Prophet Muhammad Row : నూపుర్ శర్మకు సాధ్వి ప్రజ్ఞ మద్దతు

ABN , First Publish Date - 2022-06-10T20:52:01+05:30 IST

ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన బీజేపీ మాజీ

Prophet Muhammad Row : నూపుర్ శర్మకు సాధ్వి ప్రజ్ఞ మద్దతు

న్యూఢిల్లీ : ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు ఆ పార్టీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ మద్దతుగా నిలిచారు. సాధ్వి శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘సత్యం పలకడం తిరుగుబాటు అయితే, నేను కూడా రెబెల్‌నే’ అన్నారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి జయం కలగాలని ఆకాంక్షించారు. 


సాధ్వి ప్రజ్ఞ మీడియాతో మాట్లాడుతూ, ఎప్పుడు సత్యం చెప్పినా మైనారిటీలు ఆగ్రహోదగ్రులు అవుతారన్నారు. అదే సమయంలో హిందువులు మాత్రం తమ మతంపై దాడులు జరుగుతున్నా సంయమనం పాటించాలని అంటారన్నారు. ఈ అవిశ్వాసులు ఎప్పుడూ అలాగే చేస్తున్నారన్నారు. వారికి కమ్యూనిస్టు చరిత్ర ఉందన్నారు. ఓ విషయం చెప్పినందుకు కమలేశ్ తివారీని హత్య చేశారన్నారు. ఇప్పుడు మరొకరు (నూపుర్ శర్మ) ఓ విషయం చెప్పారని, ఆమెను బెదిరిస్తున్నారని చెప్పారు. భారత దేశం హిందువలకు చెందినదని, సనాతన ధర్మం ఇక్కడ శాశ్వతంగా నిలుస్తుందని తెలిపారు. అది తమ బాధ్యత అని, ఆ విధంగా చేస్తామని తెలిపారు. 


ఏది ఏమైనప్పటికీ తాను నిజం చెప్పానని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపిలో కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందన్నారు. శివలింగాన్ని ఫౌంటెన్ అనడం హిందూ మూల విశ్వాసాలపైనా, సనాతన ధర్మంపైనా, హిందూ దేవీదేవతలపైనా దాడి చేయడమేనని స్పష్టం చేశారు. 


ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నూపుర్ శర్మ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలపై దేశ, విదేశాల నుంచి నిరసన వ్యక్తమైంది. కొన్ని ముస్లిం దేశాలు భారత దేశం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలతో భారత దేశ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Updated Date - 2022-06-10T20:52:01+05:30 IST