నేడు.. నీటి విడుదల

ABN , First Publish Date - 2022-05-27T04:44:20+05:30 IST

జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి శుక్రవారం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఎస్సీ శ్రీహరి గురువారం తెలిపారు.

నేడు.. నీటి విడుదల
సాగర్‌ కుడి కాలువ

సాగర్‌ నుంచి కుడి కాలువకు సరఫరా

తాగునీటి ఎద్దడితో కేఆర్‌ఎంబీ ఆమోదం

తాగునీటి కోసం 10 టీఎంసీల కేటాయింపు

చెరువులు నింపుకోవాలంటున్న జలవనరుల శాఖ

నరసరావుపేట, మే 26: జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి శుక్రవారం కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఎస్సీ శ్రీహరి గురువారం తెలిపారు. జిల్లా పరిధిలో తాగునీటి ఎద్దడి తీవ్రమైన నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలను కేఆర్‌ఎంబీ కేటాయించింది. ఈ నీటితో తాగునీటి చెరువులు నింపుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్‌ శాఖ అధికారులకు జలవనరులశాఖ సూచించింది. యంత్రాంగం అప్రమత్తమై చెరువులు నింపుకోకుంటే తాగునీటికి ఇబ్బందేనని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో చెరువులను నింపుకునేందుకు అధికారులు సమాయత్తం కావాల్సి ఉంది. దాదాపు 10 రోజుల పాటు కాలువలకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చెరువులను నింపుకోకపోతే జూలై 15 వరకు నీటి సరఫరా ఉండదు.  

అడుగంటిన భూగర్భ జలాలు

జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. తాగునీరు అందుబాటులో లేక అనేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో 36.41 మీటర్ల నుంచి 57.37 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో బావులు, బోర్లు ఎండి పోతున్నాయి. కుడి కాలువ పరిధిలో గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే 219 చెరువుల్లో దాదాపు 23 చెరువుల్లో నీటి నిల్వలు అడుగంటాయి. 45 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల పురపాలక సంఘాలలో నీటి ఎద్దడి నెలకొంది. రెండు రోజులకు ఒక పూట ఈ మున్సిపాల్టీలలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల మున్సిపాల్టీలు, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలలో రోజుకు ఒక పూట నీటిని సరఫరా చేస్తున్నట్టు సదరు అధికారులు తెలిపారు. 


Updated Date - 2022-05-27T04:44:20+05:30 IST