Abn logo
Sep 16 2021 @ 21:21PM

మోదీ పుట్టిన రోజున సాద్ ‘బ్లాక్ డే’ పరేడ్

న్యూఢిల్లీ: సాగు చట్టాలు ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17ను ‘బ్లాక్ డే’గా పరిగణిస్తున్నట్లు పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ (సాద్) పార్టీ బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ‘బ్లాక్ ఫ్రైడే ప్రొటెస్ట్ మార్చ్’ అనే పేరుతో ఢిల్లీలోని గురుద్వారా సాహిబ్ గంజ్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. నిజానికి ఇదే రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈరోజును ‘జాతీయ నిరుద్యోగుల దినోత్సవం’గా కొంత మంది నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అవుతోంది. ఇదే తరుణంలో శిరోమణి అకాలీ దళ్ కూడా ‘బ్లాక్ డే’ నిర్వహిస్తుండడం విశేషం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మోదీ కేబినెట్ నుంచి బయటికి వచ్చిన సాద్ నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఈ నిరసనలో పాల్గొననున్నారు. సాద్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు సమాచారం.