Jun 27 2021 @ 01:32AM

పెళ్లైన రెండు నెలలకు చెప్పారు!

బాలీవుడ్‌ దర్శకుడు ఆనంద్‌ తివారీ, నటి అంగీరా ధర్‌ పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరూ ‘లవ్‌ పర్‌ స్క్వేర్‌ ఫూట్‌’(నెట్‌ఫ్లిక్స్‌లో 2018లో విడుదలైంది)కి కలిసి పని చేశారు. విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ఆ చిత్రంతో ఆనంద్‌ తివారీ దర్శకుడిగా పరిచయం కాగా, అందులో అంగీరా ధర్‌ నటించారు. చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే... ఏప్రిల్‌ 30న పెళ్లైంది. తీరిగ్గా జూన్‌ 25 తామిద్దరం పెళ్లి చేసుకున్నామని ప్రకటించారు. ఏడడుగులు వేసిన రెండు నెలలకు అందరికీ చెప్పారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించారు. ఇప్పుడు పెళ్లి గురించి చెప్పడంతో అందరికీ తెలిసింది. అన్నట్టు... ఆనంద్‌ తివారీ కూడా నటుడే. ‘కైట్స్‌’, ‘ఉడాన్‌’, ‘గో గోవా గాన్‌’ చిత్రాల్లో నటించారు. ‘లవ్‌ పర్‌ స్క్వేర్‌ ఫూట్‌’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇక, అంగీరా ధర్‌ విషయానికి వస్తే... ప్రస్తుతం ‘కమాండో-3’ చిత్రంతో పాటు ‘బ్యాంగ్‌ బజా బరాత్‌’లో నటించారు. ప్రస్తుతం ‘మేడే’లో నటిస్తున్నారు.


Bollywoodమరిన్ని...