యాసంగి నీటి విడుదలకు ప్రణాళిక

ABN , First Publish Date - 2020-11-29T05:57:17+05:30 IST

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో విడుదలకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎ్‌సపీ స్టేజ్‌-2 పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 7లక్షల ఎకరాల పంటల సాగుకు డిసెంబరు మొదటి, రెండు వారాల్లో నీరు విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేశారు.

యాసంగి నీటి విడుదలకు ప్రణాళిక

డిసెంబరు 7నుంచి ఎడమకాల్వకు..

ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌-2కు డిసెంబరు 15 నుంచి..

జనవరి వరకు వద్దంటున్న రైతులు

7లక్షల ఎకరాలకు షెడ్యూల్‌

సన్న రకం సాగు 50శాతమే

నల్లగొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో విడుదలకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎ్‌సపీ స్టేజ్‌-2 పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 7లక్షల ఎకరాల పంటల సాగుకు డిసెంబరు మొదటి, రెండు వారాల్లో నీరు విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేశారు. కాగా, అకాల వర్షాలు, డిసెంబరు 10 వరకు వరుస తుపానులు, ఇంకా కొన్ని చోట్ల వరి కోతలు పూర్తికాకపోవడంతో జనవరి వరకు సాగునీరు అవసరం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, యాసంగి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.


సాగునీటి ప్రణాళిక సిద్ధం

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని ఒకటో జోన్‌కు డిసెంబరు 7వ తేదీ నుంచి మార్చి 31 వరకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్‌ సిద్ధం చేశారు. మంత్రి జగదీ్‌షరెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆయనతో మాట్లాడి షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 50టీఎంసీలు యాసంగికి వారబందీ విధానంలో ఇవ్వనున్నారు. సాగునీరు పుష్కలంగా ఉండటంతో యాసంగిని త్వరగా ప్రారంభించి ముందే ముగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉండటంతో, ఆమేరకు సాగునీటి శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా యాసంగిలో డిసెంబరు 10 తరువాత సాగునీటిని విడుదల చేసి ఏప్రిల్‌ 15 వరకు కొనసాగించేవారు. కాగా, ఈ ఏడాది డిసెంబరు మొదటి వారంలోనే నీటి విడుదలను ప్రారంభించి మార్చి 31లోపు ముగించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఎడమ కాల్వ కింద మొదటి జోన్‌లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని 3.50లక్షల ఎకరాలు సాగుకానున్నాయి. ఇక ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌-2 కింద ఉన్న సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని సుమారు 3.50లక్షల ఎకరాలకు డిసెంబరు 15వ తేదీ నుంచి మార్చి 31 వరకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. వారబందీ విధానంలో 8 రోజులు నీటి విడుదల ఉంటే, ఏడు రోజులు విరామం ఇచ్చేలా అధికారులు షెడ్యూల్‌ రూపొందించారు.


జనవరి నుంచే మేలంటున్న రైతులు

ఉమ్మడి జిల్లాలో ఇంకా వరి కోతలు పూర్తి కాలేదు. డిసెంబరు 10 వరకు తుపానులు పొంచి ఉన్నాయనే వాతావారణశాఖ హెచ్చరికలు ఉన్నాయి. నారు చేతికి రావాలంటే సాధారణంగా 20 నుంచి 25 రోజులు పడుతుంది. సాధారణంగా యాసంగికి ముదిరిన నారు వాడుతారు. చలికాలంలో నారు ముదిరి నాట్లకు అందాలంటే కనీసం 30 రోజులు పడుతుంది. దీంతో జనవరిలో నీరు వదిలితే ప్రయోజనం ఉంటుందని, లేదంటే నీటి వృథా తప్పదని ఆయకట్టు రైతులు అభిప్రాయపడుతున్నారు.


యాసంగిలో 9లక్షల ఎకరాల సాగు

యాసంగి సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 4.97లక్షల ఎకరాల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో 4.70లక్షల ఎకరాల్లో వరి, 16.04వేల ఎకరాల్లో వేరుశనగ, 11వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. సూర్యాపేట జిల్లాలో యాసంగిలో 5.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా, అందులో 4.61లక్షల ఎకరాల్లో వరి, 5వేల ఎకరాల్లో వేరుశనగ, 70వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. అందుకు తగిన విధంగా వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసింది. అయితే వానాకాలం సీజన్‌లో సన్నాల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా యాసంగిలో ఈ రకం సాగు తగ్గనుంది. ఈ నేపథ్యంలో సన్నరకం వరి 50శాతం మాత్రమే సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.


ఎరువులు, విత్తనాలు సిద్ధం :  శ్రీధర్‌ రెడ్డి, నల్లగొండ జేడీఏ

యాసంగిలో పంటల సాగుకు రైతాంగానికి సరిపడా ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. 60వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 24వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈమారు నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో వరి సన్నరకాలు 50శాతం, దొడ్డు రకాలు 50శాతం సాగు కానుంది. బోరు బావుల కింద 95శాతం దొడ్డు రకాలు, మిగిలిన 5శాతం సన్నరకాలు సాగుకానున్నాయి. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు ఎప్పటికపుడు అందుబాటులో ఉంచుతాం.

Updated Date - 2020-11-29T05:57:17+05:30 IST