పత్తి రైతుల పరేషాన్‌!

ABN , First Publish Date - 2022-09-28T05:07:24+05:30 IST

పత్తి రైతుల పరేషాన్‌!

పత్తి రైతుల పరేషాన్‌!
గొట్టిగఖుర్దులో తగినంత ఎత్తు పెరగని పత్తిచేను

  • భారీ వర్షాలతో మొక్కల ఎదుగుదలపై ప్రభావం
  • మూడు నెలలు గడుస్తున్నా ఫీటున్నర ఎత్తే
  • దిగుబడిపై ఆందోళనలో రైతులు

ఈ సారి కురిసిన భారీ వర్షాలతో పత్తి చేలు ఏపుగా ఎదగలేదు. దీంతో దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదట్లో విత్తనం విత్తిన నాటి నుంచి తరచూ భారీ వర్షాలు కురిసి మొక్కలు నీరుపట్టాయి. ఎరువులు వేసేందుకు, కలుపు తీసేందుకు సైతం వీలు పడక పోషకాలందక పత్తి మొక్కలు ఫీటున్నర కంటే ఎక్కువ ఎత్తు పెరగలేదు. దీంతో ఎకరానికి రెండు క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చేలా లేదని, తమకు నష్టాలు తప్పవని రైతులు దిగులుపడుతున్నారు.


బషీరాబాద్‌, సెప్టెంబరు 27: ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. విత్తనాలు నాటిన నాటి నుంచి రోజూ వర్షాలు కురవడంతో నీరు నిలిచి మొక్క ఎదుగలపై ప్రభావం చూపింది. మొక్క పెరిగి మండల ఎక్కువ సంఖ్యలో విచ్చుకుంటేనే కాయలు ఎక్కువ సంఖ్యలో కాసి దిగుబడి పెరుగుతుంది. వర్షాలకు మొక్కలు నీరుపట్టి ఎక్కువ పొడడు పెరగలేదు. దీంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనం నాటి మూడు నెలలు గడుస్తున్నా మొక్క ఫీటున్నర(18ఇంచ్‌ల) ఎత్తు కూడా పెరగలేదు. ఆశించిన స్థాయిలో పూత, కాయలు కాసే ఆవకాశం లేదని రైతులంటున్నారు.


  • 8,396 ఎకరాల్లో పత్తిసాగు

మండలంలోని 30 గ్రామాల్లో 8,396 ఎకరాల్లో పత్తిసాగుచేశారు. వానకాలం ప్రారంభంలో పత్తి మొలకెత్తి నాటి నుంచే నిత్యం వర్షాలు కురువడంతో మొక్క ఎదుగుదల తగ్గిపోయింది. యాజమాన్య పనులపై ఆటంకం కలిగి చేలల్లో కలుపు మొక్కలు పరుచుకున్నాయి. పత్తి రైతులు ఎకరాకు 10వేల నుండి 15వేల వరకు పెట్టుబడిపెట్టారు. ప్రస్తుతం చేనును బట్టి చూ స్తే ఎకరాకు క్వింటాలైనా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. పంటలపై సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.


  • పత్తి మొక్క ఫీటున్నర ఎత్తైనా పెరగలే.. : కోటపు మాణిక్‌రెడ్డి, రైతు, జీవన్గి

పత్తి విత్తి మూడు నెలలు అయిపోయింది. సాధారణంగా మొక్క ఇప్పటి వరకు నాలుగైదు ఫీట్లు పెరగాలి. వరుసగా కురిసిన వర్షాలతో పత్తి పంటలో కలుపు మొక్కలు పేరుకొని ఎదగలేదు. ఎరు వు వేసినా కలుపు మొక్కలకే పోయింది. ఈ ఏడాది పత్తి వేసిన వారికి నష్టాలు తప్పేలా లేవు. అప్పులెలా తీర్చాలో భయం అవుతోంది.

Updated Date - 2022-09-28T05:07:24+05:30 IST