉండిపోవాల్సి వచ్చింది. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ మధ్య సమన్వయలోపం ఉంటే పరిపాలన ఎట్లా ముందుకుపోతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇరువురి మధ్య పంచాయతీ ముదిరిపోవడంతో మండల ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఓ ఫంక్షన్‌హాల్లో ఇరువురిని కూర్చోబెట్టి వివాదం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ చర్చలో భాగంగా కొంతకాలంగా అన్నారం గ్రామంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు పలువురు బయటపెట్టడంతో అందరూ అవాక్కయ్యారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు వివాదాలకు ముగింపు పలికి గ్రామాభివృద్ధికి పాటుపడాలని మండల ప్రజాప్రతినిధులు సూచించారు. 

Updated Date - 2022-01-24T04:37:33+05:30 IST