తొలకరి పలకరింపు..!

ABN , First Publish Date - 2022-06-29T03:07:44+05:30 IST

తొలకరి జల్లులు పలుకరించడంతో ఆశల సాగు మొదలైంది.

తొలకరి పలకరింపు..!
విత్తనం వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు

రైతుల్లో మొదలైన ఆశలు

మెట్ట పంటల సాగుకు ఆసక్తి

వరి సాగుపై ఆనాసక్తి 

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 28: తొలకరి జల్లులు పలుకరించడంతో ఆశల సాగు మొదలైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత రబీ సీజన్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్‌ సీజన్‌లోనైనా పంటలు పండితే కష్టాలు కొంతైనా తీరుతాయని ఎప్పటిలాగా ఆశావహంగా ముందడుగు వేస్తున్నారు. ఉదయగిరి సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీతారామపురం, మర్రిపాడు, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పసుపు, రాగి తదితర పంటలతోపాటు అరకొరగా వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పంటల సాగుకు పెట్టుబడులు అధికమయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఎరువులు, విత్తనాల ధరలతోపాటు ట్రాక్టర్‌ అద్దెలు కూడా రెట్టింపయ్యాయని, పండించిన పంట దిగుబడులకు మద్దతు ధర ఉంటే బాగుంటుందని రైతులు వాపోతున్నారు. 

పెరిగిన పెట్టుబడులు : భూములు పదును కావడంతో రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ మార్కెట్‌లో విత్తనాలు, ఎరువుల ధరలు గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపయ్యాయి. గతంలో డీఏపీ, సూపర్‌, ఫాస్పెట్‌, ఇతర రకాల ఎరువుల బస్తాపై రూ.300 నుంచి రూ.500 ధర పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే విత్తనాల ధర సైతం రెండింతలు పెరిగాయని అంటున్నారు. డీజల్‌ ధర పెరుగుతుండడంతో ట్రాక్టర్ల యజమానులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం మెట్ట దుక్కికి గంటకు రూ.1500, లోతు దక్కులు రూ.2,500, గేజ్‌వెల్‌ రూ.2,500 తీసుకొంటున్నారు. ఒక్కో దుక్కికి రూ.400 నుంచి రూ.800 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంత కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వరి సాగుపై అనాసక్తి : భారీగా పెరిగిన పెట్టుబడులు, లభించని మద్దతు ధర కారణంగా రైతులు వరి సాగుపై అనాసక్తి చూపుతున్నారు. ఎకరా వరి పంట సాగుకు ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వేలు ఖర్చువుతుందని, అయినా మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన వస్తుందని రైతులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా మండలంలోని గండిపాళెం జలాశయంలో పుష్కలంగా నీరుంది. జలాశయం కింద వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా కేవలం 4-5 వేల ఎకరాలు మాత్రమే సాగవుతుంది. అందులోనూ ఆరుతడి పంటలే రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. రైతులు పంటలు సాగు చేసి అటు వర్షాలు, ఇటు మద్దతు ధర కోసం ఎదురుచూసినా రైతుకు నష్టాలు తప్ప లాభాలు రావడంలేదు. ఏదీ ఏమైనా ఆశల సాగుతో ఖరీఫ్‌ సీజన్‌లో కూడా రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2022-06-29T03:07:44+05:30 IST