సాగరేయులూ భూమిపుత్రులూ

ABN , First Publish Date - 2021-04-21T05:49:21+05:30 IST

ఫ్రెంచ్ విప్లవ కాలం (1789–99)లో ప్యారిస్, లండన్ నగరాలలో నెలకొన్న పరిస్థితులు, సంభవించిన సంఘటనల గురించి ఆంగ్ల మహా రచయిత...

సాగరేయులూ భూమిపుత్రులూ

ఫ్రెంచ్ విప్లవ కాలం (1789–99)లో ప్యారిస్, లండన్ నగరాలలో నెలకొన్న పరిస్థితులు, సంభవించిన సంఘటనల గురించి ఆంగ్ల మహా రచయిత ఛార్లెస్ డికెన్స్ (1812–70) తన ‘ఏ టేల్ ఆఫ్‌ టు సిటీస్’ నవలలో విశదంగా వర్ణించారు. ‘వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్నశకం’ అయిన ఆ విప్లవకాలంలో ఫ్రెంచ్, ఇంగ్లీష్ మహానగరాల గురించి డికెన్స్ అందించిన భావచిత్రాలలోని తారతమ్యాలు ఢిల్లీ శివార్లలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతిష్టంభనను మనకు గుర్తు చేస్తాయి. వర్తమాన సంక్షోభపు రెండు భిన్న ప్రతిబింబాలకు పంజాబ్ రైతుజనం, గుజరాత్ పాలక శిష్టులు స్థూలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


పురా నవ భారతదేశ సుదీర్ఘ చరిత్రలో పంజాబ్, గుజరాత్‌లకు ఒక విశిష్ట ప్రాధాన్యమున్నది. ఈ రెండు ప్రాంతాలూ సింధులోయ, హరప్పా నాగరికతకు ఆటపట్టులే. క్రీస్తుపూర్వం 1900 శతాబ్దిలో గుజరాత్‌లోని లోథాల్, ధోల్వీరాలలోను; పంజాబ్‌లోని రూపార్, రఖిగడ్హిలలోనూ ఆ తొలి మానవ నాగరికత విలసిల్లింది. ఆ పురాతన వారసత్వాన్ని ఆ ప్రాంతాలు ఇప్పటికీ తమలో నిలుపుకున్నాయి. జాట్‌లు, గుజ్జర్లతో సహా ఆ సమష్టి వారసులు నేటికీ దేశరక్షణలో అనుపమాన త్యాగాలతోనూ, జాతిని మరింత సంపద్వంతం చేయడంలోనూ సమస్త భారతీయులకూ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. 


దాస్యబంధనాల నుంచి మాతృభూమిని విముక్తం చేయడంలో లాలా లజ్‌పత్ రాయ్, సర్దార్ భగత్‌ సింగ్‌ల రూపేణా పంజాబ్ మహోన్నత పాత్ర వహించింది. అదే కృషిలో మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా గుజరాత్‌కు అద్వితీయ యశస్సును సమకూర్చారు. స్వాతంత్ర్యానికి పూర్వం పంజాబ్, గుజరాత్‌లలోని కొన్ని భాగాలు ఒక విశాల రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1950, 1960 దశకాలలో భాషాప్రయుక్తత సూత్ర ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలలో అవి అంతర్భాగాలయ్యాయి. దేశ విభజన వ్యధలు, వేదనలను పంజాబీలతో పాటు గుజరాతీలు కూడా గణనీయంగా అనుభవించారు. 


పాకిస్థాన్ నుంచి తరలివచ్చిన పంజాబీ శరణార్థులు క్రమంగా నిలదొక్కుకొని వివిధ, మత, సామాజిక సమూహాలుగా సమైక్యమై స్వతంత్ర భారతదేశం తమకు సృష్టించిన అవకాశాలను సంపూర్ణంగా సద్వినియోగపరచుకున్నారు. సాగునీటి జలాల సమృద్ధితో అధిక దిగుబడుల నిచ్చే వంగడాలను అభివృద్ధిపరచి హరిత విప్లవాన్ని సాధించి భారత్‌కు ఆహార స్వావలంబన సమకూర్చిన ఘనత చాలవరకు పంజాబీలదే. లూధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మేధా కృషి, వలసవచ్చిన కూలీలతో సహా వ్యవసాయ శ్రామికుల కఠోరశ్రమతో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి)లో పంజాబ్ అగ్రగామిగా ఆవిర్భవించింది. వ్యవసాయం, దాని అనుబంధరంగాల విశేష పురోగతే పంజాబ్‌కు ఈ అగ్రస్థానాన్ని కల్పించాయని మరి చెప్పనవసరం లేదు. 


భారత్‌లో అతి సుదీర్ఘ (1600 కిలోమీటర్ల) తీరరేఖతో గుజరాత్‌కు స్వతస్సిద్ధ భౌగోళిక అనుకూలతలు సిద్ధించాయి. పశ్చిమాసియా దేశాలతో సామీప్యత వాణిజ్య వర్తకాలలో అగ్రగాములు అయ్యేందుకు గుజరాతీలకు విశేషంగా తోడ్పడింది. వ్యాపార వాణిజ్యాలలో మహా నిపుణులు అయిన సింధీలు దేశ విభజన అనంతరం అత్యధికంగా గుజరాత్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. సహస్రాబ్దాల క్రితమే గుజరాత్ తీరంలో స్థిరపడిన పార్సీలతో పాటు సింధీలు గుజరాత్‌ను సంపద్వంతం చేసేందుకు పాటుపడ్డారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఆనంద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ గుజరాత్ అభివృద్ధి వ్యూహాల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. 


పంజాబ్, గుజరాత్‌ల మధ్య తారతమ్యాలు ఆ రెండు రాష్ట్రాల సామాజిక-, ఆర్థిక అభివృద్ధి సాధనలో ప్రతిబింబిస్తున్నాయి. 2.7 కోట్ల జనాభా గల పంజాబ్, అందుకు రెండు రెట్ల కంటే ఎక్కువ (6.04 కోట్లు) జనాభా గల గుజరాత్ కంటే భిన్నమైనది. పంజాబ్ జనాభాలో షెడ్యూల్డు కులాల వారు 32 శాతం మేరకు ఉండగా ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) వారు 40.6 శాతం మేరకు ఉన్నారు. షెడ్యూల్డు తరగతుల వారి ఉనికి పంజాబ్‌లో చాలా తక్కువ. 


షెడ్యూల్డు తరగతుల వారు గణనీయంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో గుజరాత్ ప్రధానమైనది. ఆ రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు 14.8 శాతం మేరకు ఉన్నారు. ఓబీసీ జనాభా 25.6 శాతం కాగా, షెడ్యూల్డు కులాలవారు కేవలం 6.7 శాతం మంది మాత్రమే ఉన్నారు. గుజరాత్‌లో షెడ్యూల్డు తరగతుల జనాభా భౌగోళిక పంపిణీ ముఖ్యంగా ఐదు జిల్లాల్లో అత్యధికంగా ఉంది. ఆ జిల్లాల మొత్తం జనాభాలో 95 శాతం మంది ఆదివాసీలే ఉన్న వాస్తవాన్ని నిపుణులు తమ సూక్ష్మ పరిశీలనలోకి తీసుకోలేదు. డాంగ్స్, తాపి జిల్లాల్లో 84.2 శాతం, నర్మద జిల్లాలో 81.6 శాతం, దహోద్ జిల్లాలో 74.3 శాతం, వలసాద్ జిల్లాలో 53 శాతం మేరకు ఆదివాసీలు ఉన్నారు. 


రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ‌ప్రాంతాల జనాభాలో ఆదివాసీలు అత్యధికంగా ఉన్నది గుజరాత్‌లోనే కావడం గమనార్హం. ఆ రాష్ట్రంలోని మొత్తం 18,225 గ్రామాల్లో మూడోవంతు పల్లెలు ఐదో షెడ్యూలు ప్రాంతాలుగా ఉన్నాయి. పంజాబ్‌లో జనాభా భౌగోళిక పంపిణీ భిన్నంగా ఉన్నది. ఆ రాష్ట్రంలోని 57 గ్రామాల్లో నూటికి నూరు శాతం ప్రజలు షెడ్యూల్డుకులాల వారే. 4799 గ్రామాల్లో 40 శాతం మందికి పైగా షెడ్యూల్డుకులాల వారే ఉన్నారు. అయినప్పటికీ పంజాబ్‌లో దళితులపై దాడులు, దౌర్జన్యాల సంఘటనలు చాలా తక్కువ. ఈ నేరాలలో గుజరాత్ దేశంలో 4వ స్థానంలో ఉంది. 


పంజాబ్, గుజరాత్‌లలోని అభివృద్ధి లేదా అల్పాభివృద్ధి తీరుతెన్నులు సైతం భిన్నంగా ఉన్నాయి. పంజాబ్‌ను వ్యవసాయకంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, గుజరాత్‌ను పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగాను ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు గుర్తించారు. స్వాతంత్ర్యానంతర పెట్టుబడుల ఫలితంగానే ఆ రెండు రాష్ట్రాలు తమ తమ విలక్షణ రీతుల్లో అభివృద్ధి చెందాయి. గుజరాత్ జిఎస్‌డిపిలో తయారీరంగం వాటా 27శాతం కాగా వ్యవసాయ రంగం వాటా 19శాతం, సేవలరంగం వాటా 54శాతంగా ఉన్నది. ఇందుకు భిన్నంగా పంజాబ్ జిఎస్‌డిపిలో వ్యవసాయం వాటా 28శాతం కాగా తయారీ రంగం వాటా 25.2శాతం మాత్రమే. మిగిలిన దంతా సేవలరంగం వాటాగా ఉన్నది. తయారీరంగంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వాటా ఇప్పుడు అత్యధికంగా ఉన్నది. అయినప్పటికీ పంజాబ్ ఒక భూ పరివేష్టిత రాష్ట్రంగా వ్యవసాయ సమాజంగా మిగిలిపోయింది. గుజరాత్ తీరప్రాంత ఆధారిత కార్యకలాపాలతో వాణిజ్య, వ్యాపారకేంద్రంగా అభివృద్ధిచెంది విలసిల్లుతోంది. 


పంజాబ్ రైతులు, గుజరాత్ పాలక శిష్టుల మధ్య ప్రస్తుత రాజకీయ జగడాలను అర్థం చేసుకోవడం ఒక సంక్లిష్ట సమస్యగా ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల పురోగతి పథాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆ చిక్కు సమస్యను పరిష్కరించుకోవచ్చు. పంజాబ్, గుజరాత్‌లు 1970, 1980 దశకాలలో ఆర్థిక, సామాజిక ఉపద్రవాలను ఎదుర్కొన్నాయి. అయితే గుజరాత్ వాటి అఘాతం నుంచి సత్వరమే కోలుకోగా పంజాబ్ అంత త్వరగా కోలుకోలేక పోయింది. భారతదేశ ధాన్యాగారానికి పంజాబ్ తోడ్పాటు ఎనలేనిది. భారత ఆహారసంస్థ సేకరిస్తున్న వరిధాన్యంలో 90 నుంచి 95శాతం పంజాబ్ నుంచే కావడం గమనార్హం. గోధుమ ధాన్యం విషయంలో కూడా పంజాబ్ అగ్రగామిగా ఉన్నది. సగటు తలసరి ఆదాయం క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించక పోవడం కద్దు. తత్కారణంగా అభివృద్ధిఫలాలు ఏ మేరకు అట్టడుగుస్థాయి ప్రజలకు అందుతున్నాయనే విషయాన్ని ఆర్థిక నిపుణులు పోషకాహార స్థాయిలు, గిన్నీ గుణకం (ఆదాయ, సంపదల పంపకంలో ఉన్న అసమానతల స్థాయిలను సూచించే కొలమానం) పరంగా అర్థం చేసుకుంటున్నారు. గుజరాత్‌లో జిఎస్‌డిపి పెరుగుదలతో పాటు అసమానతలు కూడా పెరిగాయని నిపుణులు నిర్ధారించారు. మానవ అభివృద్ధి సూచీలోనూ, శిశుమరణాల రేటు విషయంలోనూ గుజరాత్ స్థానం ప్రశస్తంగా లేదు. ఈ విషయాలలో పంజాబే అన్ని విధాల గుజరాత్ కంటే మెరుగ్గా ఉంది. 


పంజాబ్, గుజరాత్ సాగుతున్న పథాలు ఆ రాష్ట్రాలను భిన్న అభివృద్ధి స్థాయిలలో నిలిపాయి. ఒక మార్కెట్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో గుజరాత్ అన్ని అవరోధాలను అధిగమించగలిగింది. వ్యవసాయం, వ్యవసాయాధారిత కార్యకలాపాలకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పంజాబ్ ఇప్పటికీ ఒక భూస్వామ్య, అర్ధభూస్వామ్య సమాజంగా మిగిలిపోయింది. మార్కెట్ ఆధారిత ఆర్థికవ్యవస్థలో ధనమే సమష్టి డిమాండ్ (వస్తుసేవలు అన్నింటికీ గల డిమాండ్. ఉత్పాదక, వినియోగ వస్తువులపై చేసిన మొత్తం ఖర్చుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు)ను నిర్ణయిస్తుంది. పాలన పాత్ర అప్రధానమైనది. ఆధునిక భారతదేశ అభివృద్ధికి ముఖ్యాధారాలు అయిన పంజాబ్, గుజరాత్ యావద్భారత అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయాలి. సమస్త భారతీయుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పంజాబ్ రైతులు, గుజరాతీ పాలక శిష్టులు తమ రాజకీయ జగడాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

ప్రొఫెసర్ కె.ఎస్. చలం

Updated Date - 2021-04-21T05:49:21+05:30 IST