సాధుసంగమం.. సకలార్థ సాధనం

ABN , First Publish Date - 2020-09-18T09:58:25+05:30 IST

మంచివారితో స్నేహం.. నిజాలే మాట్లాడేలా చేస్తుంది. బుద్ధిని వికసింపజేసి జ్ఞానభూషితుని చేస్తుంది. గౌరవాన్ని పెంచుతుంది. కల్మషాలను పోగొట్టి మనసును నిర్మలం చేస్తుంది. చిత్తాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇలా ఒక్కటేమిటి.. సత్సాంగత్యం

సాధుసంగమం.. సకలార్థ సాధనం

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు 

గౌరవమొసంగు జనులకు కలుషమడచు

కీర్తి ప్రకటించు చిత్తవిస్ఫూర్తి చేయు

సాధుసంగంబు సకలార్థ సాధనంబుు


మంచివారితో స్నేహం.. నిజాలే మాట్లాడేలా చేస్తుంది. బుద్ధిని వికసింపజేసి జ్ఞానభూషితుని చేస్తుంది. గౌరవాన్ని పెంచుతుంది. కల్మషాలను పోగొట్టి మనసును నిర్మలం చేస్తుంది. చిత్తాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇలా ఒక్కటేమిటి.. సత్సాంగత్యం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని దీని భావం. లోకంలో సత్యమే సర్వేశ్వరునితో సమానమని, సర్వం సత్యంపైనే ఆధారపడి ఉందని, అన్ని ప్రయోజనాలకూ అదే మూలమని వేదవేదాంగాలు, పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అంత గొప్ప ఫలితం.. సాధుశీలుర చేరికతో సమకూర్చుకోవచ్చు. ఎన్ని కష్టాలను అనుభవించినా సత్యాన్ని వదలకుండా సత్ఫలితాన్ని సాధించిన హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడుగా కొనియాడబడుతున్నాడు. సత్య సంధతతో ధేనువు పులిరాజు కోరల బారి నుండి బయటపడింది. బలిచక్రవర్తి ఆడినమాట తప్పకుండా వామనుడికి మూడడుగులు దానమిచ్చాడు. దీంతో అతని సత్యదీక్ష అవనిలో ఆదర్శంగా  నిలిచిపోయిందది. అలాంటి మంచి ప్రయోజనం, సాధుసజ్జనుల సాగత్యంవల్ల లభిస్తుంది. 

ధీ అంటే మేధాసంపత్తి. మేధస్సును రూపుమాపే మందబుద్ధిని సాధువర్తనుల పొందు సమయిస్తుంది. మానవుడు చేసే మహాత్తర కార్యాలన్నిటికీ ఆధారం ధీశక్తి. అందుకు ధర్మరాజు తగిన తార్కాణం. యక్ష ప్రశ్నలకు తన ధీ శక్తితో  అలవోకగా సమాధానాలిచ్చి తన తమ్ముళ్లను బ్రతికించుకోగలిగాడు. అటువంటి ధీశక్తి మంచివారి స్నేహంతో మనకూ అలవడుతుంది. ఇక, గౌరవం.. కొనితెచ్చుకొనే వస్తువు కాదు. శాస్త్రసమ్మతంగా సత్యధర్మాలకు అనుగుణంగా మనం చేసే పనులే మనకు గౌరవాన్నిస్తాయి. చెడ్డవారితో కూడితే అగౌరవమే కలుగుతుంది. మంచివారితో ఉన్నప్పుడే మనకూ గౌరవం. అలాగే.. మానవుని మనస్సులో సంసార వ్యామోహం కారణంగా పేరుకుపోయిన అజ్ఞాన తిమిరం సత్సాంగత్యంతోనే పోతుంది. కలుషానికి మురికి,  పాపం అనే అర్థాలున్నాయి. పాపకార్యాలు దుఃఖానికి గురిచేస్తాయి. మనసులోని అటువంటి మాలిన్యం సాధువుల సాంగత్యంతో తొలగుతుంది. దుఃఖం దూరమౌతుంది. సాధుపుంగవుల చలువతో చిత్తం పరిశుద్ధమై ప్రగతిమార్గంలో పయనిస్తుంది. కాబట్టి, సాధువులు, ఉత్తముల సలహాలు పాటించి వారి అడుగుజాడల్లో నడిచి తదుపరి తరాలకు ఆదర్శంగా నిలుద్దాం.


విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య, 9948348918

Updated Date - 2020-09-18T09:58:25+05:30 IST