చి‘వరి’కి నీటి దారేది

ABN , First Publish Date - 2020-10-28T17:33:01+05:30 IST

సాగర్‌ కాలువల పరిధిలో సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సాగర్‌, శ్రీశైలం జలాశయాలు నిండినా కూడా ఆయకట్టులోని..

చి‘వరి’కి నీటి దారేది

అస్తవ్యస్తంగా నీటి సరఫరా

ఓబీసీలో వాడిపోతున్న వరి పైరు

మబ్బు లేస్తేనే ఏబీసీ దిగువకు నీరు 

లేదంటే అన్నదాతకు ఎదురుచూపులే

గుంటూరు జిల్లాలో అధిక వినియోగమే కారణం

ఆందోళనలో ఆయకట్టు రైతులు  


దర్శి/అద్దంకి: సాగర్‌ కాలువల పరిధిలో సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సాగర్‌, శ్రీశైలం జలాశయాలు నిండినా కూడా ఆయకట్టులోని  రైతులకు సక్రమంగా నీరు అందని దుస్థితి నెలకొంది. జిల్లాలో సాగర్‌ కాలువల పరిధిలో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఈ సీజన్‌ మొదటి నుంచి నీటి సరఫరాపై అనిశ్చితి కొనసాగుతోంది.  ఎలాగైనా  నీరు వస్తుందన్న నమ్మకంతో రైతులు ఆయకట్టు భూముల్లో వరి సాగు ఆరంభించారు. మధ్యలో వర్షాలు కురవడంతో కొంత అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 70శాతం భూముల్లో వరినాట్లు పడ్డాయి. ఇంకా 30శాతం భూములు సిద్ధంగా ఉన్నాయి. వారంరోజుల నుంచి  కాలువల్లో నీటి పరిమాణం పడిపోవడంతో పలు మేజర్లు, మైనర్లకు అందడం లేదు. దీంతో  వేసిన వరి పైరు వాడిపోతోంది. అధికారుల అస్పష్ట విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏబీసీ చివరికైౖతే వానపడితే నీరు.. లేకుంటే కన్నీళ్లే అన్నట్లు పరిస్థితి తయారైంది. దీంతో రైతులు నానాపాట్లు పడుతున్నారు. 


సాగర్‌ ఆయకట్టులో ఏటికేడు వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. వేసిన రైతులు కూడా చివరిదాకా నీరు అందుతుందా.. అన్న సంశయంతో ఉన్నారు. ఈ ఏడాది కృష్ణానదిలో వరద ఉధృతి భారీగా ఉన్నా ఆయకట్టులో మాగాణి సాగుకు రైతులు సాహసం చేయలేక పోతున్నారు. పట్టుమని నాలుగు రోజులు ఎండకాస్తే దిగువ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు విలవిలలాడే పరిస్థితి నెలకొంది. సాగర్‌ డ్యామ్‌కుడి కాలువ నుంచి 8,569 క్యూ సెక్కుల నీరు బుగ్గ వాగుకు వదులుతున్నారు. అక్కడి నుంచి ప్రధాన కాలువకు 8,050 క్యూసెక్కులు నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని గుంటూరు బ్రాంచ్‌ కాలువకు 1,900 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్‌ కాలువకు 1,622 క్యూసెక్కులు (గుంటూరు జిల్లా భూములకు కలిపి), సాగర్‌ ప్రధాన కాలువ 85/3 మైలు(ప్రకాశం బార్డర్‌)కు 2,179 క్యూసెక్కులు ఇస్తున్నారు. దర్శి బ్రాంచ్‌ కాలువకు 1,224 క్యూసెక్కులు, పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 420, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 444 క్యూసెక్కులు సరఫరా అవుతోంది.


అయితే 1.7లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువ (ఓబీసీ)లో అతితక్కువ నీరు విడుదల చేస్తున్నారు. ఓబీసీకి నిరంతరం 800 క్యూసెక్కులు తగ్గకుండా నీరు పంపిణీ చేస్తేనే అన్ని మేజర్లకు నీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒంగోలు బ్రాంచ్‌ కాలువలో అతి తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. దీంతోయర్రఓబనపల్లి, రాజంపల్లి, లక్కవరం, నిప్పట్లపాడు, సామంతపూడి, కరవది తదితర మేజర్ల కు నీరు సక్రమంగా అందడం లేదు. దీంతో చివరి ఆయకట్టు భూముల్లో సాగుచేసిన లేత వరి పైరు వాడుముఖం పట్టింది. ఇంకా అనేక మంది రైతులు సాగునీరు అందక వరినాట్లు వేసేందుకు భూమిని సిద్ధం చేసి ఖాళీగా ఉంచారు. 


ఏబీసీలో ఏటేటా తగ్గుతోన్న వరి సాగు 

అద్దంకి బ్రాంచి కెనాల్‌ (ఏబీసీ) ఆయకట్టులో మొత్తం 1.70లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే రానురాను నీ రందే ఆయకట్టు 80వేల ఎకరాలకు పడిపోయింది. ఏటా సా గు విస్తీర్ణం ఇంకా తగ్గుతూ వస్తోంది. గతేడాది సుమారు 28 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది పట్టుమని 18వేల ఎకరాలలో కూడా సాగు పూర్తికాలేదు. తరచూ వర్షా లు పడుతున్నా, సాగర్‌ డ్యామ్‌లో నీరు పుష్కలంగా ఉన్నా సరఫరాలో మాత్రం అడ్డంకులు తొలగటం లేదు. ఈ నేపథ్యం లో రైతులు వరి సాగుకు దూరమవుతూ మెట్ట పంటలు వేస్తున్నారు. కొన్ని గ్రామాల రైతులకు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు సాగు చేసే అవకాశం లేక మాగాణే గత్యంతరమైంది. దీంతో ప్రస్తుతం అరకొర నీటి సరఫరాతో అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాలు పడుతుంటే మాత్రం ఏబీసీలో నీటి ప్రవాహం ఉంటుండగా, నాలుగు రోజులు ఎండకాస్తే ఏబీసీ నీటి సరఫరా పూర్తిగా తగ్గిపోతోంది. 


ఎగువన రైతుల అధిక వినియోగం..

ప్రధానంగా ఏబీసీలో ప్రారంభంలో ఉన్న గుంటూరు జిల్లా రైతులు అధిక నీటి వినియోగంతో దిగువ ఆయకట్టులో ఉన్న జిల్లా రైతులు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ఏబీసీలో సంతమాగులూరు సబ్‌ డివిజన్‌లో 9వేలు, అద్దంకి సబ్‌ డివిజన్‌ 6వేలు, కోనంకి సబ్‌ డివిజన్‌ పరిధిలో 3వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ సమయంలో నీటి సరఫరా తీరు రైతులను మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏబీసీలో జిల్లా సరి హద్దు 18వ మైలు వద్ద కనీసం 1,200 క్యూసెక్కుల నీరు వస్తే నే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా అయ్యే పరిస్థితి ఉంది. ఇటీవల మాత్రం సరాసరిన 700 క్యూసెక్కులు మాత్ర మే విడుదల అవుతోంది. మంగళవారం మాత్రం 900 క్యూసె క్కులు విడుదలైంది. ఏబీసీలో తక్కువ నీరు విడుదలైతే పలు మేజర్‌లకు ఎక్కే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెం దుతున్నారు. అధికారులు సాగర్‌ కాలువ సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. సా గునీరు సక్రమంగా అందించకుంటే చివరి ఆయకట్టు భూముల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.


సాగునీరు సక్రమంగా అందించాలి

ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. ప్రస్తుతం మేజర్లకు నీరందక ఇబ్బందులుపడుతున్నాం. నాటిన లేత వరినాట్లు వాడుముఖం పట్టాయి. ఇంకా కొంత భూమిలో వరి నాట్లు వేయాలి. అధికారులు అన్ని మేజర్లకు సక్రమంగా నీరందించకపోతే తీవ్రంగా నష్టపోతాం.

- పేరం వెంకటేశ్వరరెడ్డి, రైతు, ఎర్రఓబనపల్లి 


నిప్పట్లపాడు మేజర్‌కు చుక్క రావడం లేదు

గత 10 రోజులుగా నిప్పట్లపాడు మేజరుకు చుక్క నీరు రావడం లేదు. తూములు ఒట్టిపోయాయి. 10 ఎకరాల భూమి 10 రోజుల క్రితం దమ్ము చేశాం. సాగు నీరు అందకపోవడంతో వరినాట్లు వేయలేక పోయాం. మళ్లీ చేయాల్సి వచ్చి నష్టపోతున్నాం. పాలకులు సక్రమంగా సాగునీరు అందించాలి.

- ఆర్‌.బ్రహ్మయ్య, రైతు, త్రిపురసుందరీపురం


తడి కోసం తంటాలు పడుతున్నాం

మెట్ట పంటలు వేసే అవకాశం లేక వరి సాగు చేశాం. తరచూ నీటి ఎద్డడి ఏర్పడు తోంది. మాగాణికి మరింత ఇబ్బంది గా ఉంది. ఎండలు కాస్తే ఏబీసీలో ప్రవాహం పూర్తిగా తగ్గిపోతోంది. మేజర్‌ కాలువలకు కూడా నీరు ఎక్కడం లేదు. దీంతో  తడి అందిం చేందుకు తంటాలు పడుతున్నాం.   

- దద్దాల మోహనరావు, అంబడిపూడి

Updated Date - 2020-10-28T17:33:01+05:30 IST