సాగర్‌ నీటిమట్టం 574.90 అడుగులు

ABN , First Publish Date - 2022-08-09T05:41:21+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎ గువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా ఎగువ నుంచి లక్షన్నర క్యూసెక్కుల కు పైౖగా నీరు వచ్చి చేరినప్పటికీ సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌ జలాశయానికి మొత్తం 83,071 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

సాగర్‌ నీటిమట్టం 574.90 అడుగులు
జలకళ సంతరించుకున్న సాగర్‌ప్రాజెక్టు

నాగార్జునసాగర్‌/ కేతేపల్లి/చింతల పాలెం/ డిండి, ఆగస్టు 8: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎ గువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా ఎగువ నుంచి లక్షన్నర క్యూసెక్కుల కు పైౖగా నీరు వచ్చి చేరినప్పటికీ సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌ జలాశయానికి మొత్తం 83,071 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 574.90 అడుగులకు (268.8689 టీఎంసీలు) చేరింది. మరో 44టీఎంసీల నీరు వచ్చి చేరితే సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. సాగర్‌ నుంచి కుడి కా ల్వ ద్వారా 2,236 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 2,608 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,640 క్యూసెక్కులు మొత్తంగా 35,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి ‘మూసీ’ నీటి విడుదల

ఎగువ మూసీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు దిగువన గల మూసీ ప్రాజెక్టుకు 11,813 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టాన్ని 638.10అడుగుల వద్ద నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోలో 8,887 క్యూసెక్కుల వరద నీటిని నాలుగు క్రస్టుగేట్ల ద్వారా దిగువ మూసీకి వదులుతున్నారు. 

రెండు గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల 

చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 52,727 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో రెండు గేట్లను మీటరు ఎత్తి 21,100క్యూసెక్కులు, ప్రాజెక్టు పవర్‌ హౌస్‌లోని మూడు యూనిట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 70 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు) అడుగులు, కాగా ప్రస్తుతం 171.58 అడుగులుగా (40.63టీఎంసీలు) ఉంది. 

నిండుకుండలా ‘డిండి’

ఎగువన కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు సోమవారం 36అడుగుల గరిష్టస్థాయికి చేరింది. 150క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. మరో 1300 క్యూసెక్కు లు స్పిల్‌వే, వియర్‌ నుంచి దిగువన డిండి వాగులో కలుస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 2.4టీఎంసీలు కాగా పూర్తిస్థాయికి చేరింది.

Updated Date - 2022-08-09T05:41:21+05:30 IST