ఏజెన్సీలో సాదాబైనామా పట్టాలకు కొత్తకొర్రీ

ABN , First Publish Date - 2021-10-19T05:06:40+05:30 IST

ఏజెన్సీలో సాదాబైనామా పట్టాలకు కొత్తకొర్రీ

ఏజెన్సీలో సాదాబైనామా పట్టాలకు కొత్తకొర్రీ

ఐదెకరాల కంటే ఎక్కువ ఉన్నవారికి మొండిచెయ్యి

భద్రాద్రి జిల్లాలో మొత్తం దరఖాస్తులు 62,511 

కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబర్‌ 18: గిరిజన ప్రాంతాల్లో ఎంతో కాలంగా సేద్యం చేస్తూ భూ హక్కు పత్రాలులేక ఇబ్బంది పడుతున్న రైతులకు హక్కు కల్పించే విషయంలో ప్రభుత్వం కొత్తకొర్రీ పెట్టింది.  ఐదెకరాలలోపు ఉన్న వారికే పట్టాలు జారీ చేస్తామని, ఆపై సేద్యం చేస్తున్న రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తూ ప్రభ్తుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనరైతులు మరోమారు బంగపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో కాలంగా ప్రభుత్వ, సీలింగ్‌, పట్టా భూములు కొనుగోలు చేసి సేద్యం చేస్తున్నారు. వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి రిజిస్ట్రేషన్‌తో పనిలేకుండా కేవలం సాదభైనామ(తెల్లకాగితాలపై) క్రయ విక్రయాలు చేసుకున్నా వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గిరిజన రైతుల్లో కొత్త ఆశచిగురించింది. దీంతో 1 ఆగస్టు 2020 నుంచి 29సెప్టెంబర్‌ వరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో భద్రాద్రి జిల్లాలో 23మండలాల నుంచి  62,511మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ సమయంలో ఎలాంటి విధి విధానాలు జారీ చేయలేదు. దీంతో వారంతా యథాతదంగా కొనుగోలు చేసిన భూముల క్రయ విక్రయాల పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. తీరా పట్టాల జారీ చేసే సమయంలో విధి విధానాలు ప్రకటిస్తూ సీసీఎల్‌ఏలోనే 5 ఎకరాలపై బడిన వారి దరఖాస్తులను తిరస్కరించి, 5 ఎకరాలలోపు ఉన్న దరఖాస్తులను విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌లకు జాబితాను పంపడం జరిగింది. ఈ క్రమంలో 5ఎకరాలపై బడిన రైతుల   దరఖాస్తులు తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో గిరిజనుల పట్టాదారు పాసుపుస్తకం ఆశపై నీళ్లు జల్లినట్లైంది. ఉచితంగా పట్టాలిచ్చే భూములకు ఆంక్షలుండాలి. కానీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన గిరిజన రైతులపై ఆంక్షలేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 5 ఎకరాలకు ఎక్కువ ఉంటే అధికంగా ఉన్న భూములను డబ్బులు చెల్లింపు అవకాశం ఇచ్చినా, లేదా 5 ఎకరాలకు పట్టా ఇచ్చి మిగిలిన భూమికి పట్టా ఇవ్వకున్నా కొంత మెరుగైయ్యేదని గిరిజనులు ఆభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే కొంతవరకైనా న్యాయం జరిగేదంటు న్నారు. ఇదిలా ఉంటే సమగ్ర భూ ప్రక్షాళన సమయంలో స్థానిక అధి కారులు కొన్ని సర్వే నెంబర్లను ధరణి లో నమోదు చేయలేదు. అయినా ఆయా భూముల్లోనూ గిరిజన రైతులు కొనుగోలు చేసి సేద్యం చేస్తున్నారు. వారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఉదాహరణ కు టేకులపల్లి మండలం గంగారం రెవెన్యూ గ్రామంలో గల 303/391లో సీలింగ్‌ భూమి 52ఎకరాలుంది. గత 40 సంవత్సరాలు గా గిరిజనులు సేద్యం చేస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు భూములను ధరణిలో నమోదు చేసే సమయంలో ఆ సర్వే నెంబర్‌లో కేవలం 12ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైంది. మిగిలిన 40ఎకరాలు ధరణిలో నమోదు చేయలేదు. దీంతో భూమిలో సేద్యం చేస్తున్న రైతులకు పట్టా జారీ సంశయంగా మారింది. ఇది జిల్లాలో ఒక మచ్చుతునక మాత్రమే. ప్రతి మండలంలో ధరణిలో నమోదు చేయని వ్యవసాయ భూమి వేల ఎకరాల్లో ఉంది. దీనిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-10-19T05:06:40+05:30 IST