డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా 12 సంవత్సరాల క్రితం తెరకెక్కిన 'బంపర్ ఆఫర్' చిత్రానికి సీక్వెల్ చేసిందుకు రంగం సిద్దమైంది. ఈ సీక్వెల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటనను శనివారం విడుదల చేశారు. ఆ చిత్రం సాధించిన విజయం సాయిరామ్ శంకర్‌కు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ 'బంపర్ ఆఫర్ - 2' పేరుతో చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ ఆశీస్సులతో.. సురేష్ విజయ ప్రొడక్షన్స్ మరియు సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్లు నిర్మాతలుగా 'బంపర్ ఆఫర్ 2' చిత్రం తెరకెక్కనుంది. 'బంపర్ ఆఫర్' విజయం నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
'బంపర్ ఆఫర్' చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుందని.. చిత్రంలోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చునున్నారు.