సాదా బైనామాతో హైరానా

ABN , First Publish Date - 2022-01-26T05:32:29+05:30 IST

ధరణిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలను ఇస్తూ ఇటీవల కలెక్టర్లకు తహసీలార్లు సమర్పించిన నివేదికల్లో ఎక్కువ భాగం సాదాబైనామా గురించే ఉన్నట్టు తెలుస్తోంది.

సాదా బైనామాతో హైరానా

దశాబ్దాలుగా అపరిష్కృతం
క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ
ఏడాదవుతున్నా పరిశీలనకు నోచని వైనం
రాయితీలు అందక నష్టపోతున్న రైతులు
ధరణిలో సాదాబైనామా ఆప్షన్‌కు సిఫార్సు
కలెక్టర్లకు సమర్పించిన నివేదికల్లో తహసీల్దార్ల సిఫార్సు
తాజాగా చర్చకు వచ్చిన తెల్లకాగిత ఒప్పందాలు




హనుమకొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) :
ధరణిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలను ఇస్తూ ఇటీవల కలెక్టర్లకు తహసీలార్లు సమర్పించిన నివేదికల్లో ఎక్కువ భాగం సాదాబైనామా గురించే ఉన్నట్టు తెలుస్తోంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు ధరణి పోర్టల్‌లో ఆప్షన్‌ను కల్పించాలని పలువురు తహసీల్దార్లు కోరినట్టు సమాచారం. 2017లో క్రమబద్ధీకరణ జరిగిన సాదాబైమానా భూముల మ్యుటేషన్‌కు కూడా అవకాశం కల్పించాలని కోరడంతో పాటు క్రమబద్ధీకరణకు కిందటేడు స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి ధరణిలో అవకాశం కల్పించాలని కోరడంతో సాదాబైనామా సమస్య మరోసారి తాజాగా చర్చకు వచ్చింది.

నలుగుతున్న సమస్య
తెలిసో తెలియకో తెల్లకాగితంపై ఒప్పందం చేసుకొని (సాదాబైనామా) భూములు కొనుగోలు చేసినవారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విషయంలో రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నేట్టే కనిపించినా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.

సాదాబైనామా సమస్యకు సంబంధించిన సమస్య దశాబ్దాల తరబడి మగ్గుతోంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వెల్లువలా వచ్చిన దరఖాస్తులే ఇందుకు ఉదాహరణ. తెలంగాణకే పరిమితమైన ఈ సాదాబైనామా సమస్యను సమైక్యాంధ్రలో అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆనాడు కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌) చేసిన సిఫార్సులను కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుండడం పట్ల సాదాబైనామా రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇబ్బందులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వేలాది మంది  చిన్న, సన్నకారు రైతులు తాము సాగుచేస్తున్న భూములు తమరివే అయినా దాదాపు 70 నుంచి 90 శాతం మందికి ఈ భూ ముల స్వరూపం, క్రమబద్ధీకరణ కాకపోవడంతో నానా ఇ బ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నారు. రైతుబంధు కింద సాయం కూడా అందడం లేదు. రైతు బీమా పథకం కూడా వర్తించడం లేదు. ధాన్యం కొనుగోలు సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాదాబైనామా అంటే తెల్లకాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్‌ కా నీ క్రయవిక్రయాలు. రిజిస్ట్రేషన్‌ కానీ ఏ కాగితాల ద్వారా భూమి కొనుగోలు చేసినా అది సాదాబైనామా అవుతుంది.

దరఖాస్తులు తీసుకున్నా..

భూ క్రయవిక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై ఒప్పందం చేసుకున్న రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ఆయా పత్రాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు చేసిన భూములకు చట్టబద్ధత కల్పించడానికి రిజిస్ట్రేషన్ల పక్రియ చేపట్టి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని అర్హుల నుంచి సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వరదలా వచ్చి పడ్డాయి. సుమారు 1.40 లక్షల దరఖాస్తులు దాఖలయ్యాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.  మహబూబాబాద్‌ జిల్లాలో 35వేలు, వరంగల్‌ జిల్లాలో 30వేలు,  ము లుగు జిల్లాలో 27వేల దరఖాస్తులు అందాయి. మిగతా 40వేల దరఖాస్తులను హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో రైతులు పెట్టుకున్నారు. ఇలా దరఖా స్తు చేసుకొని ఏడాది కావస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగేళ్ల కిందట
నాలుగేళ్ల కిందట ప్రభుత్వం తొలిసారిగా సాదాబైనామాల క్రమబద్ధీకరణలో ఐదెకరాలలోపు వ్యవసాయ భూములకు ఉచితంగా తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టా మార్పిడీ ప్రక్రియ చేపట్టింది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు అప్పట్లో తీసుకోలేదు. ఐదెకరాల కంటే అధిక విస్తీర్ణం ఉన్న భూములకు నిబంధనల మేరకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుము వసూలు చేశారు. అప్పుడు కొంత మేరకు సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ జరిగింది.

అయితే  చాలా మంది రైతులు అవగాహన లేక, ఇతరత్రా కారణాల వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయారు. దరఖాస్తులను సరైన విధంగా సమర్పించకపోవడం వల్ల సాంకేతిక కారణాలతో కొన్ని తిరస్కారానికి గురయ్యాయి. ఏడాది కిందట మరోమారు తెల్లకాగితంపై రాసుకున్న భూక్రయ విక్రయాలకు చట్ట బద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు ఆహ్వానించింది అయితే దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియ అనూహ్యంగా నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని, అందువల్లే దరఖాస్తులకు మోక్షం లభించడంలేదని అధికారులు పేర్కొంటున్నారు.

జారీకాని మార్గదర్శకాలు
ప్రభుత్వం నుంచి సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి సంబఽంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం భూలావాదేవీలు పూర్తిగా ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే ఉంది. పోర్టల్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తే దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా దీనిపై నిర్ణయం తీసుకుంటే తహసీల్దార్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడతారు.

Updated Date - 2022-01-26T05:32:29+05:30 IST