సహృదయ వీరాజీ

ABN , First Publish Date - 2021-09-02T05:58:25+05:30 IST

శ్రీ వీరాజీ గారి మృతివార్త (ఆగస్టు 20) చదివి మనస్సు వికలమైంది. ‘వీరాజీ’ గారి సోదరుడు గీతా సుబ్బారావు గారితో స్నేహ సంబంధాలు ఉండేవి....

సహృదయ వీరాజీ

శ్రీ వీరాజీ గారి మృతివార్త (ఆగస్టు 20) చదివి మనస్సు వికలమైంది. ‘వీరాజీ’ గారి సోదరుడు గీతా సుబ్బారావు గారితో స్నేహ సంబంధాలు ఉండేవి. శ్రీ సుబ్బారావు గారు మంచి కార్టూనిస్టుగా పేరు గాంచారు. నా మిత్రుడు సింగపల్లి అప్పారావు, నేను కలిసి వీరాజీ గారిని కలుసుకోవాలని విజయవాడ గాంధీ నగరంలోని ‘ఆంధ్ర సచిత్ర వార పత్రిక’ ఆఫీసుకి వెళ్ళాం ఒక రోజు. శ్రీ వీరాజీ గారు మమ్మల్ని స్నేహపూర్వకంగా వారి గదికి తీసుకువెళ్లారు (ఎడిటరుగా ఉన్నారు అప్పుడు వీరాజీ). ప్రేమ, సాన్నిహిత్యం కలబోసిన మాటలు మాట్లాడారు. ‘మా తమ్ముడి ద్వారా మీ గురించి విన్నాడను. ఫలానిది కథ గాని, నవల గాని ఏదైనా పాఠకులకు నచ్చేవిధంగా రాయండి. పత్రికలో పడాలన్నది ప్రధానోద్దేశం కాకూడదు. విష్ యు ఆల్ ది బెస్ట్’ అని ప్రోత్సాహకరంగా మాట్లాడి మా భుజాలపై చేయి ఉంచి బైట దాకా వచ్చి వదిలివెళ్ళారు. అలాంటి సహృదయుడాయన. 


‘ప్రేమకు పగ్గాలు’ పేరుతో ఆయన రాసి, ఆంధ్ర పత్రిక వార పత్రికలో ప్రచురితమైన నవల పాఠకుల మన్నన పొందింది. అప్పట్లో చాలామంది యువ రచయితలకు (ఉదాహరణకు శ్రీ ఆదివిష్ణు, శ్రీరంగధాం లాంటి వాళ్ళకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. కీ.శే. శారద (అసలు పేరు ‘నటరాజన్’) రాసిన ‘మంచీ–చెడూ’, ‘అపస్వరాలు’ ప్రచురించి ప్రోత్సాహపరిచారు. వీరాజీ రాసిన ‘సామాన్యుని సణుగుడు’ పాఠకుల అభిమానాన్ని చూరగొంది. ఈమధ్యనే ఆయన రాసిన సంపాదకీయ వ్యాసాలు ఒక పుస్తకంగా ప్రచురించారు. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి పాఠకుడూ గుర్తుంచుకోదగిన రచయిత. అలాంటి మంచి సాంస్కృతిక భావాలు కలిగిన రచయిత, సంపాదకులు కనుమరుగై పోయారంటే చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 

‘శ్రీసింధు’, హైదరాబాద్

Updated Date - 2021-09-02T05:58:25+05:30 IST