సాయిరెడ్డీ... అన్నీ చెబుతా.. బీ రెడీ!

ABN , First Publish Date - 2021-02-14T14:27:44+05:30 IST

అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది....

సాయిరెడ్డీ... అన్నీ చెబుతా.. బీ రెడీ!

వైఎస్ షర్మిల రాజకీయ నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ రాత్రి పూట కలలు కంటారు, ఆ కలలే పొద్దున ‘ఆంధ్రజ్యోతి’లో వార్తగా వస్తాయి అని విజయసాయిరెడ్డి వెటకారం ఆడారు. మేడం షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తనకే తెలియదని, అలాంటప్పుడు రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వాదించారు కూడా! విజయసాయి రెడ్డికి తెలియకపోవడానికి నేను బాధ్యుణ్ని కాను కదా! విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనివుండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది.


జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికై..!

ఈ విషయం అలా ఉంచితే, పరిటాల రవీంద్రను ఎందుకు హత్య చేశారని విలేకరులు ప్రశ్నించినప్పుడు సూరి బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లలో ఆనందం చూడటానికి అని మొద్దు శీను అన్న మాటలు అప్పుడు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికై పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు హద్దు మీరి మాట్లాడుతున్నారు. జగన్‌ దగ్గర తన ప్రాభవం తగ్గకుండా ఉండడం కోసం విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో మీడియాపైన కూడా నోరు పారేసుకుంటున్నారు. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారని రెండు వారాల క్రితం నేను చెప్పినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. పార్టీ పెడితే గిడితే ఆంధ్రప్రదేశ్‌లో పెడతారు గానీ, తెలంగాణలో ఎందుకు పెడతారని లాజిక్కులు తీసే ప్రయత్నం చేశారు. జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు వచ్చాయని చెప్పడాన్ని ఇష్టపడని ఒక ప్రబుద్ధుడైతే ‘రాధాకృష్ణకు ఆయన కొడుకుతో పడటం లేదు. కొడుకు ఆంధ్రాలో పేపర్‌ పెట్టి రాధాకృష్ణను ముప్పుతిప్పలు పెట్టబోతున్నారు’ అని అజ్ఞానం, అసహనం ప్రదర్శించారు. వార్తను వార్తగా చూసే రోజులు పోయాయి కనుక ఎవరి ఇష్టం వారిదే.


త్వరలోనే అందరికీ తెలుస్తాయ్!

ఈ నెల 9న లోటస్‌పాండ్‌ వద్ద ఉన్న తన నివాసానికి చేరుకున్న షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తానని ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రకటించారు. ఈ వార్తకు మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు కూడా షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు తెలియలేదట! షర్మిల రాజకీయ నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ రాత్రి పూట కలలు కంటారు, ఆ కలలే పొద్దున ‘ఆంధ్రజ్యోతి’లో వార్తగా వస్తాయి అని వెటకారం ఆడారు. మేడం షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తనకే తెలియదని, అలాంటప్పుడు రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వాదించారు కూడా! విజయసాయిరెడ్డికి తెలియకపోవడానికి నేను బాధ్యుణ్ని కాను కదా! విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనిఉండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది. 


ఇంకెంతగా నాపై రెచ్చిపోతారో..!

ఇదే విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడిని కించపరుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడి శరీరం బీజేపీతో ఉన్నప్పటికీ మనసు మాత్రం తెలుగుదేశం పార్టీతో ఉంటుందని నిండుసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇతర రాజకీయపార్టీలు తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సైతం, చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని నిలదీయడంతో విధిలేని పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పుకున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఇతర అధికార పార్టీ పెద్దలు హద్దులు మీరి విమర్శలు చేస్తున్న విషయం ఢిల్లీలో చాలా మందికి తెలియదు. విజయసాయిరెడ్డి పుణ్యమా అని వైసీపీ నైజం ఇప్పుడు ఢిల్లీలో కూడా అందరికీ తెలిసి వచ్చింది. తనకు అడ్డుగా ఉన్నారని భావిస్తే చాలు, ఏ వ్యవస్థ పైనైనా దాడి చేయడానికి అలవాటు పడిన జగన్‌ అండ్‌ కో, అందులో భాగంగా ఉపరాష్ట్రపతిపై కూడా దాడికి తెగబడింది. రాజకీయాల్లో అజాతశత్రువుగా ఉంటూ వచ్చిన వెంకయ్యనాయుడు అంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎందుకో గానీ ఇష్టం ఉండదు. బహుశా ఈ కారణంగా జగన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం చూడడం కోసం విజయసాయిరెడ్డి నోరు పారేసుకుని ఉండొచ్చు. తన అహంకారపూరిత వ్యాఖ్యల ద్వారా ఆయన మొద్దు శీనును గుర్తుకుతెస్తున్నారు. ఇప్పుడు జగన్‌, షర్మిల మధ్య ముదిరిన విభేదాలతో పాటు తాడేపల్లి అంతఃపురం రహస్యాలను బయటపెడుతున్నందున విజయసాయిరెడ్డి ఇంకెంతగా నాపై రెచ్చిపోతారో వేచిచూడాలి.


అభూతకల్పనలు మాకెందుకు..!?

రెండు వారాల క్రితం నేను చెప్పిన మాటలను చాలామంది విశ్వసించలేదంటే అర్థం ఉంది. ఏమి జరుగుతున్నదో కళ్లెదుటే కనిపిస్తున్నా బుకాయించాలనుకోవడం తెంపరితనమే అవుతుంది. చెప్పింది రాసుకోవడమే జర్నలిజమని విజయసాయిరెడ్డి, ప్రభృతులు భావిస్తుండవచ్చు గానీ నేను నిన్నటి తరానికి చెందిన జర్నలిస్టును కూడా! సుబ్బారాయుడు, జి.కృష్ణ వంటి ఉద్ధండుల వద్ద జర్నలిజంలోని మెళకువలను నేర్చుకున్నాను. కంటికి కనిపించనివీ, చెవులకు వినపడనివీ ఎన్నో జరుగుతుంటాయి. వాటిని తెలుసుకొని ప్రజలకు తెలియజేయడం జర్నలిస్టుల బాధ్యత. ఒక మీడియా సంస్థ అధిపతిగా కూడా ఉన్న నేను రాసే కాలమ్‌లో అవాస్తవాలు, అభూతకల్పనలు రాస్తే, ‘ఆంధ్రజ్యోతి’, ఏబీఎన్‌ విశ్వసనీయత దెబ్బతినదా? జగన్‌కు, షర్మిలకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? అని నన్ను ప్రశ్నిస్తే లాభం లేదు. సోదరుడితో విభేదించడానికి కారణం ఏమిటో షర్మిల తన బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులకు పూసగుచ్చినట్టు వివరించారు గనుక విజయసాయిరెడ్డి వంటి వారికి ఇప్పటికైనా స్పష్టత వస్తుందని ఆశిద్దాం. ప్రత్యర్థులు అనుకునే వారిపై నోరు పారేసుకునే బదులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా జగన్‌ అండ్‌ కో తమ ప్రతాపాన్ని చూపిస్తే రాష్ర్టానికి మంచి చేసినవారవుతారు. బీజేపీ పెద్దలతో తమ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయా? లేదా? అని ఎప్పటికప్పుడు తూకం వేసి చూసుకునే బదులు ఆంధ్రుల పోరాటపటిమకు ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కేంద్రంపై పోరాటం చేయాల్సిన బాధ్యత జగన్‌ అండ్‌ కోపై ఉంది!

Updated Date - 2021-02-14T14:27:44+05:30 IST