ప్రశాంతతే ఆయుధం!

ABN , First Publish Date - 2020-03-20T06:06:06+05:30 IST

కోపాన్ని జయించాలన్న మాట తరచూ వినబడుతుంటుంది. ఎవరైనా విలువైన దాన్ని జయించాలని అనుకుంటారు. అవసరం లేనిదాన్ని గెలుద్దాం అనుకోరు కదా! అందుకే ‘జయించడం’ అనే ఆలోచనను వదిలెయ్యండి...

ప్రశాంతతే ఆయుధం!

కోపాన్ని జయించాలన్న మాట తరచూ వినబడుతుంటుంది. ఎవరైనా విలువైన దాన్ని జయించాలని అనుకుంటారు. అవసరం లేనిదాన్ని గెలుద్దాం అనుకోరు కదా! అందుకే ‘జయించడం’ అనే ఆలోచనను వదిలెయ్యండి. మనకు ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. ఎందుకంటే, మన శరీరం, మన మనస్సు, మన శక్తి మీకు అనుకూలంగా ప్రవర్తించడం లేదు కాబట్టి! అంటే, కోపం అన్ని సమయాల్లోనూ లేదు.  అన్ని సమయాల్లోనూ లేని దాన్ని జయించడం లేదా నియంత్రించడం వృథా శ్రమ. 

    

మన మనసు ఒక్కోసారి చిరాకుగా మారుతుంది. అలాంటి చిరాకులో ఒక రూపాన్ని మనం ‘కోపం’ అంటాం. ఈ ప్రపంచంలో చిరాకు పుష్కలంగా ఉంది. ఈ ప్రపంచంలో నడుస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఎంత ఆపాలని చూసినా, ఎక్కడో ఒక చోట చిరాకులోకి అడుగుపెడుతూనే ఉంటాం. చుట్టూ ఉన్న పరిస్థితులు చిరాకుగా అనిపించినప్పుడు మనం కూడా చిరాకుగా మారిపోవడం తెలివైన పని కాదు. అలాంటి సమయంలోనే ప్రశాంతంగా ఉండాలి. ప్రసన్నంగా ఉండాలి. అదీ ముఖ్యం. 


అలాగని కోపం తెచ్చుకోవద్దని చెప్పడం లేదు. ఒకవేళ కోపం మధురానుభూతిగా అనిపిస్తే, ఎల్లప్పుడూ కోపం తెచ్చుకుంటూనే ఉండవచ్చు. కానీ మన కోపానికి గురైన వాళ్ళ కన్నా మనమే ఎక్కువ బాధపడతాం. అప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఏముంది? కళ్ళు మూసుకొని కారు డ్రైవ్‌ చెయ్యడానికి ప్రయత్నించామనుకోండి. ఎంతో కష్టపడి, ఒకరిద్దరిని ఢీకొట్టి, ఎలాగో ఇంటికి చేరుకోవచ్చేమో! కానీ ప్రతిసారీ ఇలాగే చేస్తే కొద్ది రోజుల తరువాత మనం జీవించి ఉండం.. చిరాకు, కోపం విషయంలో ప్రవర్తనలు కూడా ఇలాగే ఉంటాయి. మన శ్రేయస్సును మనం కళ్ళు మూసుకొని నియంత్రించాలని చూస్తున్నాం. దాని వల్ల  శ్రేయస్సు దొరకదు. నియంత్రించాల్సింది కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరచుకొని! కోపం విషయంలోనూ అంతే. ప్రశాంతత అలవరచుకుంటే... చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా చిరాకు పెరగదు. అది ఇక కోపంగా మారే ప్రశ్నే లేదు! కాబట్టి దాన్ని జయించడానికి గొప్ప ప్రయత్నాలు అవసరం లేదు. 


వారి ఆకలి తీరుద్దాం! ఆ వైర్‌సను తరిమేద్దాం!

‘‘ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కల్లోలం చేస్తోంది. దీని కారణంగా అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ఎందరికో ఉపాధి పోయింది. రోజుకూలి డబ్బుతో బతికే వారి జీవనోపాధి ఎలా? ఇది చాలా కీలకమైన విషయం. ఆదాయం లేక ఆకలి తీర్చుకోలేనప్పుడు చావుకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. సామాజిక అశాంతి తలెత్తుతుంది. జీవనోపాధి దెబ్బతిన్న వారికి రోజూ పోషకాహారం అందించడం సమాజంలో ఉన్న మన అందరి కనీస బాధ్యత. అందరం కలిసికట్టుగా నిలబడదాం. వైర్‌సను తరిమికొడదాం!’’


సద్గురు జగ్గీ వాసుదేవ్‌

Updated Date - 2020-03-20T06:06:06+05:30 IST