‘సడా’పై ఆసక్తి నిల్‌

ABN , First Publish Date - 2021-04-19T05:25:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ సడాయాక్ట్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అమలుకు రొయ్య రైతుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.

‘సడా’పై ఆసక్తి నిల్‌

ఆక్వా రైతు రక్షణ యాక్ట్‌కు మూడు నెలలవుతున్నా నిరాదరణే

ఇప్పటి వరకు జిల్లాలో 600పైగా మాత్రమే నమోదు 

యాక్టుతో రైతుకు సంపూర్ణ రక్షణ అంటున్న జేడీ


భీమవరం, ఏప్రిల్‌ 18 : రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ సడాయాక్ట్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అమలుకు రొయ్య రైతుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఆక్వా రైతులకు ఈ యాక్టుతో అన్ని కోణాల్లోనూ రక్షణ కల్పించే విధంగా నియమావళిని రూపొందించి ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో రొయ్య రైతులు 30 వేల మందికి పైగా, మరో 90 వేల మంది వరకు చేపల రైతులు ఉన్నారు. వీరిలో 660 మంది రైతులు పైగా మాత్రమే నమోదు చేసుకున్నారని తెలిసింది.  ఆక్వా రంగంలో రైతులు అనుభవిస్తున్న అన్ని రకాల ఇబ్బందులను పరిష్కరించడానికి, ఆక్వా ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పెంచడానికి, ఒక క్రమబద్ధమైన సాగు విధానాన్ని అమలు చేయడానికి ప్రపంచ దేశాలలో అమలవుతున్న విధానాలను పర్యవేక్షించి ఈ యాక్టు రూపొందింది. ఈ యాక్టు ప్రకారం గ్రామ సచివాలయం ద్వారా రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న పక్షం రోజుల్లో జీవితకాల ధ్రువీకరణను మత్స్యశాఖ జారీ చేస్తుంది. ఇంతవరకు సర్టిఫికెట్‌ ఉన్నవారైతే పాత సర్టిఫికెట్‌, రైతు వివరాలు నమోదు చేసుకోవాలి. కొత్తగా చెరువు తవ్వేవారు చెరువు, భూమి వివరాలను నమోదు చేసుకోవాలి. దీనివల్ల రాబోయే రోజుల్లో ధ్రువీకరణ ఉన్న రైతులకు నాణ్యత కలిగిన సీడు, ఫీడు లభించే అవకాశం ఉంది. సాగు విధానాన్ని ప్రారంభం నుంచి పట్టుబడుల వరకు రికార్డు చేస్తారు. ఫలితంగా నాణ్యత లేని సీడు, ఫీడు, సాగు ఉత్పత్తికి ఉపయోగించే బలవర్ధక ఆహారాలు నిషేధించబడతాయి. సాగులో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, నాణ్యత పెరుగుతుంది.  ఈ చట్టంపై 90 శాతం మంది రైతులకు అవగాహన లేదు. ప్రచారం చేసి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మత్స్యశాఖది. ఉదాహరణకు నరసాపురం డివిజన్‌లో 179 మంది మత్స్యశాఖ విస్తరణ అధికారులు గ్రామాల్లో పనిచేస్తున్నారు. వారంతా యాక్టులో ఉన్న అంశాల పట్ల రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మరి వారు ఏమేరకు కార్యాచరణలో ఉన్నారో ఆ శాఖకే తెలియాలి. అందుకే నమోదు చాలా తక్కువగా జిల్లా వ్యాప్తంగా 660 దాటినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా వేల మంది రైతులు నమోదు కావల్సి ఉంది. 


రైతులకు సంపూర్ణ రక్షణ లభ్యం : ఎ.చంద్రశేఖర్‌, జిల్లా జేడీ, మత్స్యశాఖ 

సడా యాక్టు వల్ల రైతులకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. దీర్ఘకాలికంగా రైతులు కోరుతున్నందు వల్ల ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కచ్చితంగా రైతులు నమోదు చేసుకోవాలి. దీనివల్ల నాణ్యత కలిగిన చేప, రొయ్య పిల్లలు, నాణ్యత కలిగిన ఆహార ఉత్పత్తులు పొందడానికి మెరుగైన ఎగుమతి అవకాశాలు, రైతులకు మంచి ధర లభిస్తుంది.

Updated Date - 2021-04-19T05:25:09+05:30 IST