మూడురోజుల్లో సాగర్‌ జలాలు

ABN , First Publish Date - 2020-08-08T09:54:55+05:30 IST

సాగర్‌ ఆయకట్టులో సాగు ఆశలు చిగురించాయి. కృష్ణా పరివాహకంలో సమృద్ధిగా వర్షాలు పడుతుండటం

మూడురోజుల్లో సాగర్‌ జలాలు

సీఎం ఆదేశాలతో ఎడమకాలువకు విడుదల 

ముఖ్యమంత్రికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు

ఆయకట్టులో వానాకాలం సాగుపై చిగురించిన ఆశలు 


ఖమ్మం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం) : సాగర్‌ ఆయకట్టులో సాగు ఆశలు చిగురించాయి. కృష్ణా పరివాహకంలో సమృద్ధిగా వర్షాలు పడుతుండటం, ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని  విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఆయన సత్వరమే ఎడమకాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌ ఎమ్యేల్యే నోముల నర్సింహయ్య శుక్రవారం సాయంత్రం పోట్టిచెలమ ఎడమకాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో మరో మూడు రోజుల్లో పాలేరు జలాశయానికి చేరుకోనున్న సాగర్‌ నీరు.. రెండోజోన్‌ 11మండలాల పరిధిలో 2.50లక్షల ఎకరాలకు అందనుంది.


ప్రస్తుతం పాలేరు జలాశయం నీటిమట్టం 23 అడుగుల పూర్తిస్థాయికి గాను 19.5 అడుగులకు చేరింది. ఇదిలా ఉంటే సాగర్‌ నీటి విడుదల నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. సాగర్‌ ఆయకట్టులో పూర్తిస్థాయిలో సాగు పనులు జరిగేలా, నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన వారితో సమీక్షించనున్నారు. ఇప్పటికే సాగర్‌ ఆయకట్టులో వర్షాధారంగా కొందరు, బావుల కింద కొందరు వరినాట్లు వేశారు. మరికొందరు రైతులు నార్లు పోసి సాగర్‌ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌జలాలలను విడుదల చేయడంతో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలేరు, వైరా, బేతుపల్లి, లంకసాగర్‌ రిజర్వాయర్లతోపాటు సాగర్‌ కాలవ ద్వారా పలు చెరువులకు నీరు చేరి ముమ్మరంగా వరినాట్లు పడే అవకాశం ఉంది. 


ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పువ్వాడ..

తాము విన్నవించిన వెంటనే నాగార్జునసాగర్‌ జలాలను విడుదల చేయించి ఆయకట్టు రైతుల్లో ఆనందం నింపేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రరవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను విన్నవించిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని, జిల్లాలో సాగర్‌ జలాలు సద్వినియోగం చేసుకుని రైతులు పంటలు సమృద్ధిగా పండించాలని కోరారు. నాగార్జునసాగర్‌ నుంచి నీరు పాలేరుకు చేరిన తర్వాత పాలేరునుంచి కూడా నిటిని విడుదల చేస్తామని, ఈ ఏడాది నీటి యాజమాన్య చర్యలపై ఆదివారం మధ్యాహ్నం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - 2020-08-08T09:54:55+05:30 IST