వేగం కాదు..భద్రతే ముఖ్యం

ABN , First Publish Date - 2021-01-14T06:30:38+05:30 IST

కొవిడ్‌ టీకాల విషయంలో వేగం కన్నా.. భద్రతే ముఖ్యమని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా..

వేగం కాదు..భద్రతే ముఖ్యం

టీకా కార్యక్రమం నిదానంగా

నిర్వహించాలని సర్కారు నిర్ణయం

కేంద్రాల సంఖ్య దశలవారీగా పెంపు

తొలుత రోజుకు 30 మందికే టీకా

క్రమంగా 50 నుంచి 100కి పెంపు

మొదట్లో ప్రభుత్వ వైద్య సిబ్బందికే

ఆ తర్వాతే ప్రైవేటు ఆస్పత్రులవారికి!

తొలి వారం ప్రైవేటులో కేంద్రాల రద్దు

జిల్లాలకు 55 వేల డోసుల తరలింపు

ప్రతి టీకాకూ లెక్క.. 

ఖాళీ వయల్స్‌ ఇవ్వాల్సిందే

దుష్ప్రభావాలు కలిగితే 

చికిత్సకు 57 ప్రభుత్వ ఆస్పత్రులు


హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకాల విషయంలో వేగం కన్నా.. భద్రతే ముఖ్యమని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా.. కొన్ని మార్పులు చేసి నిదానంగా నిర్వహించాలని నిర్ణయానికి  వచ్చింది. అందుకు అనుగుణంగా కార్యచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా తొలుత  ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి మాత్రమే కరోనా టీకాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే.. తొలి రోజు వ్యాక్సినేషన్‌కు ఎంపిక చేసిన 139 కేంద్రాల్లోని 40 ప్రైవేటు కేంద్రాలను వైద్య ఆరోగ్యశాఖ రద్దు చేసింది.


ఆ నలభైచోట్లా  ప్రభుత్వ కేంద్రాల్లోనే ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు టీకా కేంద్రాల జాబితాను రూపొందించి విడుదల చేసింది. దశలవారీగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ప్రారంభించిన కేంద్రాల్లో తొలుత నిర్ణయించినట్టుగా రోజుకు 100 మందికి కాకుండా.. 30 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వడం ప్రారంభించి, క్రమేపీ ఆ సంఖ్యను పెంచుకుంటూ పోవాలని భావిస్తోంది. ఉదాహరణకు జనవరి 16న 30 మందికి.. 18న 50 మందికి.. ఇలా ఇస్తారు. దుష్ప్రభావాలు లేకుంటే ఆ సంఖ్యను 75కు, ఆ తర్వాత వందకు పెంచుకుంటూ వెళ్లేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. తొలి మూడు-నాలుగు రోజులపాటు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బందికి మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత టీకాల సంఖ్యను పెంచడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి కూడా ఇవ్వడం ప్రారంభిస్తారు.


లెక్క పక్కా..

కేంద్రం నుంచి వచ్చిన టీకాలను బుధవారం సాయంత్రం నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో, పోలీసు భద్రత నడుమ పంపుతున్నారు. బుధవారం 27 జిల్లాలకు 55,270 డోసులను పంపారు. మిగతా ఆరు జిల్లాలకు గురువారం వ్యాక్సిన్లను పంపనున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌కు 18,070 డోసులు కేటాయించగా.. అత్యంత తక్కువగా నాగర్‌కర్నూలుకు 230 డోసులే పంపుతున్నారు. ఒక్కో వయల్‌లో 10 డోసుల టీకా ఉంటుంది. అంటే అక్కడికి పంపుతున్న వయల్స్‌ సంఖ్య కేవలం 23. ఈ టీకాలన్ని జనవరి 16 ఉదయం.. ఉమ్మడి జిల్లా కేంద్రాల నుంచి కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌కు చేరుకోనున్నాయి. అక్కడి నుంచి వైద్య సిబ్బంది ఆ వ్యాక్సిన్లను టీకా కేంద్రాలకు తీసుకెళ్లి.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు లబ్ధిదారులకు టీకాలు వేస్తారు. తీసుకెళ్లిన టీకాల లెక్కను అదే రోజూ సాయంత్రం విధిగా అప్‌లోడ్‌ చేయాలి. ఖాళీ వయల్స్‌ను కూడా పారేయకుండా తిరిగి కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌కు తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వాటి లెక్క కూడా తప్పనిసరిగా చెప్పాలి. కాగా.. కోల్డ్‌ చైన్‌ పాయింట్ల వద్ద టీకాల రక్షణ కోసం సీసీ కెమెరాలు, 24గంటల పోలీసు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో వీటి పర్యవేక్షణ కోసం అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) జితేంద్రను నియమించారు. టీకాలను తరలించే వాహానాలకు జీపీఎ్‌సను కూడా అమర్చారు.


కేంద్ర ప్రభుత్వ వైద్య సిబ్బందికీ

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిజేసే వైద్య సిబ్బందికి కూడా వైద్య ఆరోగ్యశాఖనే టీకాలివ్వనుంది. రాష్ట్రంలో.. రైల్వే, ఈఎ్‌సఐ, ఆర్మీ ఆస్పత్రులకు సంబంధించి మొత్తం 15 వేల మంది కేంద్ర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉన్నట్లు తేలింది. కాగా.. వ్యాక్సిన్‌ కేంద్రాలన్నింటిలోనూ తప్పనిసరిగా ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. టీకా తీసుకున్నవారికి ఏవైనా దుష్ప్రభావాలు వస్తే వెంటనే చికిత్స అందించడం కోసం ఈ ఏర్పాటు. బాధితులను మూ డు రకాలుగా విభజించి చికిత్స అందించనున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 57 ఆస్పత్రులను సిద్ధం చేశారు. వాటిలో ఒక్కో ఆస్పత్రిలో 10 ఐసీయూ పడకలుంటాయి. 


ప్రత్యేక  కాల్‌ సెంటర్‌

కరోనా వ్యాక్సినేషన్‌లో పాల్గొనే వైద్యులకు, వైద్యసిబ్బందికి వచ్చే అనుమానాలు తీర్చేందుకు ఓ కాల్‌ సెంటర్‌ పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయ ప్రాంగణ భవన సముదాయంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆరుగురు వైద్యులు ఈ కేంద్రంలో పనిచేయనున్నారు. ఈ కాల్‌సెంటర్‌ కోసం ప్రత్యేకంగా ఆరు ఫోన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. అలాగే.. వ్యాక్సిన్‌పై అనుమానాల నివృత్తి కోసం లేదా వ్యాక్సిన్‌ వేసుకున్నాక ఏదైనా జరిగితే 108, 104 నంబర్లలో సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.


అంగీకార పత్రం ఇస్తేనే కొవాగ్జిన్‌

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన 20 వేల కొవాగ్జిన్‌ డోసులు బుధవారం తెల్లవారు జామున  కోఠిలోని వ్యాధి నిరోధక టీకాల సముదాయానికి చేరుకున్నాయి. మంగళవారం చేరుకున్న 3.64 లక్షల కొవిషీల్డ్‌ డోసులతో కలిపితే.. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 3.84 లక్షల డోసుల టీకా ఉన్నట్టు. కాగా.. కొవాగ్జిన్‌ టీకా తీసుకునేవారు తప్పనిసరిగా అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుందని, అలా ఇస్తేనే ఆ వ్యాక్సిన్‌ వేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కొవాగ్జిన్‌ టీకాకు అంగీకార పత్రాన్ని తప్పనిసరి చేశామని వెల్లడించాయి.


అంగీకార పత్రం ఇస్తేనే కొవాగ్జిన్‌ టీకా

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన 20 వేల కొవాగ్జిన్‌ డోసులు బుధవారం తెల్లవారు జామున  కోఠిలోని వ్యాధి నిరోధక టీకాల సముదాయానికి చేరుకున్నాయి. మంగళవారం చేరుకున్న 3.64 లక్షల కొవిషీల్డ్‌ డోసులతో కలిపితే.. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 3.84 లక్షల డోసుల టీకాలు ఉన్నట్టు. కాగా.. కొవాగ్జిన్‌ టీకా తీసుకునేవారు తప్పనిసరిగా అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుందని, అలా ఇస్తేనే ఆ వ్యాక్సిన్‌ వేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కొవాగ్జిన్‌ టీకాకు అంగీకార పత్రాన్ని తప్పనిసరి చేశామని వెల్లడించాయి.

Updated Date - 2021-01-14T06:30:38+05:30 IST