పాపం చిట్టితల్లులు

ABN , First Publish Date - 2021-06-22T05:32:03+05:30 IST

ఆట తప్ప మరో వ్యాపకం తెలియని చిన్నారులు వారు. వరుసకు అక్కాచెల్లెలు కావడంతో మరింత సన్నిహితంగా ఉండేవారు. ఇంటికి సమీపంలో ఆడుకుంటూ నది పక్కకు వెళ్లారు. అక్కడున్న రాయిపై కూర్చొని కొంచెం పక్కకు జరిగిన క్రమంలో నది గుమ్మిలో పడిపోయారు. లోతుగా ఉండడంతో క్షణంలో మునిగిపోయారు.

పాపం చిట్టితల్లులు
హారిక, భవిష్య(ఫైల్‌ ఫొటోలు)

చంపావతి నదిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి 

ఎం.వెంకటాపురం వద్ద ఘటన

గజపతినరగం, జూన్‌ 21: ఆట తప్ప మరో వ్యాపకం తెలియని చిన్నారులు వారు. వరుసకు అక్కాచెల్లెలు కావడంతో మరింత సన్నిహితంగా ఉండేవారు. ఇంటికి సమీపంలో ఆడుకుంటూ నది పక్కకు వెళ్లారు. అక్కడున్న రాయిపై కూర్చొని కొంచెం పక్కకు జరిగిన క్రమంలో నది గుమ్మిలో పడిపోయారు. లోతుగా ఉండడంతో క్షణంలో మునిగిపోయారు. ఈ ఘటనను దూరంనుంచి గమనించిన స్థానికులు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎం.వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న చంపావతినదిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజ్‌, బాధిత కుటుంబ సభ్యులు  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బి భవిష్య(4), బోర హారిక (11) వరసకు అక్కాచెల్లెలు. బోర హారిక తల్లిదండ్రులు పైడిరాజు, రాముతో కలిసి తణుకులో నివాసం ఉంటున్నారు. రెండు వారాల కిందట పైడిరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రాము తన పిల్లలు హారిక, యామిని, మనోజ్‌లతో కలిసి రెండు రోజుల కిందట వెంకటాపుంలోని తన చెల్లెలు మంగ ఇంటికి వచ్చారు. మంచి రోజున ఇంట్లో అడుగుపెట్టే ఉద్దేశంతో వెంకటాపురం వచ్చారు. కాగా సబ్బి మంగ, శివకు ఇద్దరు కుమార్తెలు భవిష్య, గీత ఉన్నారు. పిల్లలంతా సోమవారం ఉదయం నుంచి ఆటలో నిమగ్నంకాగా భవిష్య, హారిక ఆడుకుంటూనే నది పక్కకు వెళ్లారు. చంపావతి నదిలో పనుకురాయి మీద కూర్చొని ఉన్న క్రమంలో పొరపాటున నీటిలోకి జారి పడిపోయారు. వారి అరుపులను దూరం నుంచి గమనించిన కొందరు రక్షించేందుకు పరుగున చేరుకున్నారు. ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి హుటాహుటిన ప్రభుత్వ  ఆసుపత్రికి  తరలించారు. వైద్యులు  కిషోర్‌కుమార్‌ పరీక్షించి అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. ఎస్‌ఐ గంగరాజ్‌ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇసుక తవ్వకాలతోనే ప్రమాదం

చంపావతి నదిలో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగానే ఈప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. గ్రామానికి దగ్గరగా ఉన్న చంపావతి నదిలో రాత్రి, పగలు ఇసుకను తోడేస్తున్నారని, ఆ క్రమంలో నదిలో భారీగా గోతులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-06-22T05:32:03+05:30 IST