కలిసిరాని కరివేపాకు

ABN , First Publish Date - 2022-06-17T05:50:48+05:30 IST

కరివేపాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మూడు నెలల కాలంలో ధర గణనీయంగా పడిపోయింది.

కలిసిరాని కరివేపాకు
మార్కెట్‌కు తరలించేందుకు..

పాపం.. అన్నదాత

ముంబైకి తరలిస్తే.. కిలో రూ.2..

వ్యాపారులకు వదిలేసిన రైతులు

ఉచితంగా కోసుకువెళుతున్న దళారులు

వ్యాపారుల నుంచి రైతులకు రావాల్సింది రూ.20 కోట్లు


తాడిపత్రి: కరివేపాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మూడు నెలల కాలంలో ధర గణనీయంగా పడిపోయింది. మార్చి వరకూ కిలో రూ.30 నుంచి రూ.50 వరకు ధర ఉండేది. ఇప్పుడు నాణ్యమైన కరివేపాకు కిలో రూ.2కుపడిపోయింది. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు.  పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ధర తగ్గడంతో పంటను పశువులకు వదిలిపెడుతున్నారు. పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తే.. మరింత నష్టం వస్తుందని, దీనిబదులుగా వదిలేయడమే మేలని అంటున్నారు. కొందరు రైతులు వ్యాపారులకు ఉచితంగా కోసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. మార్కెట్‌ సంబంధాల కారణంగా నష్టమైనా, కొందరు దళారులు కరివేపాకును తరలిస్తున్నారు. 


రెండు మండలాల్లో..

తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో దాదాపు 1700 ఎకరాల్లో కరివేపాకు సాగవుతోంది. ఒకప్పుడు విజయవాడ ప్రాంతంలోని వడ్లపూడి తర్వాత కేవలం తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో మాత్రమే కరివేపాకు సాగయ్యేది. ఒడిషా నుంచి కరివేపాకు విత్తనాలు  వడ్లపూడి, మంగళగిరి ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. అక్కడి నుంచి రైతులు తాడిపత్రికి తెచ్చి అమ్మేవారు. ఎర్రగుంటపల్లి కరివేపాకు సాగుకు అన్నివిధాల అనుకూలంగా ఉండేది. నాణ్యమైన కరివేపాకు పండేది. ఇక్కడి రైతులు పెద్దపప్పూరు, పుట్లూరు, గుంతకల్లు ప్రాంతాలకు పంటను విస్తరించారు. పెద్దపప్పూరు మండలంలో కూడా పెద్దఎత్తున కరివేపాకు సాగవుతోంది. తాడిపత్రి ప్రాంతానికి చెందిన రైతులు గుంతకల్లులోని పొలాలను గుత్తకు తీసుకొని కరివేపాకును సాగుచేయడమే కాకుండా అక్కడివారికి ఈ పంటను పరిచయం చేశారు.


వ్యాపారుల చేతుల్లో రూ.20 కోట్లు..

వివిధ మార్కెట్లలో దాదాపు రూ.20 కోట్ల వరకు రైతుల సొమ్ము ఉంటోంది. ధర, డిమాండ్‌ భారీగా ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు అధికమొత్తంలో కరివేపాకును కొనుగోలు చేస్తారు. కమీషన ఎక్కువ వస్తుందన్న ఆశతో పెద్దమొత్తంలో తరలిస్తుంటారు. క్యాష్‌ అండ్‌ క్యారీ పద్ధతిలో కొందరు, నెల రోజుల తరువాత చెల్లించేలా మరికొందరు రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. క్యాష్‌ అండ్‌ క్యారీ అయితే ధర తక్కువ. అందకే రైతులు అప్పుగా ఇచ్చేందుకే ఆసక్తి చూపుతారు. ఇదే ప్రస్తుతం రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. దళారులకు అమ్మినప్పుడు ఉన్న ధర.. రైతులకు డబ్బు చెల్లించేనాటికి గణనీయంగా పడిపోయింది. దీంతో వ్యాపారులు బకాయిలలో 10 శాతం మాత్రమే ఇస్తున్నారు. అందులో దళారుల కమీషన పోనూ.. రైతులకు మిగిలేది అరకొరే. ఒక్కొక్క రైతుకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రావాల్సి ఉంది. చెన్నై మార్కెట్‌లో రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు, బెంగళూరు మార్కెట్‌లో రూ.6 కోట్లు, ముంబై మార్కెట్‌ రూ.4 కోట్లు, మిగిలిన మార్కెట్లలో రూ.కోటి దాకా రైతులకు రావాల్సి ఉంది. రైతుల ఒత్తిడిని తట్టుకోలేక పలువురు దళారులు ముఖం చాటేశారు. మరికొందరు తామేం చేయగలమని రైతులకు ఎదురు తిరుగుతున్నారు. 


అక్కడికే ఎక్కువ..

తాడిపత్రి ప్రాంతంలో పండించే కరివేపాకు చెన్నై, బెంగళూరు, ముంబైకు అధికంగా వెళుతుంది. నాణ్యతే దీనికి కారణం. సీజనలో తాడిపత్రి, సమీప మండలాల నుంచి రోజూ 100 టన్నుల వరకు రవాణా చేస్తుంటారు. ఇందులో 40 నుంచి 50 టన్నులు చెన్నైకు, 15 టన్నులు బెంగళూరు, 10 టన్నుల వరకు ముంబైకు తరలిస్తారు. మిగిలిన దిగుబడిని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తారు. ప్రస్తుతం ధర పూర్తిగా తగ్గడంతో కేవలం ముంబైకు మాత్రమే కిలో రూ.2 ప్రకారం దళారులు కొనుగోలు చేసి తరలిస్తున్నారు. మిగిలిన మార్కెట్లకు ఉచితంగా కోసుకువెళుతున్నారు. 


పెరుగుతున్న దళారులు

కరివేపాకు పంటకు దళారుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇటీవల కొత్తగా అనేకమంది దళారుల అవతారమెత్తారు. మాటలే పెట్టుబడి. కమీషన ఎక్కువ. ఏదైనా జరిగితే రైతులు నష్టపోతారు తప్ప.. వీరికి ఏమీ కాదు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో పంటను సాగుచేసే గ్రామాలకే పరిమితమైన దళారులు, నేడు ఇతర గ్రామాల నుంచి బంధువులు, స్నేహితుల పేరిట వస్తున్నారు. అందినంత కమీషన దండుకోవడం, అవసరమైతే రైతులను ముంచి డబ్బులతో పరారీకావడం, జల్సాలకు ఖర్చుచేయడం చివరికి పంచాయితీలు పెట్టి రైతులను మోసగించడం పరిపాటిగా మారింది. 


బకాయిలపై పంచాయితీలు

రైతుల బకాయిలపై దళారులు పంచాయితీలు పెడుతున్నారు. రూ.లక్షలు చెల్లించాల్సి ఉండగా, రూ.వేలతో సరిపెట్టేందుకు పెద్దమనుషుల వద్ద పంచాయితీలు పెడుతున్నారు. మాట వినకుంటే రాజకీయ నాయకులు, పోలీసులతో చెప్పిస్తున్నారు. దీంతో రైతులు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఉంటోంది. రైతుల బకాయి సొమ్మును దళారులు తిన్నారా? వ్యాపారులు ఎగవేశారా..? తెలియని పరిస్థితి.


ఆశలకు గండి..

కరివేపాకు ధర గణనీయంగా పడిపోయింది. మూడు నెలల క్రితం కిలో రూ.30 నుంచి రూ.50 వరకు ఉండేది. ఇప్పుడు రూ.2 అంటున్నారు. అదికూడా.. నాణ్యమైన కరివేపాకు అయితేనే ఇస్తున్నారు. మిగిలిన కరివేపాకును ఉచితంగా వ్యాపారులకు వదిలివేశా. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.

- జగన్నాథ్‌ రెడ్డి, రైతు, యర్రగుంటపల్లి


Updated Date - 2022-06-17T05:50:48+05:30 IST