ఢిల్లీలో కేసరి సముద్రం లొల్లి

ABN , First Publish Date - 2020-10-11T10:54:14+05:30 IST

చెరువులు, కుంటల పరిధిలోని శిఖం భూముల ఆక్రమణ ఆంశం జాతీయ స్థాయిలో ..

ఢిల్లీలో కేసరి సముద్రం లొల్లి

కబ్జాదారులతో అన్నదాతకు అన్యాయం

వాస్తవాలను తప్పుతోవ పట్టించేందుకు రియల్టర్ల మాయజాలం

శిఖం భూములను బ్లాక్‌ చేసి అమ్మి బడా మోసం

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబునల్‌ ధర్మాసనంలోనూ చర్చనీయాశంగా మారిన ఆంశం


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : చెరువులు, కుంటల పరిధిలోని శిఖం భూముల ఆక్రమణ ఆంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో భూముల ఆక్రమణపై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబునల్‌ బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేసే దాకా వెళ్లడం, ఈ ఆంశంలో ప్రజాసంఘాలు గగ్గోలు పెట్టడం, అధికార, విపక్షాల ప్రతినిధులతో సహా కబ్జాదారులపై చర్యలు తీసుకోవల్సిందేనని పత్రికలకు ఎక్కినా, ఇప్పటి వరకు అతిగతి లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.


రియల్టర్ల మోసాలకు రైతులు బలి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అతిపెద్దదైన కేసరి సముద్రం చెరువును కబ్జా చేసే క్రమంలో రియల్టర్లు వేసిన ఎత్తుగడలకు బఫర్‌ జోన్‌ తర్వాత వివిధ నివాస గృహాల నిర్మాణం, ఏక్‌సాల్‌కా పట్టాతో పాటు పట్టా భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అంతకు ముందు కూడా విలువైన భూములపై కన్నేసిన రియల్‌ మాఫియా ఒక వ్యూహం ప్రకారం కేసరి సముద్రం వైశాల్యాన్ని తగ్గిస్తూ వచ్చింది. దీనికి ఆనుకొని ఉన్న పట్టా భూములను కొనుగోలు చేసి, అడ్డుగా రాతి కట్టడాలను నిర్మించింది. అంతే కాకుండా వేల టాక్టర్ల కొద్ది మట్టిని నింపి భూములను ఆక్రమించడంతో సహాజంగానే పట్టా భూములన్నీ నీట మునిగాయి.


అయితే, చెరువు చుట్టు పక్కల ఉన్న భూములు చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణ గురించి స్పష్టమైన నివేదికలు అందినా కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోని మూలంగా కేసరి సముద్రం జలకళ సతరించుకున్నా, పంటలు పండించుకునే అవకావం లేకుండాపోయింది. దీంతో రైతులు బీసీ కమిషన్‌ను ఆశ్రయించారు. కానీ, రైతుల ఉద్యమాని కూడా రియల్‌ మాఫియా తమ విలాసవంతమైన భవనాలు, ఫాంహౌస్‌లను రక్షించుకునే క్రమంలో పక్కదారి పట్టిస్తున్న ఉదాంతాలు విస్తుగోల్పుతున్నాయి.


కబ్జా పర్వాలన్నీ జిల్లా కేంద్రానికి దుఉ కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందిస్తున్న తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంది. ఇటు బీసీ కమిషన్‌, అటు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబునల్‌లు ఈ ఆంశంపై సీరియస్‌గా దృష్టి సారించడంతో అక్రమార్కులకు అండగా నిలిచిన వారిలో ఆందోళన నెలకొన్నది. ఈ నేపధ్యంలో ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడిచే అనివార్యమైన పరిస్థితిని ఎదుర్కొన నిజాయితీ గల అధికారులు మదన పడుతున్నారు.

Updated Date - 2020-10-11T10:54:14+05:30 IST