అంపైర్‌ తప్పిదం వల్లే సచిన్‌ ‘డబుల్‌’

ABN , First Publish Date - 2020-05-18T09:23:10+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. వన్డే చరిత్రలో తొలి డబుల్‌ సెంచరీని కూడా తన పేరిటే ...

అంపైర్‌ తప్పిదం వల్లే సచిన్‌ ‘డబుల్‌’

స్టెయిన్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. వన్డే చరిత్రలో తొలి డబుల్‌ సెంచరీని కూడా తన పేరిటే లిఖించుకున్నాడు. 2010లో దక్షిణాఫ్రికాతో గ్వాలియర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు సరిగ్గా 200 పరుగుల (147 బంతుల్లో)తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇదంతా అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ పుణ్యమేనంటున్నాడు సఫారీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌. సచిన్‌ 190+ పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఎల్బీ చేశానని, అయితే అవుటిచ్చేందుకు అంపైర్‌ భయపడ్డాడని ఆరోపించాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌తో లైవ్‌చాట్‌ సందర్భంగా స్టెయిన్‌ ఈ విషయాన్ని తెలిపాడు. ‘వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీని సచిన్‌ మా జట్టుపైనే సాధించాడు. నాకు బాగా గుర్తు.. అతడు 190 పరుగులు దాటినప్పుడు ఎల్బీ చేసినా అవుటివ్వలేదు. నేను అంపైర్‌ వైపు ఆశ్చర్యంగా చూశా. కానీ అతడు ప్రేక్షకులను చూసి భయపడినట్టున్నాడు. ఒకవేళ  అవుటిస్తే స్టేడియం నుంచి హోటల్‌కు కూడా వెళ్లనీయరేమో అన్నట్టు  అంపైర్‌ దీనంగా కనిపించాడు’ అని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.


అంతా కట్టుకథ..

అప్పటి మ్యాచ్‌ను పరిశీలిస్తే.. స్టెయిన్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలుతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో అతడి ఓవర్లలో సచిన్‌ 31 బంతులు ఆడాడు. దీంట్లో ఒక్కసారి కూడా ఎల్బీ అప్పీల్‌ రాలేదు. ఇక సచిన్‌ 190 రన్స్‌ దాటాక స్టెయున్‌ వేసింది రెండు ఓవర్లే (47, 49). దీంట్లో సచిన్‌ ఎదుర్కొంది 47 ఓవర్‌లో మూడు బంతులే. దాంట్లోనూ రెండు సింగిల్స్‌ తీయగా మరో బంతిని డిఫెన్స్‌ ఆడితే నేరుగా స్టెయిన్‌ దగ్గరికే వెళ్లింది. ఇక.. అతడు ఎప్పుడు అప్పీల్‌ చేశాడో, అంపైర్‌ ఎందుకు భయపడ్డాడో స్టెయిన్‌కే తెలియాలి. 

Updated Date - 2020-05-18T09:23:10+05:30 IST