Saddula Bathukamma: పూజకు వేళాయే.. పూలు కొనలేకపోయే.!

ABN , First Publish Date - 2021-10-14T17:11:01+05:30 IST

మార్కెట్‌లో కూరగాయల రేట్లతోపాటు పూల ధరలు సైతం వి పరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పూల ధరలు అందుబాటులో ఉంటాయని భావించిన నగరవాసికి వ్యాపారులు షాక్‌

Saddula Bathukamma: పూజకు వేళాయే.. పూలు కొనలేకపోయే.!

సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని లంగర్‌హౌజ్‌కు చెందిన వనిత పూల కోసం సమీపంలోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు వెళ్లింది. చామంతి పూలు కిలో రూ. 150 అనడంతో కంగారు పడింది. వారం క్రితం ఇరవయ్యే కదా.. అని రుసరుసలాడుతూ మరో దుకాణానికి వెళ్లింది. అక్కడ కూడా అదే రేటు విని.. పూలు కొనలేక వెనుదిరిగింది. పండుగ సందర్భంగా పూల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. దీంతో చాలా మంది ధరలు చూసి హడలిపోతున్నారు. తప్పనిసరి తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. 


పూలకు ధరల‘రెక్కలు’

మార్కెట్లలో మండుతున్న పూల ధరలు

ప్రధాన మార్కెట్లలో రూ.150కి 

కిలో చామంతి, లిల్లీ, మల్బర్‌ గులాబీలు

కనకాంబరాలు కేజీ రూ.400, మల్లెపూలు రూ.200 

రూ. 30కి 5 కట్టల తంగేడు 

రూ.20కి 5 కట్టల గునుగు పువ్వు 

డెకరేషన్‌.. సామాన్యులకు పెద్ద పరేషన్‌ 

దసరా నేపథ్యంలో వ్యాపారుల ‘ధరా’ఘాతం


హైదరాబాద్‌ సిటీ: మార్కెట్‌లో కూరగాయల రేట్లతోపాటు పూల ధరలు సైతం వి పరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పూల ధరలు అందుబాటులో ఉంటాయని భావించిన నగరవాసికి వ్యాపారులు షాక్‌ ఇస్తున్నారు. గురువారం సద్దుల బతుకమ్మ, శుక్రవారం విజయ దశమి పర్వదినం సందర్భంగా ఇటు గౌరీదేవికి, అటు దుర్గామాత అలంకరణ, పూజకు కావాల్సిన పూలను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. రిటైల్‌ వ్యాపారులైతే మూడు, నాలుగింతలు ధరలు పెంచి అందిన కాడికి దండుకుంటున్నారు. పూల కు ‘ధరల రెక్కలు’ తొడిగి విక్రయిస్తుండడంతో పండుగల నేపథ్యంలో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.


15 టన్నులు విక్రయం..

నగరంలో అతిపెద్దదిగా పేరొందిన గుడి మల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు శివారు ప్రాంతాలు, వివిధ రాష్ర్టాల నుంచి పూలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్‌, మోయునాబాద్‌, శంకర్‌పల్లి మండలాలతోపాటు కర్ణాకటలోని చుబుల్లాపూర్‌, తమిళనాడులోని మసూరా, మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి పూలను తీసుకొస్తుంటారు. కాగా, మార్కెట్‌లోని 195 లైసెన్స్‌ దుకాణాల్లో సాధారణంగా రోజూ 3 నుంచి 5 టన్నుల పూలు అమ్ముతుంటారు. పండుగ రోజుల్లో దాదాపు 10 నుంచి 15 టన్నుల మేరకు పూలను విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. 


రూ.2 కోట్ల వ్యాపారం

గణపతి, దేవి నవరాత్రి ఉత్సవాలతోపాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో ఉపయోగించే డెకరేషన్‌ పూలను థాయిలాండ్‌ దేశంతో పాటు, ఆంథోరియా, జిప్సోలియా, జిప్సీ, ఆస్ర్పే, గిలాడ్స్‌ పూలను బెంగళూరు, మహారాష్ట్ర, పూనే, నాసిక్‌, ఔరంగాబాద్‌ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ మార్కెట్‌లో సాధారణ రోజుల్లో రూ.10 నుంచి రూ.15 లక్షల వ్యాపారం జరుగుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు రూ.2కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 


అమ్మో.. ఇవేం రేట్లు

బతుకమ్మ పండుగ కోసం పూలు కొందామని మార్కెట్‌కు వచ్చిన. ఇక్కడ రేట్లను చూస్తే వణుకు పుట్టింది. చామంతి, బంతి పూల ధర కిలో రూ.150 చెప్పిండ్రు. తంగేడు పూలు 5 కట్టలకు రూ.30, రూ.20కి గునుగు పువ్వు 5 కట్టలు ఇస్తున్నారు. అమ్మో.. గుడి మల్కాపూర్‌ మార్కెట్‌లో ఇంత రేట్లు నేను ఎన్నడూ చూడలే..!

- రేణుక, గుడిమల్కాపూర్‌


పండుగలప్పుడే రేటు

వినాయకచవితి, దసరా, దీపావళి పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో పూల ధరలు పెరుగుతుంటాయి. ఒక రోజు ఉన్న ధర మరో రోజు ఉండదు. ప్రభుత్వం మార్కెట్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. కొనుగోలుదారులకు తమవంతు సహకారం తప్పకుండా ఉంటుంది. 

- మహిపాల్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌


నాలుగైదు రెట్లు అధికం 

సాధారణ రోజుల్లో ఒక్కో రకం పువ్వు కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్న వ్యాపారులు పండుగ రోజుల్లో ధరలు పెంచి దడ పుట్టిస్తున్నారు. రిటైల్‌ వ్యాపారులైతే ఇష్టమొచ్చిన ధర చెబుతున్నారు. మార్కెట్‌లో వారం క్రితం పోల్చితే బుధవారం నాలుగైదు రెట్లు ధరలు పెరిగాయి. డిమాండ్‌ నేపథ్యంలో కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులు సరుకును దాచిపెడుతున్నారు. మార్కెట్‌లో 60 శాతం పూలు తగ్గిపోయిన తర్వాత రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. గంటల వ్యవధిలోనే రేట్లు అప్‌అండ్‌డౌన్‌ అవుతుంటాయని, నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-14T17:11:01+05:30 IST