ఈ నూనెలతో చర్మం సేఫ్‌

ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST

ఎసెన్స్‌ అంటే సారం. మొక్కల్లోని ఉపయోగకర మూలకాల సారాన్ని నూనె రూపంలో తయారు చేస్తారు.

ఈ నూనెలతో  చర్మం సేఫ్‌

వేసవిలో చర్మం జిడ్డుగా మారుతుంది. ఎండ వేడికి కమిలి, రంగు మారుతుంది. సున్నిత చర్మం కలిగిన వాళ్లలో దురదలూ, దద్దుర్లూ కూడా మొదలవుతాయి. వేసవిలో ఇలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే చర్మ రక్షణకు తోడ్పడే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలి. 


సెన్స్‌ అంటే సారం. మొక్కల్లోని ఉపయోగకర మూలకాల సారాన్ని నూనె రూపంలో తయారు చేస్తారు. అవే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌. మొక్క గుణాలు, ప్రభావాలనే సారం అంటారు. వీటిని ఆవిరి ద్వారా సంగ్రహించి, లేదా సాంకేతిక పద్ధతులైన కోల్డ్‌ ప్రెస్సింగ్‌ ద్వారా సేకరించి తయారు చేయవచ్చు. అయితే ఆవిరి ద్వారా సంగ్రహించిన వాటి ప్రభావం ఎక్కువ. మొక్కల నుంచి, సువాసనభరిత రసాయనాలను సేకరించిన తర్వాత దాన్ని వాడుకకు వీలుగా వాహక నూనెతో కలుపుతారు.

అంతిమంగా పొందే ఈ ఉత్పత్తే ఎసెన్షియల్‌ ఆయిల్‌ రూపంలో మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుంది. ఆరోమాథెరపీలో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఉపయోగించే విధానం వేర్వేరుగా ఉంటుంది. పీల్చుకోవడం లేదా శరీరం మీద మర్దన కోసం...ఇలా రెండు పద్ధతుల్లో వీటిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇవి తాగడానికి పనికిరావు. చర్మం మీద పూసినప్పుడు కొన్ని రసాయనాలు చర్మం లోపలికి ఇంకుతాయి. అయితే మరింత మెరుగ్గా చర్మంలోకి ఇంకడం కోసం నూనెలను వేడి చేసి వాడుతూ ఉంటారు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అందించే ఫలితాలను బట్టి వేర్వేరు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలి. చర్మం మీద ముడతలు, మచ్చలు, మృత కణాలు, సన్‌ ట్యాన్‌... ఇలా సమస్యను బట్టి ఎంచుకోవడానికి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ లెక్కలేనన్ని అందుబాటులో ఉంటున్నాయి. 


నిమ్మ నూనె (లెమన్‌ ఆయిల్‌): నిమ్మనూనె వ్యాధికారక క్రిములను తరిమికొట్టగలదు. కాబట్టే ఇల్లు శుభ్రపరిచే సాధనాలు, సబ్బుల తయారీలో ఈ నూనెను విరివిగా వాడుతూ ఉంటారు. నిమ్మనూనెలో ‘డి-లిమోనిని’ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మం మీద ముడతలు తొలగించి, రక్తప్రసరణను మెరుగుపరిచి, చర్మాన్ని తేటగా మారుస్తుంది. కాబట్టి చర్మసంబంధ సౌందర్య సాధానాల్లో నిమ్మ నూనె వాడకం ఎక్కువ. తాజా పరిశోధనల్లో నిమ్మనూనెలో ఉండే డి-లిమోనిని అనే రసాయనం పాడయిన చర్మాన్ని బాగుచేయడంతోపాటు, పలురకాల చర్మ వ్యాధుల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుందని తేలింది. నిమ్మవాసన మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ నూనెతో చమట దుర్వాసన తేలికగా తొలగిపోతుంది కాబట్టి ఎక్కువగా చమట పట్టే తత్వం ఉన్నవాళ్లు కొన్ని చుక్కల నిమ్మ నూనెను స్నానం చేసే నీళ్లలో కలుపుకోవాలి.


లావెండర్‌: ఈ నూనె ఎంతో సున్నితమైనది. చర్మం మీద మచ్చలను తొలగించి చర్మం వెలిగిపోయేలా చేస్తుంది. చర్మం మీద మంటలు, సూర్యరశ్మి ప్రభావంతో చర్మం కమిలిపోవడం లాంటి సమస్యలకూ ఈ నూనె విరుగుడుగా పని చేస్తుంది. కొన్ని చుక్కల లావెండర్‌ నూనెను క్యారియర్‌ ఆయిల్‌కు జోడించి చర్మానికి పూసుకోవాలి.


క్లేరీ సేజ్‌: వంకాయ రంగు పువ్వులుండే ఒక రకం తులసి మొక్క ఇది. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే గుణం దీనికి ఉంది. పలు రకాల ఇతర వ్యాధికారక క్రిములతో కూడా పోరాడగలదు. చర్మపు సమస్యలను తొలగించి, చర్మపు పైపొరలకు రక్తప్రసరణను పెంచే సామర్ధ్యం దీనికి ఉంటుంది. క్యారియర్‌ ఆయిల్‌తో కలిపి సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. 


టీ ట్రీ ఆయిల్‌: ఈ నూనె బెంజాల్‌ పెరాక్సైడ్‌ను పోలిన గుణాలను కలిగి ఉంటుంది కాబట్టి మొటిమల చికిత్సలోనూ వాడతారు. మొటిమల చికిత్సకు ఎక్కువ సమయం తీసుకున్నా, సాధారణ మందులతో పోలిస్తే, ఈ నూనె చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. ఒక పెద్ద చెంచా క్యారియర్‌ నూనెలో ఐదు గ్రాముల టీట్రీ ఆయిల్‌ను కలిపి వాడుకోవాలి. 


రోజ్‌మేరీ ఆయిల్‌: చర్మ సౌందర్య ఉత్పత్తులో ఈ నూనెను విరివిగా వాడతారు. ఈ నూనె వాడి తయారు చేసిన ఉత్పత్తులు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. ఒక టీ స్పూన్‌ రోజ్‌మేరీ ఆయిల్‌ను ఒక టేబుల్‌ స్పూను క్యారియర్‌ ఆయిల్‌తో కలిపి వాడుకోవాలి.

Read more