సాగునీటిపై... అయోయయం

ABN , First Publish Date - 2022-07-21T05:30:00+05:30 IST

సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు నీటి విడుదలపై అయోమయం నెలకొంది. జూలై 15న నీటిని విడుదల చేస్తామని రెండు నెలల ముందగానే ప్రకటించిన ప్రభుత్వం దీనిని అమలు చేయలేక పోయింది.

సాగునీటిపై... అయోయయం
సాగర్‌ కుడి కాలువ

నేటికి స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

ఇంకా కేఆర్‌ఎంబీ అనుమతుల కోసమే ఎదురు చూపు

వరదలంటూ కవర్‌ చేసిన జలవనరుల శాఖ మంత్రి 

వరి సాగుపై అన్నదాతల ఆందోళన


నరసరావుపేట, జూలై 21 : సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు నీటి విడుదలపై అయోమయం నెలకొంది. జూలై 15న నీటిని విడుదల చేస్తామని రెండు నెలల ముందగానే ప్రకటించిన ప్రభుత్వం దీనిని అమలు చేయలేక పోయింది. కేఆర్‌ఎంబీ అనుమతులు లేకుండానే నీటి విడుదల తేదీని ప్రకటించి విఫలమైంది. అనుమతుల అంశాన్ని ప్రస్తావించకుండా వరదల వలన నీటి విడుదలను వాయిదా వేశామని జలవనరుల శాఖ మంత్రి కవర్‌ చేసుకున్నారు. అయన ఈ ప్రకటన చేసి వారం రోజులు పూర్తయింది. వర్షాలు, వరదలు సాగర్‌ అయకట్టులో లేవు. మరీ సాగునీటి విడదల తేదీని మంత్రి ప్రకటించక పోవడంపై కారణాలను అయకట్టు అన్నదాలకు తెలియజేయాల్సి ఉంది. నీటి విడుదల ఏప్పటి నుంచి ఉంటుందో తెలియజేయలేని స్థితిలో జలవనరుల శాఖ ఉంది. నీటి విడుదలపై ఎటువంటి ఉత్తర్వులు తమకు రాలేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.


రైతులు సమాయత్తం..

నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో అయకట్టు అన్నదాతలు వరి సాగుకు సమాయత్తమయ్యారు. నారు మళ్ళను సిద్ధం చేశారు. విత్తనసేకరణ కూడా చేసుకున్నారు. సాగునీటిని విడుదల చేయకపోవడంతో వరి రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నీటి విడుదల చేయలేని ప్రభుత్వం వెనువెంటనే నీటిని విడుదల చేసే తేదీని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. పల్నాడు జిల్లాలో 1,13,158 ఎకరాలలో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీరు విడుదల కాకపోవడంతో అయకట్లులో ఒక్క ఎకరంలో కూడా వరి సాగు కాలేదు.


జలాశయాలకు భారీగా వరద నీరు

ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శీశైలం జలాశయానికి 1,76,307 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. శ్రీశైలం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం సాయంత్రం 880.02 అడుగల నీటి మట్టం ఉంది. ఈ జలాశయం 87.15 శాతం నిండింది. ఇంకా 27.67 టీఎంసీల నీరు వస్తే శ్రీశైలం పూర్తిగా నిండుతుంది. శుక్రవారం శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. సాగర్‌ జలాశయానికి 31,184 క్కూసెక్కుల నీరు వస్తున్నది. రోజురోజుకు సాగర్‌కు వరద నీటి ప్రవాహం పెరగనున్నది. చెప్పిన తేదీకి నీటిని విడుదల చేయలేక పోయిన ప్రభుత్వం కుడి కాలువకు నీటి విడుదలపై ఇప్పటికైనా కేఆర్‌ఎంబీతో చర్చలు జరిపి అనుమతులు పొందేందుకు కృషి చేయాలి. నీటిని విడుదల చేయాలని అయకట్టు రైతులు కోరుతున్నారు. నీటి విడుదలచేసే తేదీపై తమకు సమాచారం లేదని, ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 


 


Updated Date - 2022-07-21T05:30:00+05:30 IST